లాక్‌‌డౌన్‌-4.. ఒక ఫెల్యూర్ అనుకోవచ్చా 

 

లాక్‌‌డౌన్‌-4.. ఒక ఫెల్యూర్ అనుకోవచ్చా 

 
కరోనా ప్రపంచాన్ని వణికించి మన దేశం మీదే అప్పుడప్పుడే ప్రభావం చూపుతున్న తరుణంలో ప్రభుత్వం లాక్‌‌డౌన్‌ను తెరపైకి తెచ్చింది.  మార్చ్ 25 నుండి ఏప్రిల్ 14 వరకు మొదటి దశ లాక్‌‌డౌన్‌ విధించారు.  అప్పటికి కేసులు 10 నుండి 15 వేల లోపే ఉండేవి.  దాంతో లాక్‌‌డౌన్‌ ఫలితాల్ని ఇస్తోందని నిబంధనల్ని కఠినతరం చేసి ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు 2వ దశ లాక్‌‌డౌన్‌ విధించారు.  ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్కులు వంటి జాగ్రత్తలు పాటించాలని నిబంధనలు పెట్టారు. 
 
ఇక 3వ దశలో మే 4 నుండి మే 17 వరకు ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేశారు.  అయిన కేసులు పెరగడం ఆగలేదు.  3వ దశ ముగిసేనాటికి పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.  అంటే అది ప్రమాదకర స్థాయి అనే అర్థం.  జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్టేజ్ కూడా అదే.  కానీ ప్రభుత్వం మాత్రం చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వాలనే ఉద్దేశ్యంతో 18 నుండి నాల్గవ దశ లాక్‌‌డౌన్‌ విధించి అందులో అనేక సడలింపులు ఇచ్ఛేశారు.  ప్రజలకు సైతం కరోనా పట్ల అవగాహన పూర్తిస్థాయిలో వచ్చేసింది కనుక సడలింపులతో సమస్య ఉండదేమో అనుకున్నారు. 
 
కానీ ఇక్కడే వైరస్ విజృంభణ మొదలైంది.  లక్షకు దగ్గర్లో ఉన్న కేసులు లక్షను దాటేసి రోజుకు 5000 చొప్పున నమోదయ్యే పరిస్థితి వచ్చింది.  నిన్న ఒక్కరోజే దేశంలో 6088 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 148 మంది మరణించారు.  దీంతో వైరస్ మన దేశంలో చాప కింద నీరులా పాకిపోతోందని నిర్థారణ అయింది.  విశ్లేషకులేమో మూడవ దశ లాక్‌‌డౌన్‌ వరకు పరిస్థితి అదుపులోనే ఉందని, కానీ 4వ దశలో మితిమీరిన సడలింపులు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయని అంటున్నారు.  
 
బస్సు సర్వీసులు రాష్ట్రాల్లోపల పూర్తిగా తిరుగుతుండటం, ప్రత్యేక రైళ్లు నడుస్తుండటం, రవాణా పూర్తిస్థాయిలో ఉండటం, కార్యాలయాలు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు తెరుచుకోవడంతోనే ఈ పరిణామం తలెత్తిందని, దీని మూలంగా ముందు మూడు దశల లాక్‌‌డౌన్‌ ఫలితం నీరుగారిపోయిందని ఆభిప్రాయపడుతున్నారు.  ఇదే పరిస్థితి ఉంటే కొన్ని రోజుల్లోనే కేసుల సంఖ్య యింకో లక్ష పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.