ఇక కండలమ్మాయి – ‘ఆర్డీఎక్స్ లవ్’ ట్రైలర్ రివ్యూ!
ఆర్డీఎక్స్ టీజర్ తో రెచ్చిపోయిన సెక్సీణి పాయల్ రాజ్పుత్, ట్రైలర్ తో వీర నారి అయింది. ఆర్డీఎక్స్ లవ్ టీజర్ లో పాయల్ రాజ్పుత్ కండోం పిల్లగా ఎలా యూత్ గుండెల్లో అలజడి రేపిందో తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్ తో కండల పిల్లగా యమ బాదుడు బాదుతోంది బ్యాడ్ క్యారక్టర్స్ ని… ఎరోటిక్ లవ్ సబ్జెక్టుగా టీజర్ తో ఏర్పడ్డ అభిప్రాయాన్ని వమ్ము చేస్తూ, హీరోయిన్ ఓరియెంటెడ్ విజయ శాంతి టైపు పోరాట కథగా ట్రైలర్ లో రివీల్ అవుతోంది. దీనికి తగ్గట్టు నిర్మాత సి. కళ్యాణ్ కూడా కథ చెప్పేశారు… ఒక యుక్త వయసులో వున్న అమ్మాయి ఎంజాయ్ చేసే టైములో అవన్నీ వదులుకుని, తన గ్రామం కోసం, చుట్టుప్రక్కల గ్రామాల ఆశయ సాధనకోసం, తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఏవిధంగా పోరాడిందనేది చిత్ర కథాంశమన్నారు.
ట్రైలర్ లో ఎక్స్ పోజింగ్ లేదు, బూతు లేదు, బోల్డ్ డైలాగులు లేవు. ‘వేటాడాలనుకుంటున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది’ అంటూ కండలు పొంగించి చితక బాదుతూ కన్పిస్తోంది పాయల్. పాయల్ అంటే గజ్జెలు. గుండెల్లో గజ్జెలు ఝల్లు మనేలా యాక్షన్ సీన్లు ఇరగదీస్తోంది. ‘అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్రతిమాలండి, కరిగిపోతారు. అబద్దం చెప్పి బాధ పెట్టకండి, కరిగించేస్తారు’ అని సూపర్ స్టార్ లా ఇంకో డైలాగు. మాస్ ప్రేక్షకులకి మిస్సవని మజా అందిస్తోంది.
‘హుషారు’ హీరో తేజస్ కంచెర్ల ఇందులో లవర్ గా కన్పిస్తున్నాడు. పాత్ర పెద్దగా రివీల్ కాలేదు. ట్రైలర్ ని పాయల్ నే టార్గెట్ గా చేస్తూ కట్ చేశారు. అయితే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మరికొంత కథ చెప్పేసింది…. ఆర్డీఎక్స్ లవ్ కొంచెం డిఫరెంట్ గా వుంటుందని, ఎడ్యుకేషన్ పరంగా ఆలోచింప చేస్తూ ఇన్స్పిరేషన్ గా వుంటుందని చెప్పేసింది. కొంపదీసి మెసేజి ఇచ్చే మూవీ కాదుకదా? హాట్ హాట్ టీజర్ మీద ఈ ట్రైలర్ నీళ్ళు గుమ్మరించి నట్టు వుంటే ప్రేక్షకుల రియాక్షన్ ఎలా వుంటుందో… అయితే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాత సి కళ్యాణ్ విశ్వాసంతో వున్నారు.
తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న ఈ లేడీ యాక్షన్లో ఇంకా నరేష్, నాగినీడు, ఆదిత్యా మీనన్, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్యశ్రీ, సాహితిజడి, దేవిశ్రీ, జోయా మిశ్రా తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: రథన్, మాటలు: పరశురామ్, పాటలు: భాస్కరభట్ల, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: నందు, కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్న, కో-ప్రొడ్యూసర్: సివి రావ్, నిర్మాత: సి.కళ్యాణ్, కథ-స్క్రీన్ ప్లై-దర్శకత్వం: శంకర్ భాను.