‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. ‘ఆపరేషన్ నమస్తే’ పేరిట కరోనాపై యుద్ధనికి తెరతీసింది.

కరోనాకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో సాయం అందించేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ప్రకటించారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా సాగే ‘ఆపరేషన్‌ నమస్తే’లో తమ వంతు కృషి చేస్తామన్నారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని.. ఈ ఆపరేషన్‌లో కూడా తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్‌వోసీ, ఎల్‌ఏసీలో ఉన్న జవాన్లు తమ కుటుంబీకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తమదని సైనికులకు భరోసా ఇచ్చారు. 2001-02లో జరిగిన ఆపరేషన్‌ పరాక్రమ్‌ కాలంలో 8 నెలలపాటు సెలవులు తీసుకోలేదని గుర్తుచేసిన ఆయన ఈ విపత్కర సమయంలోనూ అలానే శ్రమిస్తామని స్పష్టం చేశారు. కలిసికట్టుగా కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.