HomeAndhra Pradesh2022లో ఎన్నికలు.. జగన్ ఓటమి ఖాయం: సబ్బం హరి

2022లో ఎన్నికలు.. జగన్ ఓటమి ఖాయం: సబ్బం హరి

 

2022లో ఎన్నికలు.. జగన్ ఓటమి ఖాయం: సబ్బం హరి

 
వైఎస్ జగన్ నేతృత్వంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆనందంలో వైసీపీ శ్రేణులు ఉండగా సీనియర్ నేత, మాజీ సబ్బం హరి జగన్ ఓటమి గురించి మాట్లాడటం సంచలనంగా మారింది.  ఈ మాటలు మాట్లాడింది వేరొక నేత అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకుడిగా మంచి పేరున్న సబ్బం హరి కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.  
 
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా 2022కి జమిలి ఎన్నికలకు వెళ్లాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పుకొచ్చిన హరి ఒకవేళ ఎన్నికలే గనుక జరిగితే అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు.  అంతేకాదు అందుకు గల కారణాలను కూడా విశ్లేషించి చెబుతున్నారాయన.  అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలు బాగానే ఉన్న జగన్ సర్కార్ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు జనంలో ఆ పార్టీపై నెగెటివిటీ పెంచాయని, అవి బయటికి కనబడకపోయినా అంతర్గతంగా పాతుకుపోతున్నాయని చెబుతున్నారు. 
 
మొదటగా ఇసుక సరఫరా గురించి మాట్లాడిన ఆయన కొన్ని నెలల పాటు ఇసుక సరఫరాను ఆపేసి ఆ తర్వాత అమాంతం రెట్లు పెంచడం వలన నిర్మాణ కార్మికుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం మొదలైందని అన్నారు.  ఇక మద్యపాన నిషేధమని అంటూనే లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలు ఆరంభించి రేట్లు ఆమాంతం పెంచడంతో ఒక వర్గం ప్రజలు ఆయనపై కోపంగా ఉన్నారని, అలాగే స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని తప్పుబట్టి ఎలక్షన్లకు వెళ్లాలనే మొండి వైఖరి ప్రదర్శించి ఈసీని తొలగించడం చూసి జనం సైతం ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు.  
 
వీటితో పాటే వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం కూడా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విషయమని అన్నారు.  ఇక నిర్మాణంలో ఉన్న అమరావతిని ఇసుక దిబ్బలుగా మార్చి ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు చల్లి జగన్ సర్కార్ పెద్ద తప్పే చేసిందని, 70 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టును అర్థాంతరంగా నిలిపివేసి పనులు ముందుకుసాగకుండా చేసిన అపరాధం వైసీపీని బాగా నష్టపరుస్తుందని, అలాగే తాజాగా హైకోర్టులో వరిసగా ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తీర్పులు రావడంతో జగన్ అనుభవం లేని నాయకుడని, ఎవరి మాట వినరనే భావన ప్రజల్లో పెరుగుతోందని అన్నారు.  
 
మరి వేల కోట్లతో చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితం ప్రభుత్వాన్ని కాపాడదా అంటే గతంలో టీడీపీ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు చాలాన చేసిందని అయినా ఓటమిని చూడాల్సి రాలేదా.. ఎప్పుడైనా ఒప్పుల కంటే తప్పులే ఎక్కువ ప్రభావం చూపుతాయని చెబుతూ ఒకవేళ 2022లో ఏవైనా కారణాల రీత్యా ఎన్నికలు జరగకపోతే ఆ తర్వాతి రెండేళ్లలో జగన్ సర్కార్ పనితీరును బట్టి ఓటర్ల తీర్పు ఉంటుందని, కానీ జమిలి ఎన్నికలకు స్కోప్ ఎక్కువగా ఉందని అన్నారు.  ఒకప్పుడు వైఎస్ కుంటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సబ్బం హరి ఇలా వైసీపీ ఓటమిపై బల్లగుద్దినట్టు మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.  

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News