విశాఖ‌లో ర‌సాయ‌న వాయువు లీక్.. సిటీలో టెన్ష‌న్ టెన్ష‌న్

విశాఖ‌ప‌ట్ట‌ణంలోని గోపాల‌ప‌ట్నం ప‌రిస‌ర గ్రామం ఆర్.ఆర్ వెంక‌టాపురంలో ర‌సాయ‌న వాయువు లీకేజీ ఘ‌ట‌న ప‌లువురి ప్రాణాల్ని బ‌లిగొంది. స్థానిక‌ ఎల్.జి పాలిమ‌ర్స్ లో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. గురువారం వేకువఝామున ర‌సాయ‌న‌ ఫ్యాక్ట‌రీ నుంచి ఒక్క‌సారిగా ర‌సాయ‌న వాయువు లీకై మూడు కిలోమీట‌ర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికుల‌కు ఏం జ‌రుగుతోందో అర్థం కాని ప‌రిస్థితిలో ప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.‌ చ‌ర్మంపై ద‌ద్దుర్లు, క‌ళ్ల‌లో మంట‌లు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందుల‌తో స్థానికులు ఇబ్బంది ప‌డ్డారు. శ్వాస తీసుకోలేక‌ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ముగ్గురు చ‌నిపోయారు. దాదాపు 200 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అప‌స్మార‌క స్థితిలో వెళ్లిపోయి రోడ్డుపైనే ప‌డిపోయిన కొంద‌ర్ని అంబులెన్స్ ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే సింహాచ‌లం డిపోకు చెందిన బ‌స్సులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని బ‌స్సుల ద్వారా బాధితుల్ని ఆసుప‌త్రికి హుటా హుటిన త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లంతా భ‌యాంద‌ళ‌తో త‌లుపులు వేసుకుని ఇళ్ల‌లోనే ఉన్నారు. సైర‌న్ లు మోగించి ఇళ్ల‌ను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. ప‌రిశ్ర‌మ‌కు ఐదు కిలోమీట‌ర్లు ఉన్న ఇత‌ర ప్రాంతాల‌కు ప్ర‌జ‌ల్ని త‌ర‌లిస్తున్నారు. అయితే వాయువు లీకైన స‌మ‌యంలో చాలా మంది ఘాఢ నిద్ర‌లో ఉన్నారు. అంతా త‌లుపులు మూసుకుని నిద్రిస్తున్నారు. దీంతో లోప‌ల వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని కంగారు మొద‌లైంది. ఘ‌టన‌ జ‌రిగినా ప‌లువురు ఇండ్ల‌లో తలుపులు తెరుచుకోక‌పోవడం వారంతా లోప‌ల ఉండ‌డం చూస్తుంటే.. ప‌రిస‌రాల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. అస్వ‌స్థ‌కు గురైన వారిలో ఎక్కువ‌గా మ‌హిళ‌లు, వృద్ధులు, చిన్న పిల్ల‌లు ఉన్నారు. ఘ‌ట‌న‌ను బ‌ట్టి మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం లీకేజీని అరిక‌ట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. పెద్ద సంఖ్య‌లో అంబులెన్స్ లు, ఫైర్ ఇంజిన్లు, బ‌స్సులు మోత‌తో ఆ ప్రాగ‌ణ‌మంతా హోరెత్తిపోతుంది. కంపెనీ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అందులో ప‌నిచేస్తోన్న ఉద్యోగులు తెలిపారు. అయితే ఈ వాయువుకి మండే స్వ‌భావం లేక‌పోవ‌డంతో పెద్ద ఎత్తున ప్రాణ,ఆస్తి న‌ష్టాలు త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది.