fbpx
Home Movie Reviews 'రణరంగం' ట్రైలర్ రివ్యూ!

‘రణరంగం’ ట్రైలర్ రివ్యూ!

 ‘రణరంగం’ ట్రైలర్ రివ్యూ!

ఎంతో ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న శర్వానంద్ ‘రణరంగం’ ఇంకో పది రోజుల్లో విడుదలకానుంది. తాజాగా ట్రైలర్ విడుదలయింది. గతంలో విడుదలైన టీజర్ లోనే ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అని స్పష్టమైంది. ట్రైలర్ లో మరికొన్ని డిటెయిల్స్ తెలుస్తున్నాయి. యాక్షన్ దృశ్యాలతో ట్రైలర్ పవర్ఫుల్ గా వుంది. ప్రేమ దృశ్యాలతో ప్రారంభమవుతుంది. 1980 లలో హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ తో శర్వానంద్ రోమాన్స్ పీరియడ్ లుక్ తో ఆ కాలపు శైలిలో వుంది. ఆ కాలంలోనే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విధించిన మద్యనిషేధాన్ని ఆసరాగా చేసుకుని మధ్యతరగతి వైజాగ్ కుర్రాడుగా శర్వానంద్ అక్రమ మద్యం దందా చేసేవాడుగా పరిచయమవుతాడు. ఈ క్రమంలో ప్రత్యర్ధుల్ని ఎదుర్కొంటూ కాలక్రమంలో రిచ్ డాన్ గా ఎదుగుతాడు. ఇదే కథలా కన్పిస్తోంది. ఇప్పుడు రోమాంటిక్ ఇంటరెస్టుగా కాజల్ అగర్వాల్ ఎంటరవుతుంది. ఈ కథకి ముగింపు ఏమిటనేది వెండితెర పైనే చూడాలి.

‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ డాక్ కూలీగా మొదలై స్మగ్లర్ గా, రిచ్ డాన్ గా ఎదుగుతాడు. ఆ పాత్ర నేరచరిత్ర దృష్ట్యా తగిన ముగింపు మరణమే అన్నట్టు వుంటుంది. శర్వానంద్ పాత్ర ముగింపు ఏమిటనేది ఈ ట్రైలర్ లో సస్పెన్స్. ఇది నిజ కథ ఆధారంగా తీశామన్నారు. ఇటీవల వస్తున్న చాలా సినిమాలు నిజ కథలు అనడం ఫ్యాషన్ అయింది. నిజ కథ అని చెప్పుకున్న ‘గుణ 369’ ఎలా వుందో చూశాం. నిజ కథలలైనంత మాత్రాన ప్ర్రేక్షకులు పరుగులు పెట్టి చూడ్డం లేదు. నిజ కథ అని చెప్తున్నారు గానీ, ఆ కథ ఎక్కడ ఎప్పుడు జరిగిందో చెప్పడంలేదు. చెప్తే అది యూనిక్ సెల్లింగ్ పాయింటు గా ఆసక్తి రేపవచ్చు.

ట్రైలర్ లో హింస ఎక్కువ కన్పిస్తోంది. గన్ షాట్స్, కిల్లింగ్స్ ఇవన్నీ మద్యం డబ్బుల కోసమే అన్నట్టు చూపించారు. మద్యనిషేధం కొద్ది కాలమే వుంది. ఆ తర్వాత రిచ్ డాన్ ఎలా అయ్యాడన్నది కూడా తెరపైనే చూడాలి.

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్లో ఇంకా మురళీకృష్ణ, సుబ్బరాజులు దుష్ట పాత్రలు పోషించారు. కళ్యాణీ ప్రియదర్శన్ అక్కినేని అఖిల్ నటించిన ‘హలో’ లో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే.

‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణం. ప్రశాంత్ పిళ్లై సంగీతం. దివాకర్ మణి ఛాయాగ్రహణం. నవీన్ నూలి కూర్పు. వెంకట్ పోరాటాలు.

ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