కొండపొలం రివ్యూ: కథాబలం కొరత

రేటింగ్ :2.5/5.0

దర్శకత్వం: క్రిష్

తారాగణం: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, నాజర్, సాయిచంద్, రవిప్రకాష్, అన్నపూర్ణ, హేమ తదితరులు

కథ, మాటలు: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి,

స్క్రీన్ ప్లే: క్రిష్,

సంగీతం: ఎంఎం కీరవాణి;

పాటలు: సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కీరవాణి;

ఛాయాగ్రహణం: వీఎస్ జ్ఞాన శేఖర్

బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్

నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి.

రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ ‘మహానాయకుడు’ తర్వాత దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ తో ఈవారం తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో సవాలుగా తీసుకుని నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పుడప్పుడే ‘ఉప్పెన’ లో నటిస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ ని కథా నాయకుడుగా తీసుకున్నారు. ఇటీవల హిందీలో బిజీ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ని కథా నాయకిగా తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ గొర్రె కాపరుల జీవితాల్ని చూపించే వాస్తవిక సినిమా అన్న అభిప్రాయం కల్గించాయి. వాస్తవిక సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘కొండపొలం’ కూడా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.

కథ

రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) ఢిల్లీలో యుపిఎస్ సి ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ఐ‌ఏఎస్ తీసుకోకుండా ఐఎఫ్ఎస్ ఎందుకు కోరుకుంటున్నావని ఇంటర్వ్యూలో అడిగితే, ఆత్మవిశ్వాసమంటే ఏమిటో అడవి నేర్పిందున ఫారెస్ట్ ఆఫీసర్ అవుదామనుకున్నట్టు చెప్తాడు. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడో గతాన్ని చెప్పుకొస్తాడు…

రాయలసీమ లోని గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించించిన రవీంద్ర, తండ్రి గొర్రెలమ్మి సంపాదించిన డబ్బుతో బీటెక్ చేసి, జాబ్ ఇంటర్వ్యూల్లో ఫెయిలవుతూ వుంటాడు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇంగ్లీషు రాకపోవడం వంటి కారణాలతో ఉద్యోగం సంపాదించుకోలేక ఇంటికొస్తాడు. అప్పుడు తాత (కోట శ్రీనివాసరావు) ఒక సలహా ఇస్తాడు. తండ్రితోబాటు గొర్రెల్ని మేపడానికి అడవి కెళ్ళి, అక్కడ అడవి నేర్పే పాఠాలు నేర్చుకుంటే తప్పకుండా ఉద్యోగం సంపాదించుకునే తెలివి వస్తుందంటాడు.
రవీంద్ర తండ్రి (సాయిచంద్) తో గొర్రెల్ని తీసుకుని అడవికి బయల్దేరతాడు, వాళ్ళతో తన గొర్రెల్ని తీసుకుని ఓబులమ్మ రాకుల్ ప్రీత్ సింగ్ మరో ముగ్గురు నల్గురు కూడా నల్లమల అడవికి బయల్దేరతారు. నీరు లేక, గ్రాసం లేక కరువు కాటకాలతో గొర్రెలు మలమల మాడుతూంటే, వర్షాలు పడే వరకూ అడవిలో గొర్రెల్ని మేపి తీసుకు రావడం ఇలా వెళ్ళి నెలన్నర అడవిలో గడిపి రావడాన్ని కొండపొలం అంటారు.
ఇలా మొదటిసారి అడవి కెళ్లిన రవీంద్రకి వూహించని అనుభవాలు ఎదురవుతాయి. అతడి అధైర్యానికి ఓబులమ్మ ఆటలు పట్టిస్తూంటుంది. మరోవైపు గొర్రెల మీద పడే పులి, ఇంకోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు, ఇంకా శుంకాలు వసూలు చేసేవాళ్ళూ – ఇలా రకరకాల సమస్యల్ని చూస్తాడు. దీంతో ఓబులమ్మ చెప్పే పాఠాలతో బాటు, ఈ ఎదురయ్యే సమస్యల్ని కూడా జయించే ఆత్మవిశ్వాసం పొందే యువకుడుగా మారడం ఈ కథ.

