కుప్ప‌కూలిన భార‌త లైన‌ప్‌.. 16 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా

అడిలైడ్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ర‌స‌వత్త‌రంగా సాగుతుంది. ఈ రోజే మ్యాచ్ రిజ‌ల్ట్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 244 ఆలౌట్ కాగా, 191 ప‌రుగుల‌కి ఆస్ట్రేలియాని ప్యాక‌ప్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 53 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. అశ్విన్ స్పిన్ మ‌యాజాలం, బుమ్రా, ఉమేష్ యాద‌వ్ తోడు కావ‌డంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ ఏ ద‌శ‌లోను కోలుకోలేక‌పోయారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్‌కు మొద‌ట్లోనే పెద్ద షాక్ ఇచ్చాడు క‌మ్మిన్స్. తొలి వికెట్‌గా పృథ్వీషా వికెట్ తీసుకున్నాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి పృథ్వీ షా (4) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు చేసింది భార‌త్. మయాంక్‌ అగర్వాల్‌ (5 బ్యాటింగ్‌)తో పాటు నైట్‌వాచ్‌మెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా (0 ‌) క్రీజులో ఉన్నాడు. 62 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన కంగారూల ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్ధిశిస్తుందేమోన‌ని అంద‌రు భావించిన త‌రుణంలో కమ్మిన్స్, హాజిల్‌వుడ్ ధాటికి టాపార్డ‌ర్ పేక‌మేడ‌లా కూలింది.మ‌యాంగ్ అగ‌ర్వాల్(9)‌, పుజారా(0), కోహ్లీ(4), ర‌హానే(0), సాహా(4) , అశ్విన్ 0)లు అంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవీలియ‌న్‌కు క్యూ క‌ట్టారు.

టెస్ట్ బ్యాట్స్‌మెన్స్ పుజారా, ర‌హానేలు డ‌కౌట్‌గా వెనుదిరగ‌డం భార‌త్‌కు కోలుకోలేని దెబ్బ‌. మ‌రో వైపు కోహ్లీ కూడా త‌క్కువ స్కోరుకు వెనుదిర‌గ‌డంతో భార‌త్ క‌ష్టాల్లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో హ‌నుమ విహారి, అశ్విన్ ఉన్నారు. 80 ప‌రుగుల ఆధిక్యంలో భార‌త్ ఉండ‌గా, మ‌రో 70 ప‌రుగులు చేస్తే ఆసీస్‌పై గెలిచేందుకు ట్రై చేయవ‌చ్చు. ఆస్ట్రేలియా బౌల‌ర్స్‌లో క‌మ్మిన్స్ 4 వికెట్స్ తీయ‌గా, హాజిల్ వుడ్ 4 వికెట్స్ తీసాడు.