చిన్న‌మ్మ రిలీజ్ క‌ల‌క‌లం..పార్టీల్లో వాడివేడి చ‌ర్చ‌!

దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌పై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ 2017 లో జైలుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి చిన్న‌మ్మ బెంగుళూరు జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెతో పాటు, ఇళ‌వ‌ర‌సి, సుధాక‌ర్ లు కూడా గోషులుగా శిక్ష అనుభ‌విస్తున్నారు. దేశ వ్యాప్తంగా అప్ప‌ట్లో ఇదో సంచ‌లనాత్మ‌క‌మైన కేసుగా తెర‌పైకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి చిన్న‌మ్మ‌ను బ‌ట‌య‌కు తీసుకురావాల‌ని కుటుంబ స‌భ్యులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. కానీ ప‌న‌వ్వ‌లేదు. అయితే తాజాగా చిన్న‌మ్మ ఆగ‌స్టు 14 న రిలీజ్ అవుతున్నారంటూ బీజేపీ కి చెందిన ఢిల్లీ ప్ర‌ముఖుడు డాక్ట‌ర్ ఆశీర్వాదం ఆచారి ట్విట‌ర్ ద్వారా రివీల్ చేయ‌డం త‌మిళ‌నాడులో క‌ల‌క‌లంగా మారింది.

దీనికి సంబంధించి అప్ డేటో కోసం ఇంకాస్త వెయిట్ చేయాల‌ని తెలిపారు. దీంతో చిన్న‌మ్మ రిలీజ్ వ్య‌వ‌హారం త‌మిళ‌నాడు అన్నాడీఎంకే రాజ‌కీయ పార్టీలో సంచ‌ల‌నంగా మారింది. అమ్మ రిలీజ్ అయితే అక్క‌డ రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్క‌డం ఖాయ‌మంటూ క‌థ‌నాలు ప్ర‌సారం అవుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఆ రాష్ర్టంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌చారం పై మ‌రింత ఆస‌క్తి సంత‌రించుకుంది. గ‌తంలో బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి, ఓ ఐఏఎస్ అధికారి చిన్న‌మ్మ్ని క‌ల‌వ‌డం, తాజాగా ఆచారి ట్వీట్ తో చిన్న‌మ్మ రిలీజ్ కు ఒక‌దానికి ఒక‌టి సంబంధం ఉందంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర తీసింది.

క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధికారంలో ఉండ‌టంతో అక్క‌డ నుంచి డాక్ట‌ర్ ఆచారికి ఏదైనా స‌మాచారం అంది ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. అయితే ఈ ప్ర‌చారాన్ని జైళ్ల శాఖ అధికారులు కొట్టిపారేసారు. కోర్టు విధించిన 10 కోట్ల జ‌రిమానా ఆ ముగ్గురు ఇంకా క‌ట్ట‌లేద‌ని, విడుద‌ల‌కు మార్గం సుగ‌మం కాలేద‌ని అంటున్నారు. గ‌తంలోనూ ఇలాంటి క‌థ‌నాలు సోష‌ల్ మీడియా జ‌నాల్ని వేడెక్కించాయి. ఈ నేప‌థ్యంలో చిన్న‌మ్మ విష‌యం రిలీజ్ పై కాస్త సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. ఈ కేసు వెనుక అస‌లేం జ‌రుగుతుందో? అర్ధం కాని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.