ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రిష్ సినిమాకు బ్రేకులు ప‌డ్డాయా.. అస‌లేం జ‌రిగింది!

టాలీవుడ్ టాప్ హీరోల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రు. ఆయ‌న క్రేజ్ మ‌రే హీరోకు అంత‌గా లేద‌నే చెప్పాలి. చేసింది త‌క్కువ సినిమాలే అయిన ప‌వ‌న్ మానియా అభిమానుల‌కు ఎంతో బూస్ట‌ప్‌ని ఇస్తుంటుంది. రాజ‌కీయాల వ‌ల‌న రెండేళ్ల‌పాటు సినిమాలు చేయ‌క‌పోయేస‌రికి అభిమానులు పిచ్చెక్కిన‌ట్టు ఉన్నారు. ఎప్పుడైతే హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌గా వ‌కీల్ సాబ్ చేస్తున్నాడ‌ని అనౌన్స్ చేశారో ఇక అప్ప‌టి నుండి ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తు వ‌స్తున్నారు. క‌రోనా లేక‌పోయి ఉండి ఉంటే ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది.

వ‌కీల్ సాబ్ త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ వెళుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం, సాగ‌ర్ కె చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. అయితే క్రిష్ సినిమా కోసం దాదాపు నెల రోజులు స‌మ‌యం మాత్ర‌మే కేటాయించిన ప‌వ‌న్ ఇప్ప‌టికే ‌ చిత్రీకరణలో జాయిన్‌ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌ గురువారంతో పూర్తి కానుంది.

విరూపాక్ష అనే టైటిల్‌ని చిత్రానికి పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు 20 రోజులు బ్రేక్ ఇవ్వాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. గ్యాప్ లో ‘అయ్యపనుమ్‌ కోషియమ్‌’ షూటింగ్ మొద‌లు పెట్టేసి ఆ త‌ర్వాత ఫిబ్రవరి రెండో వారంలో తిరిగి క్రిష్ మూవీ టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌గా క్రిష్ మూవీని పూర్తి చేసి ఆ త‌ర్వాత నాన్ స్టాప్ షెడ్యూల్ తో మ‌ల‌యాళ చిత్రం రీమేక్ పూర్తి చేయాల‌ని అనుకుంటున్నాడు.

‘అయ్యపనుమ్‌ కోషియమ్‌’ రీమేక్ చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండ‌గా, ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించగా.. బిజూ మీనన్‌ పాత్రను పవన్ కల్యాణ్‌, పృథ్వీరాజ్ పాత్రలో రానా కనిపించనున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అనే సరికి అభిమానుల‌లో అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. ఈ ఏడాది వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక రానున్న రోజుల‌లో ఫ్యాన్స్‌కు పసందైన వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.