నిధుల్లేవ్.. పథకాల్లేవ్.. పేదలకు మిగిలింది కన్నీరే 

ప్రస్తుతం భారతదేశ ఆర్థిక స్థితి బాగా దెబ్బతిందని కేంద్రం పదే పదే అంటోంది తప్ప పూర్తిగా చితికిపోయిన పేదల గురించి, అసలు బ్రతుకే లేకుండా పోయిన వలస కూలీల గురించి మాట్లాడటం లేదు.  ఘనంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో కూడా దేశ, విదేశీ ప్రైవేట్ శక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చే విధానాలను ప్రవేశపెట్టారు.  పైగా దానికి ఆత్మ నిర్భర్ పేరును తగిలించి ఊదరగొట్టారు మోదీ.  ఆర్థిక ప్యాకీజీ అనగానే పేద, మధ్యతరగతి వర్గాలు తమకు నేరుగా ఆర్థిక సాయం అందుతుందేమోనని కోటి ఆశలు పెట్టుకోగా ఆర్థిక మంత్రి ప్రకటనలతో అన్నీ నీరుగారి పోయాయి.  
 
ఆ ప్యాకేజీలో వలస కూలీలకు దక్కింది 5 కిలోల బియ్యం, 1 కిలో పప్పు దాన్యాలు మాత్రమే.  20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఇందుకోసం కేటాయించింది 3500 కోట్లు మాత్రమే.  అది కూడా రెండు నెలలకే.  అంటే 8 కోట్ల మంది కూలీల్లో ఒక్కొక్కరికి రోజుకు 7 రూపాయల కంటే తక్కువే.  అదే ప్రైవేట్ వ్యవస్థల విషయానికొస్తే మాత్రం 50 బొగ్గు బ్లాకులు, 12 విమానాశ్రయాలు, రక్షణ రంగంలో పెట్టుబడులను 49 నుండి 74 శాతానికి పెంచడం ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలు వనగూర్చారు.  బీజేపీ యేతర ప్రభుత్వాలున్న అన్ని రాష్ట్రాకు ఈ ప్యాకేజీ మీద దుమ్మెత్తిపోశాయి.  
 
ఈ తంతు మొత్తాన్ని చూసిన పేద, వలస కూలీల వర్గాలు సరే భవిష్యత్తులో అయినా తమకు మేలు చేసే కొత్త పథాకాలు ఏమైనా కేంద్రం పెడుతుందేమోనని ఆశించారు.  రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొత్త పథకాలు రూపొందించుకుని అభ్యర్థనలను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపాలని సిద్దమయ్యాయి.  కానీ ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో అవన్నీ గాలిలో దీపాల్లా ఆరిపోయాయి.  కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మినహా ఈ సంవత్సరం కొత్త పథకాలేవీ ఉండబోవని తేల్చి చెప్పేశారు.  
 
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్, ఇతర ప్రత్యేక ప్యాకేజీలు మినహా 2020-21లో ఎస్‌ఎఫ్‌సి ప్రతిపాదనలు లేదా ఈ‌ఎఫ్‌సి ద్వారా మంత్రిత్వ శాఖ అధికారం కింద కొత్త పథకాలులను ప్రారంభించేది లేదని, కాబట్టి కొత్త పథకాల అభ్యర్థనల కోసం  ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖలు పంపడం మానేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు నోట్ ద్వారా తెలిపింది.  కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.  దీంతో 2021 మార్చి 31 వరకు కొత్త పథకాలేవీ ఉండవని నేరుగా చెప్పేశారు.