జగన్‌కు షాక్… గల్లాకు రిలీఫ్

YS Jagan government
చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన 253 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు ప్రభుత్వం జీవోను కూడా రిలీజ్ చేసింది.  అయితే ఈ జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  దీంతో ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు పడినట్టైంది.  గతంలో గల్లా కుటుంబానికి చెందిన అమర్‌రాజా  ఇన్‌ఫ్రాటెక్‌కు 483.27 ఎకరాల ప్రభుత్వ భూమిని డిజిటల్ సిటీ నిర్మాణానికి కేటాయించారు.  ఉద్యోగాల కల్పన, కొత్త పెట్టుబడులతో సంస్థ విస్తరణ ఈ ఒప్పందలోని నియమాలు. 
 
కానీ అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌ ఒప్పందంలో చెప్పినట్టు ఉద్యోగాల కల్పన చేయలేకపోవడం, సంస్థ విస్తరణ జరగకపోవడంతో, గత పదేళ్లలో 229.66 ఎకరాల భూమిని మాత్రమే వాడుతుండటంతో మిగిలిన 253 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.  ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ నిర్ణయంతో అమరరాజా గ్రూపుకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  ఇక గల్లా జయదేవ్ టీడీపీలో ప్రముఖ నేతగా కొనసాగుతుండటంతో ఇది కుట్రపూరిత చర్యని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అమర్ రాజా ఇన్ ఫ్రా ప్రైవెట్ లిమిటెడ్ కోర్టులో పిటిషన్ వేసింది.  ఈ పిటిషన్ మీద ఈరోజు సోమవారం విచారణ చేపట్టిన కోర్టు 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం 33ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.  ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పలు కీలక అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈరోజు వచ్చిన తీర్పు ప్రభుత్వానికి మరొక ఎదురు దెబ్బని అంటున్నాయి ప్రతిపక్షాలు.