వైసీపీ రంగుల గోల.. మరోసారి హైకోర్ట్ సీరియస్

 

వైసీపీ రంగుల గోల.. మరోసారి హైకోర్ట్ సీరియస్

 
వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీలో భాగంగా రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు, ప్రభుత్వ భవనాలకు తమ జెండా రంగులు వేసే ప్రక్రియను మొదలుపెట్టింది.  దీనిపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.  అసలు ప్రభుత్వ ఆస్తులకు ఒక పార్టీ జెండా రంగులను ఎలా వేస్తారు అంటూ జనం సైతం ముక్కున వేలేసుకున్నారు.  హైకోర్టులో ఈ రంగుల విషయంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని, వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చింది. 
 
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్ళింది.  సుప్రీం కోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రంగుల ప్రక్రియను మానుకోవాలని సూచించింది.  దీంతో సర్కార్ పెద్దలు బుర్రకు పదును పెట్టారు.  వేసిన రంగులు తొలగించకుండా, మిగిలిన భవనాలకు కూడా  రంగులు వేసేలా మూడు రంగులకు మట్టి రంగు కలిపి నాలుగు రంగులు వేయాలని కొత్త జీవోను వదిలింది.  దీనిపై కూడా హైకోర్టులో ప్రజాప్రయోజన  వ్యాజ్యం దాఖలైంది.  
 
దీన్ని విచారించిన కోర్టు సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగుల వేయడం కోసం మరో జీవోను ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ సెక్రెటరీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.  అలాగే కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రిజిస్ట్రార్‌‌ను కోర్టు ఆదేశించింది.  మే 28లోపు రంగుల జీవోకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  మొత్తానికి సర్కార్ పెద్దల పబ్లిసిటీ తపన రెండుసార్లు హైకోర్టులో ప్రభుత్వానికి చురకలు పడేలా చేయడమే కాక అధికారులు కోర్టు దిక్కరణ ప్రక్రియకు గురయ్యే పరిస్థితి కల్పించింది.