ఎలా వుంది కథ

‘తానా’ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న ‘కొండపొలం’ నవల ఈ సినిమా కాధారమని సమాచారం. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి. ఈ నవల 2019 లో వెలువడింది. నల్లమల అడవుల్లో గొర్రెల కాపరుల కుటుంబాల జీవన పోరాటాన్ని చిత్రించిన ఈ నవలలో లేని ఓబులమ్మ పాత్రని, ఆమెతో ప్రేమ కథనీ సినిమా కోసం సృష్టించారు. రవీంద్ర యాదవ్ పాత్ర యధాతథం. కానీ సినిమా మాత్రం హైదారాబాద్ సమీపంలోని వికారాబాద్ లో తీశారు. అందుకని నల్లమల నేటివిటీ లేదు. నల్లమలలోని రకరకాల చెట్లు, కాయలు పళ్ళూ, వాగులూ వంకలూ గురించిన సమాచారం నవల్లో వివరంగా వున్నట్టు నవల మీద వెలువడ్డ సమీక్ష ద్వారా తెలుస్తోంది. ఈ సహజత్వమంతా సినిమాలో వుండదు.
ఇక రవీంద్ర అడవిలో నేర్చుకునే జీవిత పాఠాలు ఈ సినిమా థీమ్ అయినప్పుడు ఈ థీమ్ తో అతను మమేకం కాలేక పోవడమనే క్యారక్టరైజేషన్ లోపం స్పష్టంగా కనబడుతుంది. కనీసం ఆకులో ఆకుగా, మానులో మానుగా అడవిని ఆవాహన చేసుకోకపోతే, మొదటిసారి అడవికెళ్ళిన తను అక్కడి దృశ్యాలకి వండర్ అవకపోతే, అడవిని మధించకపోతే, ఏం నేర్చుకున్నట్టు? రకరకాల సంఘటనలు, ప్రమాదాలూ వంటి భయపెట్టే అంశాలే నేర్చుకునే సాధనా లన్నట్టు వుంటాయి – తడవకోసారి పులితో తలపడే దృశ్యాలు సహా.

ఇవి తప్ప హృదయాల్ని కదిలించే అనుభవాలు లేకపోవడంతో ఎమోషనల్ కనెక్ట్ కనపడదు. దీంతో ఆత్మవిశ్వాసం పొందే ముగింపు రాణించకుండా పోయింది. కథలో కండబలంతో బాటు హృదయ స్పందన కూడా వుంటే సమగ్రంగా వుండేది. నవలని సినిమాగా మార్చడంలో జరిగిన లోపమిది. లాక్ డౌన్ కోవిడ్ గురించే గానీ, నవల గురించి కాదుగా?

ఈ సినిమా చూస్తూంటే మృణాల్ సేన్ హిందీ క్లాసిక్ ‘భువన్ షోమ్’, ధ్యానేష్ మోఘే కొంకణిలో తీసిన ‘దిగంత్’ మెదులుతాయి. ఈ రెండు సినిమాల్ని దర్శకుడు క్రిష్ స్టడీ చేసి వుంటే బావుండేది. ‘భువన్ షోమ్ లో మానవత్వం లేని రైల్వే ఆఫీసర్ ఉత్పల్ దత్ అడవికి షికారుకెళ్ళి, అడవి పిల్ల సుహాసినీ మూలేతో మానవత్వమంటే ఏమిటో నేర్చుకుని, మారిన మనిషిగా తిరిగి వచ్చే కథ ఒక క్యారక్టర్ స్టడీగా నిల్చిపోయింది. ఫ్రెంచి న్యూవేవ్ సినిమా శైలిని తొలిసారిగా భారతీయ తెరమీదికి ‘భువన్ షోమ్’ గా మార్చి సంచలనం సృష్టించాడు మృణాల్ సేన్.

అలాగే కొంకణి దర్శకుడు ధ్యానేష్ మోఘే ‘దిగంత్’ లో ఇక ‘కొండపొలం’ లోని గొర్రెల కాపరుల జీవితమే కన్పిస్తుంది. కాకపోతే ఇందులో కథా నాయకుడికి తండ్రితో బాధ వేరు. చదువుకున్న కథానాయకుడు సిటీలో రియల్ ఎస్టేట్ ఉద్యోగంలో చేరాలని పట్టుదల. తండ్రికి తమ కులం అస్థిత్వం గురించిన బాధ. అడవిలోనే ఇంత స్వేచ్ఛా, భద్రతా వుంటే ఇంకెక్కడో వెతుక్కొనవసరం లేదనే మంకుపట్టు. ఈ కథ ఒక వర్తమాన సామాజిక పరిశీలనగా గుర్తుండి పోతుంది. ఇలాటివి ‘కొండపొలం’ తీయడానికి రిఫరెన్సులుగా వున్నాయి.

నటనలు సాంకేతికాలు

‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరో యాదవ పాత్రలో ఒదిగిపోయాడు అనే రొటీన్ మాట అవసరం లేదుగానీ, ఫర్వాలేదు. కాకపోతే ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాక్కొస్తాడు. అతడి కళ్ళు ఆకర్షించాయన్నాడు దర్శకుడు. దీంతో అతను కనిపించినప్పుడల్లా మన దృష్టి కళ్ళ మీదికే పోతుంది. కళ్ళల్లో అంత శక్తివుంటే ఆత్మవిశ్వాసం నేర్చుకునే పనే లేదుగా? పాత్రకి తగ్గట్టు కళ్ళున్నాయి.

