RRR – Acharya: కొడుకు తర్వాతే తండ్రి..!

RRR – Acharya: మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా ప‌డ‌డం వ‌ల్ల‌… టాలీవుడ్ షెడ్యూల్ అంతా తారు మారు అయ్యింది. ముఖ్యంగా.. దీని ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య‌`పైన ప‌డింది. ఎందుకంటే… ఈ రెండు సినిమాల‌కూ ఓ ఇంట‌ర్ లింకు ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్` త‌ర‌వాతే… `ఆచార్య‌`ని విడుద‌ల చేయాల‌న్న‌ది లోలోపల జ‌రిగిన ఒప్పందం. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లోనూ మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడు.

`ఆర్‌ఆర్‌ఆర్` షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా `ఆచార్య‌`లో రామ్‌చ‌ర‌ణ్ తో ఓ పాత్ర చేయించాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌తో ఆచార్య‌కు క్లాష్ రాకుండా ఉండాల‌న్న ఉద్దేశ్యంతో.. ఈ సినిమాలో చ‌ర‌ణ్ న‌టించాలా, వ‌ద్దా అనే విష‌యంలో రాజ‌మౌళి నిర్ణ‌యం కీల‌క‌మైంది. `ఆచార్య‌`లో చ‌ర‌ణ్ న‌టిస్తే త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, అయితే.. `ఆర్‌ఆర్‌ఆర్` విడుద‌ల అయిన త‌ర‌వాతే.. `ఆచార్య‌`ని విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి ష‌ర‌తు విధించాడు. దానికి ఆచార్య టీమ్ కూడా ఓకే అంది.

ప్రపంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుద‌లైతే.. ఎలాంటి స‌మ‌స్య ఉండేది కాదు. ముందే అనుకున్న‌ట్టు ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య వ‌చ్చేసేది. అయితే ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు. ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌లైన త‌ర‌వాతే.. ఆచార్య రావాలి. ఈ యేడాది వేస‌విలో ఆర్‌ఆర్‌ఆర్ విడుద‌ల చేస్తే.. ఆ త‌ర‌వాత 15 రోజుల‌కో, నెల‌కో ఆచార్య‌ని విడుద‌ల చేస్తారు. నిజానికి… ఆర్‌ఆర్‌ఆర్ విడుద‌ల అయినా, కాక‌పోయినా ఆచార్య విడుద‌ల‌కు స‌రైన వాతావ‌ర‌ణం ఇప్పుడు లేదు.

ఎందుకంటే.. ఏపీలో టికెట్ రేట్ల ర‌గ‌డ ఇప్పుడు కూడా కొన‌సాగుతోంది. ఈ ఇష్యూ ప్ర‌స్తుతం కోర్టులో ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న ఈ పిటీష‌న్ పై విచార‌ణ జ‌ర‌గ‌బోతోంది. ఆ త‌ర‌వాతే.. టికెట్ రేట్ల వ్య‌వ‌హారం తేలుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆచార్య‌నీ హోల్డ్ లో పెట్ట‌క త‌ప్ప‌దు.