వలస కూలీలకు విధిలింపులు.. ప్రైవేట్ రంగాలకు వడ్డింపులు 

PM Modi Stimilus package not helping poor
కేంద్రం కరోనా విపత్తును ఎదుర్కోవడానికి రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రకటన రోజున ఈ ప్యాకేజీతో చితికిపోయిన పేదలకు, సామాన్యులకు ఊరట కలుగుతుందని జాతి సంబరపడింది.  కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారీగా ప్యాకేజీ చిట్టా విప్పుతున్నకొద్ది ఆ ప్యాకేజీ వలన పేదల బ్రతుకులు మారే సూచనలేవీ కనబడటంలేదు.  అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మొన్న వలస కూలీలకు ప్రకటించిన కేటాయింపులు, నిన్న ప్రైవేట్ రంగాలకు ఇచ్చిన ప్రోత్సాహకాలే. 
 
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలి కేకలు పెడుతూ రోడ్ల మీదే ప్రాణాలు వదులుతున్న వలస కూలీలకు రెండు నెలలపాటు ఉచిత రేషన్ ఇస్తామన్నారు.  నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు ధాన్యాలు ప్రకటించారు.  ఇందుకోసం రూ.3500 కోట్లు కేటాయించారు.  వీటి మీద పూర్తిస్థాయి లెక్క చూస్తే రెండు నెలలు అంటే 61 రోజులు.  మొత్తం వలస కూలీల సంఖ్య దాదాపు 8 కోట్ల.  3500 కోట్లు 8 కోట్ల మందికి అంటే ఒక్కో కూలీకి రోజుకు రూ.7 కంటే తక్కువే.  ఈ 7 రూపాయలతోనే కూలీలు కష్టాలను దాటేయాలనేది కేంద్రం అభిప్రాయం.   
 
ఇక నిన్న ప్రకటనల్లో చూస్తే ప్రైవేట్ రంగాలపై భారీ వరాలు కురిశాయి.  50 బొగ్గు బ్లాకుల్లో వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు అవకాశం ఇస్తూ ఖనిజాల తవ్వకాల కోసం 500 బ్లాకుల్లో వేలం పాట ద్వారా ప్రైవేట్ రంగాలకు ఆస్కారం కల్పించారు.  రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతం నుంచి 74శాతానికి పెంచారు.  12 విమానాశ్రయాల్లో ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడులు పెంపు, ఎయిర్ స్పేస్, అంతరిక్షరంగం, అటామిక్ ఎనర్జీ వంటి రంగాల్లో ప్రైవేట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు.  
 
ఈ ప్రకటనలు చూస్తే ఇది కరోనా విపత్తు ప్యాకేజీయేనా అనే అనుమానం కలుగుతోంది.  ఈ కష్ట కాలంలో అన్ని విధాలా కుంగిపోయిన వలస కార్మికులకు, పేదలకు, దిక్కుతోచని మధ్యతరగతి వారికి తక్షణ సహాయం అందించాల్సింది పోయి విపత్తును అడ్డం పెట్టుకుని లాక్ డౌన్ కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయారు, వారిని ఆదుకుంటే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, దేశీయ ఉత్పత్తులకు ఊతమివ్వాలి అనే సాకులు చూపి ప్రైవేట్ శక్తులకు ప్రభుత్వ రంగంతో సమానంగా హక్కులు కల్పిస్తూ ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థలో రాబోయే రోజుల్లో భవిష్యత్తు మీదే అనే భరోసా కల్పిస్తున్నట్టు 
ఉంది.  
 
సరే లాక్ డౌన్ ముగిశాక అయినా పేదలకు, కూలీలకు ఉపాధి మీద భరోసా ఎమైనా ఉందా అంటే దాని ఊసు అసలే లేదు.  పనులు లేక నష్టపోయిన వారికి పరిహారం కింద పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పేశారు.  ఈ లెక్కల్ని చూస్తున్న విశ్లేషకులు సైతం కూలీలకు విధిలింపులు ప్రైవేట్ రంగాలకు వడ్డింపులా.. అసలు ప్రైవేట్ శక్తులకు భవిష్యత్తు మీద భరోసాలు ఇవ్వడానికే ప్యాకేజీని తయారుచేసినట్టుందే అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.