కాకపోతే రియలిస్టిక్ సినిమాలో రియలిస్టిక్ పాత్రని చూపిస్తే బావుంటుంది. మొదటి యూపీఎస్సీ ఇంటర్వ్యూ సీన్లోనే ఇది లోపించింది. యూపీఎస్సీ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయో మాక్ ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో బోలెడున్నాయి. అభ్యర్ధులు ఎంత మృదువుగా, చక్కగా సమాధానాలు చెప్తారు. బాడీ లాంగ్వేజ్ ఎంత బావుంటుంది. వైష్ణవ్ తేజ్ ఈ వీడియోలు చూసి వాస్తవికతని, విశ్వసనీయతనీ ఈ సీన్లో ప్రదర్శించాల్సింది. ‘రిపబ్లిక్’ లో యూపీ ఎస్సీ ఇంటర్వ్యూని ఇంకో పై లెవెల్ కి తీసి కెళ్ళారు. హీరో దగ్గరగా, టేబుల్ మీద చేతులు పెట్టుకుని కూర్చుని, ఎమోషనల్ లెక్చర్ దంచేస్తూంటాడు!

ఆత్మ విశ్వాసం నేర్చుకునే పాత్రపరంగా వైష్ణవ్ తేజ్ డీలా పడ్డానికి తగిన ఎమోషనల్ త్రెడ్ లేకపోవడం కారణం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో లేకపోతే ఇంతే. స్క్రీన్ ప్లే అంటే పాత్రకి ఒక సమస్య, ఒక సంఘర్షణ అనే సూత్రం పాటించకపోతే పాత్ర ఇలాగే బలహీనంగా తయారవుతుంది. ఫార్ములా పాత్రలకి భిన్నంగా ప్రయోగాలు చేస్తున్న వైష్ణవ్ తేజ్ ఇవి దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

ఇక ఓబులమ్మ పాత్రలో సహజంగానే రకుల్ ప్రీత్ సింగ్ నేటివిటీకి దూరంగా వుంది. పాత్రకి వున్న చలాకీతనంతో ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ తనకి కూడా వైష్ణవ్ కి లాగే ఎమోషనల్ సీన్లు లేవు. ఎమోషన్లనేవి ఒకే ఒక్క సమస్యతో పోరాడుతున్నప్పుడు మాత్రమే క్యారీ అవుతాయి. తడవకో సమస్యతో కాదు.

మూడో పాత్ర తండ్రి పాత్రలో సాయిచంద్ చాలా బాగా నటించాడు. గొర్రెలకి నీరు పెట్టలేని అశక్తతతో వాటిమీద విరుచుకు పడే సన్నివేశం ఈ సినిమాకి హైలైట్. ‘సొంత ఊరు’ లో ఎల్బీ శ్రీరామ్ గుర్తొస్తాడు. ఇంకో పాత్రలో ఫార్ములా సినిమాల రవిప్రకాష్ సహజ నటన ప్రదర్శించాడు. ఐతే భార్యతో గోడు వెళ్ళబోసుకునే అంత లాంగ్ ఫోన్ సంభాషణ అనవసరమన్పించేదే. కథకీ పాత్రకీ ఉపయోగం లేదు. అసలే వేగంగా కదలని కథకి ఇదొక స్పీడ్ బ్రేకు. సహనపరీక్షగా వుంది.

జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణంలో అరణ్య దృశ్యాలు అత్యంత రమణీయంగా వున్నాయి. కానీ తాగడానిక్కూడా నీళ్ళు దొరకని ఎండా కాలపు అరణ్యం అంత పచ్చగా వుండదేమో. ఇంత అద్భుతంగా చూపించిన అడవిని దాన్నొక హీరో నేర్చుకునే పాత్రగా, పాఠంగా చేసి అనువణువు విప్పి చూపించాలి అసలుకి. క్లోజప్స్ తో కట్టి పడేయాలి. నవలలో చిత్రీకరణకి సాధ్యమైన వర్ణనలున్నాయి. ‘సాక్షి’ లో ప్రచురించిన జంపాల చౌదరి ముందు మాట చదివితే అర్ధమవుతుంది.

కీరవాణి సంగీతం హెవీగా వుంది. అయితే క్యాచీగా పాటలున్నాయి. అసలే బిక్కుబిక్కుమంటూ నేర్చుకోవడానికి వచ్చిన హీరో పాత్రకి ఇంత హెవీ సౌండ్ అవసరం లేదేమో. ఈ సినిమా హీరో కళ్ళతో చూస్తున్న బయస్కోప్ అన్నది దృష్టిలో పెట్టుకుంటే కథా కథనాలూ, సంగీతం అన్నీ శృతిలో వుండే అవకాశముంది.

