Uppena Movie Review : వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ రివ్యూ

uppena telugu movie review

పేరు : ఉప్పెన

నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి తదితరులు

డైరెక్టర్ : బుబ్చి బాబు

మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్

నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్

రిలీజ్ డేట్ : 12 ఫిబ్రవరి, 2021

Uppena Movie Review : ఉప్పెన సినిమా రిలీజ్ కు ముందే భారీగా అంచనాలను నమోదు చేసుకుంది. ఓ వైపు మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో తొలి చిత్రం కావడం.. మరో వైపు మ్యూజికల్ గా హిట్ అయిన సినిమా కావడం.. అందులోనూ నీ కన్ను నీలి సముద్రం అనే పాట.. సినిమా విడుదల కాకముందే సంచలనాలను సృష్టించింది. సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకుపోయింది. ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాని ఇమేజ్ ఈ సినిమాకు వచ్చింది. అందుకే.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా కావడం, ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా అయినప్పటికీ.. సినిమా రిలీజ్ కు ముందే భారీ క్రేజ్ ఏర్పడింది. ఇంత క్రేజ్ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయం తెలియాలంటే సినిమా స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఇదే కథ

ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ పేరు ఆశీర్వాదం అలియాస్ ఆశీ. హీరోయిన్ కృతి శెట్టి పేరు బేబమ్మ. విలన్ విజయ్ సేతుపతి పేరు రాయనం. ఈ ముగ్గురే సినిమాకు ప్రాణం. ఈ ముగ్గురిలో ఒక్కరు లేకపోయినా.. ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేయకపోయినా.. సినిమా సోల్ మిస్సయ్యేది. విజయ్ సేతుపతి ఎలాగూ మంచి నటుడే. కానీ.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. ఇద్దరూ వెండి తెర మీద మొదటి సారి నటించినా.. ఇద్దరిలో ఏమాత్రం కొత్త అనే భయం లేకుండా.. ఎంతో ఈజ్ తో నటించేశారు. తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

ఆశీ.. ఒక జాలరి. సముద్ర తీరప్రాంతమైన ఉప్పాడ అనే గ్రామంలో జాలరిగా పనిచేస్తుంటాడు. చాలా తక్కువ కులానికి చెందిన వాడు. కానీ.. తనకు చిన్నప్పటి నుంచి బేబమ్మ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి తనను చూస్తూ.. తనను ప్రేమిస్తూ బతికేస్తుంటాడు ఆశీ. కానీ.. బేబమ్మ చిన్నప్పటి నుంచి ఆశీని చూడదు. కాలేజీకి వెళ్లే సమయంలో ఆశీని చూసి ప్రేమలో పడిపోతుంది. అప్పటి నుంచి ఇద్దరూ తెగ ప్రేమించేసుకుంటారు.

uppena telugu movie review
uppena telugu movie review

అయితే.. ఈ విషయం బేబమ్మ తండ్రి రాయనంకు తెలుస్తుంది. అసలే పెద్ద కులం. తక్కువ కులం వ్యక్తిని తన కూతురు ప్రేమించింది.. అంటే ఎవరు ఊరుకుంటారు. రాయనం కూడా  పరువు కోసం ఏదైనా చేసే వ్యక్తి. అందుకే.. ఇలా తన పరువు తీసిన కూతురు ప్రేమను విడగొట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వారిని విడగొట్టడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తాడు.

కానీ.. ఈ విషయం తెలుసుకున్న బేబమ్మ, ఆశీ.. ఇద్దరూ పారిపోతారు. అదే వాళ్లు చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ తమ ప్రేమను బతికించుకున్నారా? రాయనం.. వాళ్ల ప్రేమను ఆశీర్వదించడా? లేక వాళ్లను ఏమైనా చేశాడా? అసలు.. చివరకు ఏం జరుగుతుంది.. అనేదే పెద్ద సస్పెన్స్. అదే సినిమా మిగితా కథ.

విశ్లేషణ

మనం పైన చెప్పుకున్నట్టుగానే సినిమాకు ప్లస్ పాయింట్స్ ఆ ముగ్గురే. వాళ్లలో ఏ ఒక్కరు మిస్సయినా సినిమా ఫీల్ మిస్సయ్యేది. వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ అదిరిపోయింది. ఇక కృతి శెట్టి అందం, అభినయం రెండింటినీ బాగానే పండించి.. కుర్రకారును ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమాకు మెయిన్ హీరో విజయ్ సేతుపతే. ఆయన లేకుంటే సినిమానే లేదు. ఆయన తర్వాతనే వైష్ణవ్ తేజ్.

నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ప్రేక్షకులను ఈ పాట థియేటర్ల దగ్గరికి తీసుకొచ్చినా.. ప్రేక్షకుడు ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఫీల్ అయ్యేలా బుబ్చి బాబు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే… సరికొత్త క్లయిమాక్స్. క్లయిమాక్స్ లో పెద్దగా ఊహించేది ఏం ఉండకపోయినా.. సరికొత్తగా సినిమాను ముగించాడు డైరెక్టర్.

విలన్ పాత్ర వచ్చినప్పుడల్లా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమా కథ పాతదే అయినప్పటికీ.. ఇప్పటికే ఇటవంటి కథ నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ.. బుచ్చిబాబు రాసుకున్న లైన్ కొత్తది, సరికొత్తగా, రియలిస్టిక్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించాడు బుచ్చిబాబు.

ప్లస్ పాయింట్స్

సినిమాకు ప్లస్ పాయింట్స్.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, విజువల్స్ కూడా అదుర్స్, డీఎస్పీ సంగీతం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అనిపించాయి. ఫస్ట్ హాఫ్ బెటర్ గా ఉంది. క్లయిమాక్స్ కూడా సినిమాకు ప్లస్సే. అయితే కొందరు క్లయిమాక్స్ సినిమాకు మైనస్ అనుకుంటున్నారు కానీ.. అటువంటి సినిమాకు అలాంటి క్లయిమాక్స్ ఉంటేనే సెట్ అవుతుంది.  

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఫీలింగ్ ను తీసుకొస్తుంది, అలాగే సినిమాను కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. కొన్ని అనవసరమైన సీన్స్ ను తీసేసి ఉంటే బాగుండేది.

కన్ క్లూజన్

ఇక చివరగా చెప్పొచ్చేదేంటంటే.. సినిమాను చూడాలా? వద్దా? అని కన్ఫ్యూజన్ లో ఉన్నవారికి.. చెప్పేదేంటంటే.. రియలిస్టిక్ ప్రేమకథలను ఇష్టపడేవాళ్లు అయినా.. ఏదో ఒకటి ప్రేమ కథ అయితే చాలు.. అని అనుకునే వాళ్లు.. యూత్ ఈ సినిమాను ఇష్టపడతారు. ఫ్యామిలీతో సరదాగా వెళ్లి ఓ రెండు గంటలు మ్యూజిక్ ను ఎంజాయ్ చేద్దామనుకున్నవాళ్లు కూడా ఈ సినిమాకు వెళ్లొచ్చు.

తెలుగురాజ్యం రేటింగ్ : 2.5 /5