fbpx
Home Politics జోరుగా వోట్లు పీకేసే ఉద్యమం, ఆంధ్రోళ్లకేమయింది?

జోరుగా వోట్లు పీకేసే ఉద్యమం, ఆంధ్రోళ్లకేమయింది?

ఆంధ్రప్రదేశ్ లో గిట్టని వోట్ల ఏరివేత ఉద్యమం మొదలయింది. బోగస్ వోట్లను తీసేస్తారు గాని, గిట్టని వాళ్ల వోట్లను పీకించేందుకు అజ్ఞాత వ్యక్తులు రంగ  ప్రవేశం చేశారు.

 ఒక వైపు వోటు నమోదు చేయించుకోండని ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెట్టి క్యాంపెయిన్ నిర్వహిస్తుంటే, ఉన్న ఓటు వద్దు తీసేయండని లక్షల మంది ఎన్నికల కమిషన్ కు దరఖాస్తులు చేశారు.

కొంతమంది మాపక్కింటాయన వోటు తీసేయండని కోరుతూ దరఖాస్తుచేస్తున్నారు. కొన్ని చొట్ల అజ్ఞాత వ్యక్తులు కూడా గిట్టని వాళ్ల వోట్లు తీసేయండని కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేస్తున్నారు. ఇవి మొత్తానికి వ్యక్తులు చేసే పనికాదు, పార్టీలు లేదా వాళ్ల తరఫున ఐటి కంపెనీలు మాత్రమే  ఇంత పెద్ద ఎత్తున ఆన్ లైన్ దరఖాస్తులు చేయగలవు.

మొత్తానికి ఆంధ్ర పార్టీలకు వోటంటే, ఒటరంటే భయపట్టుకుంది. వాడెటు వోటు వేస్తాడో, ఎందుకయినా , వాడి వోటు పెరికేయండనే ఉద్యమం మొదలపెట్టినట్లు కనిపిస్తుంది.

ఎన్నికల కమిషన్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఓటను తొలగించండని అభ్యర్థనలు రాలేదని అధికారులు చెబుతున్నారు . అందుకే వారికీ అనుమానం వచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలో 13.16 లక్షల మంది ఫలానా వాడి వోటు తీసేయండి అని అభ్యర్థనలు పంపారు. ఆంధ్రలో ఉన్నమొత్తం ఓట్లు 3.69 కోట్లు. అంటే మొత్తం ఓటర్ల జనాభాలో 3.7 శాతం మంది వోట్లు తీసేందుకు కుట్ర జరుగుతన్నదనుకోవాలి.

3.7 శాతం ఓట్లంటే చాలా చాలా ఎక్కువ వోట్లు. ఎందుకంటే, రాష్ట్రంలో 2014లో టిడిపి, వైసిపిలకు పోలయిన ఓట్ల మధ్య తేడా కంటే ఇది చాలా ఎక్కువ.

ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి (బిజెపి తీసేసి)కి, వైసిపి కి మధ్య తేడా 6,01,539 ఓట్లు మాత్రమే.అంటే అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి, ఓడిపోయిన వైసిపిక మధ్య తేడా 1.68 శాతం ఓట్లు మాత్రమే. ఇలాంటపుడు 3.7 శాతం ఓట్లను తీసేసినా కలిపినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే ఓటరు మహాశయుడిని ఎవరు నమ్మారు, ముందు వాడివోటు పెరికేయండని  ఏ పార్టీకి చెందని వోటర్లను పెరిగే పనిలో పార్టీలు పడ్డాయని ఏ పార్టీకి చెందని వాళ్లంటున్నారు.

వేల సంఖ్యలో ఒక్కసారిగా దరఖాస్తులు అదీ కూడా ఆన్ లైన్ లో రావడంతో అధికారులు కంగుతిన్నారు. ఇలా వోటు పీకేయండి  అంటున్నవాళ్లెవరో కొనుక్కోండని మండల స్థాయి అధికారులను  ఎన్నికల అధికారులు  పురమాయించారు. వాళ్లు కనుకొన్న చాలా విషయాలు చాలా ఆసక్తిగాఉన్నాయి.

మెజారిటీ అభ్యర్థులు చదువురాని వాళ్లు, కూలీలు, గొర్రెల కాపర్లు. తమ వోటు తీసేయండని ఒక అభ్యర్థన ఎన్నికల కమిషన్ కు వెళ్లిన విషయం కూడా వారికి తెలియదు. వాళ్లు బతుకుదెరువు పనుల్లో బిజిగా ఉన్నారు. దగ్గర్ల ఉన్న ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి వోటు తీసేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు ఫామ్ -7 పంపేంత తీరుబడి వారికి ఎక్కడిది?

వోటు తీసేయండని ఫామ్ -7 దాఖలు చేయడం ఫిబ్రవరి 26న మొదలయింది. ఫామ్ -7 ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఇక్కడి క్లిక్ చేయండి.

రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి వేల సంఖ్యలో వోటు పీకేయండనేది  ఉద్యమ స్థాయిలో సాగింది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో ప్రతిమండలం నుంచి 1000 నుంచి 1500 వంది వోటొద్దు పీకేయండి అన్నారు.

హైదరాబాద్ ఐటి గ్రిడ్స్ కంపెనీ డేటా చోర్యం బయటపడగానే స్విచ్ ఆఫ్ చేసినట్లు ఈ దరఖాస్తులు ఆగిపోయాయి. ఫామ్ – 7 దాఖలు చేసిన వారి వెరిఫికేషన్ లో ఆసక్తికరమయిన విషయాలు బయటపడుతున్నాయి. కృష్ణా జిల్లా జి.కొండూరు మండల్లో ఒక పశువుల కాపరి ఏకంగా 50 ఫామ్ -7 అభ్యర్థనలు పంపాడని ఎమ్మార్వో ఎ. శ్రీనివాస్ టైమ్స్ ఆఫ్ ఇండియా కు చెప్పారు. 50 అభ్యర్థనలను పరిశీలిస్తే వారంతా ఆ అడ్రసులలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇలాంటి ఫేక్ అభ్యర్థనలే మైలవరం, రెడ్ది గూడెం, నందిగామ, నూజివీడు మండలాలో కూడా జరిగిందని టైమ్స్ రాసింది. ఒక్క కృష్ణా జిల్లాలనుంచే 30 వేల ఓట్ల తొలగింపునకు అభ్యర్థనలు అందాయి. దీనికి సంబంధించి 13 సంఘటనలలో కేసులు బుక్ చేసినట్లు కృష్ణ జిల్లా ఎస్ పి సర్వశ్రేష్ట త్రిపాఠి చెప్పారు.

ఇతర జిల్లాల సంగతి చూడండి. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల తొలగింపు కోసం 28 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆన్‌లైన్‌లో 24 వేల అభ్యర్థనలు అందాయి నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే కురుపాంలో 3,349, సాలూరులో 3,643, చీపురుపల్లిలో 7,296, గజపతినగరంలో 4,845, విజయనగరంలో 698, నెల్లిమర్లలో 3,800, బొబ్బిలిలో 8,734, పార్వతీపురంలో 422, ఎస్‌.కోటలో 7,534 దరఖాస్తులు ఓట్లు తొలగించాలని ఎన్నికల అధికారులకు అందాయని సాక్షి రాసింది. ఈ తప్పుడు దరఖాస్తులపై జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదయ్యాయి.

విశాఖపట్నం జిల్లాలో ఈ ఏడాది జనవరి 23, 24 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కొత్త ఓటర్ల నమోదు కోసం 13,999 దరఖాస్తులు అందాయి. అపుడు తొలగింపుల కోసం 1955 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే, జనవరి 25 నుంచి మార్చి 1 వరకు జిల్లాలో తొలగింపుల కోసం ఏకంగా 74,848 దరఖాస్తులందాయి.

తూర్పుగోదావరి జిల్లాలో గా 90 వేల ఓట్లు తొలగించాలాని అభ్యర్థనలు అందినట్లు సమాచారం.పశ్చిమ గోదావరి జిల్లాలో ఫామ్‌–7 ద్వారా ఓట్లు తొలగించాలని 55,062 దరఖాస్తులు వచ్చాయని తెలిసింది.

గుంటూరు జిల్లానుంచి అందిన దరఖాస్తులు 1,09,079. చిత్తూరు జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు ఓట్లు తొలగించడానికి ఆన్‌లైన్‌ ద్వారా 89,547 దరఖాస్తులు అందాయి.కర్నూలు జిల్లాలో అనుమానాస్పద ఓటర్లు, డూప్లికేట్‌ ఓట్ల పేరుతో ఓట్లు తొలగించాలని 35 వేలకు పైగా ఫామ్‌–7 దరఖాస్తులు వచ్చాయి.

అనంతపురం జిల్లాలో ఫామ్‌–7 కింద 79,819 దరఖాస్తులు వచ్చాయని తెలిసింది. ఫామ్ 7 ని చేత టైపు చేయిస్తున్నారా లేక ఏదయినా ఐటి కంపెనీని ప్రయోగించి చేయిస్తున్నారో తెలియడం లేదు. మొత్తానికి 2014 లో వచ్చిన బక్కపల్చటి మెజారిటి లేదా లోటు ను పూడ్చుకునేందుకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉందని అర్థమవుతుంది. చాలా కాలిక్యులేటెడ్ గా ప్రతి మండలనుంచి కొందరు అమాయకులు వోట్లను తొలిగించేందుకు కుట్ర జరిగింది. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ఆన్‌లైన్‌లో ఫామ్‌–7 ద్వారా దరఖాస్తు చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తున్నది. ఇదంతా వైసిపి కుట్ర అని తెలుగుదేశం విమర్శిస్తున్నది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