నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ – టీజర్ రివ్యూ వచ్చేసింది!

నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ టీజర్ రివ్యూ వచ్చేసింది!

నేచురల్ స్టార్ నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పది రోజుల క్రితం విడుదలైన తర్వాత, అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న టీజర్ ఈరోజు రిలీజ్అయింది. నానీ- ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ ల తొలి కాంబినేషన్లో మూవీ కావడంతో ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడే ప్రేక్షకుల్లో హల్చల్ చేయడం ప్రారంభించింది. ‘జెర్సీ’ విజయం తర్వాత నానీ చేస్తున్న ఎంటర్ టైనర్ ఇది. అయితే ‘మనం’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఆ తర్వాత తెలుగులో అక్కినేని అఖిల్ తో తీసిన ‘హలో’ తో నిరాశ మిగిల్చాడు. ఈ నేపధ్యంలో నానీతో ‘గ్యాంగ్ లీడర్’ ని ఎలా నిలబెడతాడనేది సస్పెన్స్ గా మారింది. నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ రిపీట్ టైటిల్. ఈ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి, వియశాంతిలతో విజయబాపినీడు దర్శకత్వంలో తీసిన ఫ్యామిలీ, మ్యూజికల్ ఎంటర్ టైనర్ 1991 లో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే!

నానీస్ గ్యాంగ్ లీడర్ కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనరే. టీజర్ లో సాఫ్ట్ లుక్ మాత్రమే రివీలైంది. ట్రైలర్ లో ఇంకేమైనా పంచులు పడతాయేమో తెలీదు. నానీ కూడా సాఫ్ట్ రోల్ పోషిస్తున్నట్టు కనబడుతున్నాడు. అయితే క్యారక్టర్ తీరు కొత్తగా, ఇంటరెస్టింగ్ గా వుంది. టీజర్ ఓపెనింగ్ లో తన పేరు పెన్సిల్ అనీ, తను రివెంజి రైటర్ ననీ పరిచయం చేసుకుంటాడు. పెన్సిల్ సరే, ఎక్కడా వినని రివెంజి రైటరేమిటి? ఫన్నీ క్యారక్టరని తెలిసిపోతోంది.

ఇతడి దగ్గరికి ఐదుగురు లేడీస్ గ్యాంగ్ రావడం, వీరు కోరిన రివెంజి సాయం నాని చేసినట్టుగా టీజర్ రివీల్ చేస్తోంది. వీళ్ళు పగతీర్చుకోవాలి. ఎవరి మీద పగ అనేది ప్రస్తుతానికి సస్పన్స్ గా పెట్టారు. ఆ గ్యాంగ్ లో వివిధ ఏజి గ్రూపుల్లో లక్ష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్,శరణ్య, స్వాతి, చైల్డ్ ఆర్టిస్టు కన్పిస్తున్నారు. వీళ్ళతో నానికి కొన్ని ఫన్నీ సీన్స్ వున్నాయి. చివర్లో కార్ల రేసులున్నాయి. అసలు విలనెవరో వెల్లడించకుండా ఆసక్తి రేపారు.

టీజర్ లో వుండీ లేని దారపు పోగు లాంటి కథ కనబడుతోంది. రాబోయే ట్రైలర్ లో స్ట్రాంగ్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి.

ఇందులో ‘ఆరెక్స్ 100’ కార్తికేయ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఇతరపాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అనీష్ కురువిల్లా, రఘుబాబు తదితరులున్నారు. ఈ సారి విక్రమ్ కుమార్ ‘మనం’, ‘హాలో’ చిత్రాలకి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ కాక, ‘వై దిస్ కొలవరి’ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ని తీసుకున్నాడు. కెమెరా మిరొస్లా బ్రోజెక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ దీన్ని నిర్మిస్తోంది. ఆగస్టు 30 న విడుదల.