fbpx
Home Politics విద్యుత్ ఉత్పత్తికి ‘చెత్త’ పరిష్కారం..జబల్ పూర్ టాప్

విద్యుత్ ఉత్పత్తికి ‘చెత్త’ పరిష్కారం..జబల్ పూర్ టాప్

అవును మీరు చదవింది నిజమే. పరిష్కారం పక్కనే చెత్తుంది కదా అని ఇదేదో చెత్త అనుకునేరు. ఎంతమాత్రం కానే కాదు. రోజువారి తయారయ్యే వందల కొద్దీ చెత్తను ఎలా ఉపయోగించుకోవాలనే అంశానికి సంబంధించిందే ఈ కథనం. చెత్తను ఉపయోగించుకోవాలంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది విద్యుత్ ఉత్పత్తి మాత్రమే. రోజు రోజుకు అపరిమితంగా పెరిగపోతున్న చెత్తను ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నామన్న విషయంపైనే మనతెలివి తేటలుంటాయి.

 

ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఎంత తక్కువేసుకున్నా సుమారుగా 250 మెట్రిక్ టన్నుల చెత్త (మానవవ్యర్ధాలు) పోగవుతోంది. ఇంత చెత్త వల్ల ఏమవుతోందంటే జనాలకు అంటురోగాలొస్తున్నాయ్. మరి ఇంత చెత్తను ఏమి చేయాలి ? ఎలా ఉపయోగించుకోవాలన్నదే ఇఫుడు పెద్ద ప్రశ్న. అక్కడక్కడ చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతున్నా పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు. ఇక్కడే అందరికీ జబల్ పూర్ మున్సిపాలిటీపై అందరి కన్ను పడింది.

 

ఇంతకీ జబల్ పూర్ లో ఏం జరుగుతోంది ? ఏం జరుగుతోందంటే, జబల్ పూర్ మున్సిపాలిటీలో ప్రతీరోజు సేకరించే టన్నుల కొద్ది చెత్త నుండి భారీ ఎత్తున విద్యుత్ తయారు చేస్తున్నారు. ఆ తయారయ్యే విద్యుత్ సుమారు 18 వేల ఇళ్ళ అవసరాలకు ఉపయోగపడుతోందంటే నమ్మగలరా ? ఇంతకీ వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు ? ఎలా చేయగలుగుతున్నారో మీరే చదవండి.

 

 మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జబల్ పూర్ మూడో అతిపెద్ద మున్సిపాలిటీ. పైగా కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో కూడా ఎంపికైంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడున్న చెత్త ఉండటం ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం నచ్చలేదు. అందుకనే మున్సిపాలిటీలో పోగయ్యే చెత్తను సేకరించేందుకు లేబర్ ను నియమించారు. ఆ లేబర్ లో ప్రతీ ఒక్కరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐ) రీడర్లను కేటాయించింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతీ ఇంటికి ఆర్ఎఫఐ ట్యాగులు అమర్చారు. ప్రతీ ఇంట్లో చెత్తను తీసుకోగానే కార్మికులు రీడర్ ను ట్యాగులతో స్కాన్ చేస్తారు. దాని వల్ల ప్రతీ ఇంట్లోను చెత్త తీసుకుంటున్నది లేంది తెలిసిపోతుంది.

 

ఇళ్ళ సంగతిని పక్కనపెడితే కమ్యూనిటీల్లో కూడా డస్ట్ బిన్లను ఏర్పాటు చేసింది. కమ్యూనిటి డస్టుబిన్లంటే మూడు నాలుగు వీధులకొకటి చొప్పున పెద్ద చెత్తకుండీలనుకోండి. ప్రతీ చెత్తకుండీకి ఓ సెన్సార్ ను కేటాయించారు. కుండీల్లో 90 శాతం చెత్త పడగానే కుండీలను ఖాళీ చేయమంటూ సెన్సార్ల ద్వారా దగ్గర్లోని మున్సిపల్ అధికారులకు సమాచారం అందుతుంది. వెంటనే టిప్పర్ల ద్వారా చెత్తను సేకరించి 15 కిలోమీటర్ల దూరంలోనే సాలిగ్ వేస్ట్ మేనేజ్ మెంటు ప్లాంటుకు తరలిస్తారు. అటువంటి కమ్యూనిటీ చెత్తకుండీలు సుమారు 400 దాకా ఉన్నాయి. అంటే ప్రతీ రోజు 400 కుండీల నుండి టన్నుల కొద్దీ చెత్త ప్లాంటుకు చేరుతుంది.

 

400 చెత్తకుండీల నుండి సేకరించిన 600 మెట్రిక్ టన్నుల చెత్తలో తడి, పొడి చెత్తను వేరు చేసి 11.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్తునే సుమారు 18 వేల ఇళ్ళకు సరఫరా చేస్తున్నారు. చూశారా జబల్ పూర్ మున్సిపాలిటీ ఎంత ఘనతను సాధించిందో. మరి అదే పద్దతిలో హైదారాబాద్ లో కూడా విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెడితే ఎంత బాగుంటుంది ? చెత్తను రోజువారి సేకరించినట్లూ ఉంటుంది. చెత్తనుండి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లూ ఉంటుంది. కాకపోతే అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఉండాల్సింది చిత్తశుద్ది మాత్రమే. మరి ఇక్కడి అధికారుల నుండి చె(చి)త్తశుద్దిని ఆశించవచ్చా ?

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