ఇండియా వైడ్ ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి చుక్కలే .. !

central government introduced new rules for government job holders

ఆహా… ప్రభుత్వ ఉద్యోగం, ఇంకేం కావాలి జీవితానికి? ఆడిందే ఆట పాడిందే పాట. ఏ టైం కి అయినా వెళ్లొచ్చు, ఏ టైం కి అయినా వచ్చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవ తీసుకోవచ్చు. ఒకటో తారీఖు రాగానే జీతం తప్పకుండా మన జేబులోకి వచ్చి చేరుతుంది. ఇలానే అందరం అనుకుంటూ ఉంటాం కదా! ఇక నుండి ఇలా అనుకోటానికి లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన నోటీసులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వణుకు పుట్టిస్తున్నాయి. అందరూ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరైతే పై విధంగా ఉంటారో వారికే ఇబ్బంది.

central government introduced new rules for government job holders
central government introduced new rules for government job holders

కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆఫీసుకు తరచూ ఆలస్యంగా వచ్చే వారి సెలవులు కోసేయాలని నిర్ణయించింది. దీనిపై అన్ని ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ నోటీసులు జారీ చేసింది. సీనియర్ అధికారులు కూడా ఈ నిబంధనలకు మినహాయింపు కాదు. తాజా నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ప్రతి రోజు ఉదయం 9.45 కల్లా ఆఫీసుల్లో ఉండాలి. 10.45 నుంచి 12.15 మధ్య ఆఫిసుకు వస్తే..ఆలస్యంగా వచ్చినట్లే పరిగణిస్తారు. ఓ నెలలో మూడు మార్లు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులు మొదట క్యాజువల్ లీవులు కోల్పోతారు. తొమ్మదిసార్లకంటే ఎక్కువసార్లు ఇది రిపీట్ అయితే రోజుకో ఎర్నడ్ లీవ్స్‌ చొప్పున సెలవులను వదులుకోవాల్సి వస్తుంది. ఇక క్యాజువల్ లీవులు లేని పరిస్థితిలో ఉద్యోగుల పెయిడ్ లీవులపై వేటు వేస్తారు. ఈ సెలవులన్నీ వినియోగించుకున్న ఉద్యోగులు లేటుగా వస్తే..ఏకంగా జీతంలో కోతలే. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతుంటారన్న టాపిక్ పై వచ్చిన జోకులకు లెక్కలేదు.

సినిమాల్లో కూడా వీటిని వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ నేను ప్రభుత్వ ఉద్యోగిని అని ఎవరైనా అంటే ‘ఆఫీసుకు వెళ్లి నిద్రపోవడమే కదా, మీకేం పని ఉంటుంది. మీరు అనుకున్నప్పుడే పని పూర్తవుతుంది. మీ చేతిలోకి డబ్బు రాకుంటే పనవ్వదు..’ అంటూ ఎలా ఎన్నెన్నో మాటలు అంటుంటారు. అలాగే కొన్ని రకాల ప్రైవేటు ఉద్యోగులు కూడా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని విధుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. తమ ప్రవర్తనా తీరుతో యాజమాన్యాలకు తలనొప్పి తెస్తుంటారు. వీటికి చెక్ పెట్టాలని కేంద్రం భావించిందేమో, కొన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనల్లో పెను మార్పులనే తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 లోని సెక్షన్ 29 ప్రకారం కేంద్ర కార్మిక శాఖ కొన్ని నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. తయారీ, మైనింగ్, సర్వీస్ రంగాల్లోని ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్తగా కేంద్ర కార్మిక శాఖ తీసుకురాబోతున్న చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగి ఆఫీసులో నిద్రపోతే అది భాద్యతారాహిత్యం కిందకే వస్తుంది. దుష్ప్రవర్తన కారణంతో అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొచ్చు. పలుమార్లు ఇదే విధంగా ప్రవర్తిస్తే అతడిని ఉద్యోగంలోంచి తొలగించవచ్చు కూడా.

లంచాలు తీసుకోవడం, ఆఫీసులో దొంగతనానికి పాల్పడటం, దొంగతనాన్ని ప్రోత్సహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం, రోజూ ఆఫీసుకు ఆలస్యంగా రావడం, ఏ అనారోగ్యం లేకున్నా కూడా అబద్ధం చెప్పి విధులకు రాకపోవడం, అకారణంతో పనిని వాయిదా వేస్తూ పోవడం వంటివి బాధ్యతారాహిత్యం కిందకే వస్తాయి. ఫుల్లుగా మందు కొట్టి ఆఫీసుకు రావడం, బాస్ తో తగాదా పెట్టుకోవడం, సహోద్యోగులను కించ పరుస్తూ మాట్లాడటం, విధుల్లో అలసత్వం వహించడం, తన కింద స్థాయి ఉద్యోగుల నుంచి బహుమతులు తీసుకోవడం, బాస్ కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పది రోజులకు మించి ఆఫీసుకు రాకపోవడం వంటివి కూడా కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన నిబంధనల్లో ఉన్నాయి.

ఉద్యోగంలో చేరేటప్పుడు వ్యక్తిగత వివరాలను, అనుభవం గురించి తప్పుగా చెప్పడం, ప్రయాణాలు చేయకున్నా చేసినట్టు చూపించి ట్రావెల్ అలవెన్సులు పొందడం కూడా క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుంది. వీటిల్లో ఏ ఒక్క దాన్ని ఉల్లంఘించినా అతడిపై చర్యలు తీసుకోవచ్చునని కేంద్రం కొత్తగా నిబంధనలను తీసుకొచ్చింది. ఇలా ఈ తరహా రూల్స్ ను కార్మిక శాఖ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇక తక్షణమే ఉద్యోగులందరూ కొత్త టైం టేబుల్ వేసుకుని, అలవాట్లు మార్చుకుని పద్దతిగా ఆఫీస్ కి వెళ్లి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్హి శుభ పరిణామంగానే పరిగణించాలి. బ్రష్టు పట్టిన భారతీయ ప్రజా వ్యవస్థని శుభ్రపరచటానికి ఇలాంటి మరెన్నో మంచి నియమ నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేయాలి.