సాక్ష్యం : ఫాంటసీతో కొత్త ప్రయత్నం! (మూవీ రివ్యూ)

(సికిందర్ రివ్యూ)


రచన – దర్శకత్వం : శ్రీవాస్ 
తారాగణం : శ్రీనివాస్ బెల్లంకొండ, పూజా హెగ్డే, మీనా, జగపతిబాబు, రావికిషన్, ఆశుతోష్ రాణా, జయప్రకాష్, వెన్నెల కిషోర్,  రఘుబాబు తదితరులు 
మాటలు : సాయినాథ్ బుర్రా, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయగ్రహణం : ఆర్థర్ ఎ. విల్సన్ 
బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్ 
నిర్మాత : అభిషేక్ నామా 
విడుదల : 27 జులై,  2018 


Rating 3 / 5

***

2014 లో ‘అల్లుడు శీను’ తో  హీరోగా రంగ ప్రవేశం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, దీంతోపాటు ఆతర్వాత నటించిన ‘స్పీడున్నోడు’, ‘జయ జానకీ నాయకా’ రెండిటితో కూడా నిరాశపడి, తాజాగా నాల్గో ప్రయత్నం భారీ యెత్తున చేశాడు. తను నమ్మే రొటీన్ మాస్ కే ఫాంటసీని జోడించి తేడా కనబర్చే ప్రయత్నం చేశాడు. అలాగే రెండు హిట్లు (‘లక్ష్యం’, ‘లౌక్యం’), మూడు ఫ్లాపులు ( ‘రామరామ కృష్ణ కృష్ణా’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’, ‘డిక్టేటర్’ ) తీసిన దర్శకుడు ఈసారి మరింత పెద్ద బడ్జెట్ తో, రొటీన్ తోనే వైవిధ్యం కోసం కృషిచేశాడు. ఇద్దరికీ ఒక హిట్ అవసరం. ఆ హిట్ కోసం ఫాంటసీ మీద ఆధారపడ్డ వీళ్ళిద్దరూ ఎంతవరకూ విజయం సాధించారో చూద్దాం.  

కథ

     ఆ వూళ్ళో రాజుగాఋ (శరత్ కుమార్)  అనే పెద్ద దిక్కు పెద్ద కుటుంబంతో వుంటాడు. లేకలేక పుట్టిన కొడుక్కి విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్) అని పేరు పెడతాడు. కొడుకు చేతిలో గీతలు లేవని, ఇతరుల తలరాతలున్నాయనీ, మృత్యువే అతడి ఆయుధమనీ పండితుడు చెప్తాడు.  అదే వూళ్ళో మునిస్వామి (జగపతిబాబు) పగబట్టి రాజుగారి కుటుంబాన్ని అంతమొందిస్తాడు. వారాణసిలో శివ ప్రకాష్ సుసర్ల (జయప్రకాశ్) అనే ఎన్నారైకి విశ్వ దొరుకుతాడు. న్యూయార్క్ తీసికెళ్ళి పెంచుకుంటాడు. సుసర్లకి పెద్ద పెద్ద కంపెనీ లుంటాయి. విశ్వ వీడియో గేమ్ మేకర్ గా వుంటాడు. ఒకసారి అక్కడి ఆలయంలో ప్రవచనాలు చెప్పే సౌందర్యలహరి (పూజా హెగ్డే) ని చూసి ప్రేమిస్తాడు. ఆమె వీడియో గేమ్ కి కొత్త కాన్సెప్ట్ చెప్పే రచయితని విశ్వ దగ్గరికి పంపిస్తుంది. ఆ రచయిత ఒక కుటుంబాన్ని హతమార్చిన నల్గురు హంతకుల్ని పంచభూతా లెలా తుదముట్టించాయో కథ చెప్తాడు. దాన్ని డెవలప్ చేయమంటాడు విశ్వ.

     ఇంతలో ఇండియా వెళ్ళిపోయిన సౌందర్య కోసం ఆమె వూరొస్తాడు విశ్వ. అదే వూళ్ళో ఒకప్పుడు తన కుటుంబం మునిస్వామి చేతిలో హతమైందని అతడికి తెలీదు. అక్కడ సౌందర్య తండ్రి వేరే కేసులో  మునిస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యం సేకరించి కూతురు సౌందర్య కిస్తాడు. దానికోసం మునిస్వామి తమ్ముడు (రవికిషన్) ఆమెని చంప బోతాడు. అప్పుడు గాలి హోరు లేస్తుంది. విశ్వ వచ్చేసి పోరాడతాడు. కానీ అతడి కాళ్ళ ముందే గాలి మునిస్వామి తమ్ముణ్ణి మింగేస్తుంది. ఇది రచయిత రాసిన మొదటి ఎపిసోడ్ లాగే వుండేసరికి దిగ్భ్రాంతికి లోనవుతాడు విశ్వ. ఇక్కడ్నించీ రచయిత రాసే ఒక్కో ఎపిసోడ్ లాగే ప్రకృతితో సంఘటనలు జరుగుతూంతాయి…

ఎలావుంది కథ 

     ఫాంటసీ యాక్షన్ జానర్. ఆధ్యాత్మిక కోణంలో మిథికల్ ఎలిమెంట్స్ జోడించారు. భక్తి సినిమాలతో తీరే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని కొత్త ట్రెండ్ ఫాంటసీ యాక్షన్ తో తీర్చే ప్రయత్నం చేశారు. ప్రతీవారం అవే మూస ఫార్ములా యాక్షన్ సినిమాలతో నవ్యతని ఫీలవని ప్రేక్షకులకి ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నాల్గు దిక్కులు చూసి ఎవరూ లేరని తప్పుచేస్తే,  పైనున్న ఐదో దిక్కు కనిపెడుతూనే వుంటుందనీ,  అదే కర్మసాక్షి అనీ, అదే ప్రాయశ్చిత్తం జరిపిస్తుందనీ, దాన్నుంచి తప్పించుకోలేరనీ చెప్పే కథ. గాలి, నీరు, నిప్పు, నేల, నింగీ – ఈ పంచభూతాలకి లోబడి మెలగాలని చెప్తుంది. చాలాపూర్వం బాపూ రమణలు తీసిన ‘ముత్యాల ముగ్గు’ లో ఇలాటిదే మిథికల్ ఎలిమెంట్ వుంటుంది. సృష్టి ఉపసంహారం జరిగే పద్ధతుల్లో నైమిత్తిక ఉపసంహరాన్ని జోడించి చూపించారు. నైమిత్తిక ఉపసంహారం ప్రకారం పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని సృష్టిని ముగిస్తాయి. ఇదే విధంగా ‘ముత్యాలముగ్గు’ లోని రావుగోపాలరావు సహా దుష్టపాత్రలు పరస్పరం కీచులాడుకుని అనుభవిస్తారు.

ఎవరెలా చేశారు 

     కాస్త వయసుపెరిగి బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తెరకి ఆనుతున్నాడు. ఇప్పుడు పోషించిన పాత్రకి ఒక్క యాక్షన్ ఎమోషన్ తప్ప ఏమీ లేకపోవడంతో సీరియస్ గానే వుంటాడు. హీరోయిన్ తో రోమాన్స్ అయినా,  కామెడీ అయినా కథ ప్రకారం అంతంత మాత్రమే. మొదట్నుంచీ డాన్సుల మీద దృష్టి పెట్టిన వాడు గనుక మరోసారి మాస్ చేత కేరింతలు కొట్టించుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు ఫోక్ సాంగ్ లో, క్లయిమాక్స్ ముందు వచ్చే ఎంగేజిమేంట్ సాంగ్ లో. ఈ రెండూ గ్రూపు సాంగులే. పీటర్ హెయిన్స్ సమకూర్చిన హింసాత్మక యాక్షన్ సీన్స్ లో కూడా చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక తను ఇలాటివే కాస్త వేరైటీ వున్న సినిమాలు చేస్తే తిరుగుండదు.

     హీరోయిన్ పూజా హెగ్డే ప్రవచనాలు  చెప్తుందంటే నమ్మబుద్ధి కాదు. సంస్కృతి పాటించాలని చెప్తూ, ట్రాడిషన్ ని ఫాలో అయితే సక్సెస్ వస్తుందని – సంస్కృతిని (మాతృభాష తెలుగుని) పక్కని తోసి ఇంగ్లీషులో కోస్తుంది. ఒక్క శ్లోకం కూడా చెప్పదు. ఫార్ములా హీరోయిన్ పాత్రనే పోషించింది.

     మిగిలిన నటీనటులు షరా మామూలే. జగపతి బాబు విలనీలో కూడా కొత్తదనం లేదు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా రొటీనే. 
     టెక్నికల్ గా, గ్రాఫికల్ గా, మ్యూజికల్ గా కమర్షియల్ సినిమా హంగులని బాగా సమకూర్చారు. యాక్షన్  దృశ్యాల్లో డివోషనల్ ఆలాపనలు మిథికల్ ఫీల్ కి పట్టం గట్టాయి. నేల పగదీర్చుకునే యాక్షన్ సీన్లో వచ్చే బిజిఎంలో బీట్ హైలైట్. నృత్య దర్శత్వం కూడా ఓకే. ఇక సాయినాథ్ బుర్రా సంభాషణలు- ఇవి సన్నివేశాలకి మంచి బలాన్నిచ్చాయి. చాలా డైలాగులు ఇన్స్ పైరింగ్ గా, కొత్తగా వున్నాయి. 

చివరికేమిటి 

     ఎంటర్ టైన్మెంట్ మాత్రం లేకుండా, ఆ లోపం తెలియకుండా ఫాంటసీ ప్రపంచాన్ని చూపించారు. ప్రారంభంలో గోవులతో జరిగే అక్రమాలు, ఒక దూడని సాక్ష్యం వుండకూడదని విలన్ దాన్ని సజీవంగా దహనం చేయడం వంటి విపరీత దృశ్యాలున్నాయి. గోవు అంటే మతంకాదు, ఇంకేదో కాదు, నాల్గు పాదాల మీదే నడిచే ధర్మమని చెప్పించారు. అలగే దూడ పసి బిడ్డని మీద పడుకోబెట్టుకుని దుర్మార్గుల బారినించి కాపాడే ఛేజింగ్ దృశ్యాలు  లాజిక్ కి అందాకా హాస్యాస్పదంగా వుంటాయి.  కానీ ఇదే తెగ భావోద్వేగాల్ని రెచ్చగొట్టింది ప్రేక్షకుల్లో. మొత్తం మీద సదరు హీరో,  దర్శకుడూ తమతమ ఫ్లాపుల చరిత్రకి ఇలా  తెర దించగలిగారు. ఫాంటసీ అంటే గ్రాఫిక్సే  అని కాకుండా కాస్త ఇలా కొత్తగా అన్పించే  కథల్ని జోడిస్తే ఎంతో  కొంత సక్సెస్  వస్తుంది.

సికిందర్