ఎన్నికలపై వైసీపీ ముందస్తు ఆలోచనలు చేస్తోందా.?

తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘనవిజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే తరహా ఆలోచనలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఆస్తకికరమైన చర్చ జరుగుతోంది. ఈ విషయమై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవ్వబోయే నివేదిక అత్యంత కీలకం మారబోతోందట. మార్చిలో ప్రశాంత్ కిషోర్ టీమ్, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, నివేదికను వైసీపీ పెద్దలకు అందించబోతోందట. ఈ విషయాన్ని వైఎస్ జగన్, మంత్రులకి క్యాబినెట్ సమావేశంలోనే చెప్పారట. ఇదంతా ఇప్పటివరకు ‘అట’ వ్యవహారమే. కానీ, దీని చుట్టూ చాలా చాలా విశ్లేషణలు జరుగుతున్నాయ్. వీటిని ఎంతవరకు విశ్వసించగలం.? అన్నది వేరే చర్చ. కానీ, రాష్ట్రంలో ఆ అవకాశమైతే లేకపోలేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభం అలాంటిది. ప్రతినెలా పెద్దయెత్తున అప్పులు చేయకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు.

ఇంకోపక్క, రాష్ట్రానికి అందించాల్సిన స్థాయిలో కేంద్రం సహకారం అందించడంలేదు. ఇంకో ఏడాది తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో అంచనా వేయడమే కష్టమైపోతోందట. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి అటు కేంద్రం తీరుని ఎండగట్టడంతోపాటు, ఇటు విపక్షాలనీ ఎండగట్టాలనే ప్లాన్ చేస్తోందని అంటున్నారు. కానీ, ఇది చాలా రిస్కీ అటెంప్ట్ అవుతుంది. సుదీర్ఘ రాజకీయ లక్షాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, చాలా చాలా కష్టపడ్డారు.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి. అలాంటి వైఎస్ జగన్, ముందస్తు ఎన్నికల ఆలోచన ఎలా చేయగలుగుతారు.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. కానీ, పరిస్థితులు ముందు ముందు సహకరించబోవన్న అనుమానం తలెత్తితే, ఆ పరిస్థితిని ప్రజలకే వివరించాలని నిర్ణయించుకున్నప్పుడు.. ముందస్తు ఎన్నికలనేవి ఒకే ఒక్క ఆప్షన్‌గా ఆయనకు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.