లిక్క‌ర్ కింగ్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్!

భార‌త బ్యాంకుల‌కు పంగ‌నామం పెట్టి విదేశాల్లో త‌ల‌దాచుకున్న లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా ఎపిసోడ్ గురించి ప్ర‌పంచానికి తెలిసిందే. మ‌ళ్లీ కింగ్ మేక‌ర్ లా పురిట గ‌డ్డ భార‌త్ పై కాలు మోపాల‌ని విశ్వ ప్ర‌యత్నాలు చేస్తున్నా ఫ‌లించ‌లేదు. చేసిన అప్పులు తీర్చేస్తాను…త‌న‌పై మాత్రం ఎలాంటి మ‌చ్చ లేకుండా చూడాల‌ని చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్ని చేసాడు. కానీ భార‌త ప్ర‌భుత్వం మాత్రం లిక్క‌ర్ కింగ్ ను వ‌దిలేద‌ని తేల్చిచెప్పింది. దొంగ‌లా వెళ్లి దొర‌లా వ‌స్తావా? అంటూ దొంగ‌గానే భార‌త గ‌డ్డ‌పై కాలు పెట్టాలి. ఇక్క‌డ జైలుకెళ్లి ఊచ‌లు లెక్క పెట్టించాల్సిందేన‌ని చాలా బ‌లంగా నిర్ణయం తీసుకుంది. బ్రిట‌న్ సుప్రీం కోర్టు కూడా భారత అధికారుల‌కు అప్ప‌గించాల‌ని తీర్పునిచ్చింది.

ఈ నేప‌థ్యంలో ఆ ప్ర‌క్రియ‌కు సంబంధించిన ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో లిక్క‌ర్ కింగ్ త‌ప్పించుకోవ డానికి చేయాల్సిన ప్ర‌య‌త్నాల్ని చేస్తున్నాడు. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ ను ఆర్ధికంగా అదుకుంటానంటూ క‌వ్వింపుల‌కు దిగాడు. అప్పు చెల్లిస్తాన‌ని ఆ డ‌బ్బు బాధితుల్ని ఆదుకోవ‌డానికి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ఎర వేసాడు. అయినా భార‌త్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఎలాగైనా ప‌ని అవ‌ద‌ని భావించిన విజ‌య్ మాల్యా ఇంకొన్నాళ్ల పాటు బ్రిట‌న్ లో ఉండేలాగే తాజాగా కొత్త ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. బ్రిట‌న్ కోర్టు తీర్పు నేప‌థ్యంలో ఎప్పుడైనా లిక్క‌ర్ కింగ్ ని భార‌త్ అధికారుల‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉండ‌టంతో అక్క‌డి కోర్టులోనే లండ‌న్ ఉండేలా శ‌ర‌ణార్ది పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఈ పిటీష‌న్ ప్రాస‌స్ కావ‌డానికి ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. కోర్టు తిర‌స్క‌రిస్తే రివ్యూ పిటీష‌న్ వేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇలా కోర్టులు..తీర్పుల ప‌రంగా చూసుకుంటే మాల్యాని ఇప్ప‌ట్లో ఇండియాకు తీసుకొచ్చే అవ‌కాశాలైతే త‌క్కువ‌గానే క‌న‌బ‌డుతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు మాల్యా తీరుపై మండిపడుతున్నారు. బ్రిట‌న్ కోర్టు గ‌త తీర్పును ఆధారంగా చేసుకుని…మ‌ళ్లీ పిల్ దాఖ‌లు చేసే అవ‌కాశం మాల్యాకి ఇవ్వ‌కూడ‌ద‌ని కోరుతున్నారు. ఇలాంటి ద్రోహిల్ని ప్ర‌జా కోర్టులోనే శిక్షించాలంటూ ఆగ్ర‌హంతా ఊగిపోతున్నారు.