టీడీపీలో బయటపడిన నందమూరి, నారా వర్గ విభేదాలు

 

టీడీపీలో బయటపడిన నందమూరి, నారా వర్గ విభేదాలు

 
తెలుగు దేశం పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా ఉన్నారనేది వాస్తవం.  అందులో ఒకటి నందమూరి కుంటుంబానికి అభిమాన వర్గం అయితే మరొకటి చంద్రబాబు వర్గం.  ఈ వర్గాల నడుమ ఎన్నాళ్ళ నుండో అంతర్గత విభేదం నడుస్తోంది.  అభిమాన వర్గం తెలుగు దేశం మీద సర్వ హక్కులు నందమూరి కుటుంబానివని అంటుంటారు.  చంద్రబాబు వర్గంలో ఉండే నాయకులు, వారి అనుచరులు పార్టీని కాపాడుకుంటూ వస్తోంది బాబుగారే అని వాదిస్తారు.  పలు సందర్భాల్లో బయటపడుతూ వచ్చిన ఈ విభేదం తాజాగా మరోసారి కొట్టొచ్చినట్టు కనబడింది.  
 
బాలయ్యకు అభిమానుల సపోర్ట్:
 
నాగబాబు మొన్న బాలకృష్ణ మీద విమర్శలు చేసేసరికి నందమూరి అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.  సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు గుప్పించారు.  మొత్తం మెగా ఫ్యామిలీని ఇష్యూలోకి లాగి రచ్చ చేశారు.  అసలు నాగబాబుకు బాలయ్యను అనే స్థాయి ఉందా, సమావేశానికి పిలవకపోవడం ముమ్మాటికీ తప్పే, బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఏమిటి అంటూ విరుచుకుపడ్డారు.  బాలయ్య కోప్పడటంలో అస్సలు తప్పే లేదంటూ సపోర్ట్ చేసి తమ అభిమానం చాటుకున్నారు ఫ్యాన్స్. 
 
లోకేష్, చంద్రబాబులను పట్టించుకోలేదు:
 
ఇక వైసీపీ ఎంపీ కొడాలి నాని మొన్నామధ్య మాట్లాడుతూ లోకేష్, చంద్రబాబులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.  లోకేష్ నారాను పప్పు, పప్పు అని పదిసార్లు సంభోదించిన నాని చంద్రబాబును లోఫర్, సంకరజాతి రాజకీయ నాయకుడని అన్నారు.  చంద్రబాబుకు దమ్ముంటే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని వారి వారసులకి అప్పగించేసి తన తండ్రి ఖర్జూర నాయుడి పేరు మీద పార్టీ పెట్టాలని, లేకపోతే లోకేష్ తన తండ్రి చంద్రబాబు పేరు మీద పార్టీ పెట్టుకోవాలని సవాల్ విసిరారు.  లోకేష్, చంద్రబాబు ఏపీలో పుట్టడం ఏపీ దురదృష్టమని, వైఎస్ జగన్ మీద అనవసర విమర్శలు చేస్తే తండ్రీకొడుకులు ఇద్దరికీ గట్టిగా పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. 
 
ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శిల మీద ఇలాంటి వ్యాఖ్యలు వస్తే ఆ పార్టీ శ్రేణులు, నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తాయి.  కానీ టీడీపీ విషయంలో అలా జరగలేదు.  కొడాలి నానిపై పెద్దగా ప్రతి విమర్శ రాలేదు.  నాగబాబు విషయంలో బాలయ్యకు సపోర్ట్ చేసిన నందమూరి వర్గాలైతే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ నందమూరి ఇంటి అల్లుళనే విషయాన్ని కూడా పక్కనపెట్టి మౌనంగా చూస్తూ ఉండగా కొందరైతే నాని అడిగిన దాంట్లో తప్పేముంది.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడుగారు ఇకనైనా ఆయన వారసులకు వదిలేయవచ్చుగా అంటున్నారు.  దీంతో చంద్రబాబు వర్గం ఆగ్రహానికి లోనవడం కూడా జరిగింది.  మొత్తానికి ఈ ఘటనతో టీడీపీలోని వర్గపోరు మరోసారి బహిర్గతమైంది.