చివరికేమిటి

నవలా రచన చేసిన సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డియే మాటలు రాయడం ఈ సినిమాకి సహజత్వం. సినిమా రచయితలు రాసివుంటే టెంప్లెట్, కృతక సీమ లాంగ్వేజీ వుండేది. రామిరెడ్డి రాసిన మాటల వల్ల చాలా సన్నివేశాలు రక్తి కట్టాయి. అయితే నవలకి దర్శకుడి స్క్రీన్ ప్లే ఒక్కటే అన్ని సమస్యలకి కారణమైంది. స్క్రీన్ ప్లేకో దశ, దిశ కన్పించవు. దీంతో చాలా సీన్లు రిపీటవుతూంటాయి. పైగా కథనానికో ప్లానింగ్ లేదు. మొదటిసారిగా అడవిలోకి ప్రవేశించిన హీరోకి పులి భయం పెట్టేశారు. అతను కనీసం మొదటిసారి అడవిని చూస్తున్న ఆనందాన్ని కలగనీయకుండా చేశారు. అడవిని పరిచయం చేసుకునే, ప్రేమించే అవకాశం కూడా లేకపోయింది. పులిని గురించిన మాటలతో పులి భయం… పులి భయం…
40 వ నిమిషంలో పులి దాడి చేసేసరికి అతను పూర్తిగా బెదిరిపోతాడు. నిజానికి ఇక్కడే కథ ప్రారంభం కావాలి. అన్నిసార్లు పులిని గురించి వింటున్నప్పుడు, పులి కన్పిస్తే దాంతో తేల్చుకునే ధైర్యం నింపుకుని సిద్ధంగా వుండాలి. అది దాడి చేయగానే ఎదుర్కొనే పోరాటం ప్రకటించేస్తే, కథ ప్రారంభైపోయి గొడవ వదిలిపోయేది.

ఈ నలభై నిమిషాలూ గొర్రెల కాపరుల రిపీటయ్యే కష్టాలు, హీరోయిన్ తో ప్రేమ ప్రారంభం కాని ఏవో దృశ్యాలూ వచ్చి పోతూంటాయి. పులి దాడిని అతను ఆత్మవిశ్వాసం పొందే మార్గంగా నిర్ణయించుకుని పోరాటం ప్రకటించి వుంటే థీమ్ ని ఎస్టాబ్లిష్ చేసే మలుపుగా వుంటూ కథ ప్రారంభమై పోయేది. ఈ గోల్ ప్రారంభం కాక, హీరోయిన్ తో ప్రేమా ప్రారంభం కాక, ఇంకేదో ఎర్ర చందనం స్మగ్లర్ల ఎపిసోడ్ వస్తుంది. దీని మీదే ఇంటర్వెల్ పడుతుంది. ఇప్పుడు కథేమిటంటే ఏమీ చెప్పలేని పరిస్థితి.

సెకండాఫ్ లో ఇంకో రెండు సార్లు పులి దాడి చేస్తుంది. మొదటి దాడిని ఎదుర్కొంటాడు. కానీ ఇది ఆత్మవిశ్వాసం పొంది, ఉద్యోగం సాధించుకునే గోల్ కోసమని స్పష్టంగా ఇప్పుడైనా కథ ఎస్టాబ్లిష్ కాదు. ఇక ప్రేమ విషయాని కొస్తే ఇంకో ముప్పావు గంటకి గానీ ప్రేమలో పడరు. పడ్డాక దీని మీద కూడా వుండరు. ఇంకో పావుగంటకి విడిపోతారు. అంటే ప్రేమ విషయంగా చివరి అరగంట సమయంలో గానీ ప్రేమలో పడడం, కాన్ఫ్లిక్ట్ ప్రాంభమవడం జరగవన్న మాట. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. హీరో గోల్ కథ కూడా మిడిల్ మటాషే.

నవలలో లేని హీరోయిన్ పాత్ర, దాంతో ప్రేమ కథ సినిమాలో కల్పించడంలో కన్ఫ్యూజన్ వల్ల ఈ పరిస్థితి. కేవలం ఆత్మ విశ్వాసం కథ చెప్పాలనుకుని ప్రేమ కథని వెనక్కి తోసేయడంతో రెండూ నష్టపోయాయి. ఫస్టాఫ్ లోనే ప్రేమ కథ ప్రారంభిస్తే అది షుగర్ కోటింగ్ లా వుండేది. దాని మాటున అంతర్లీనంగా ఆత్మవిశ్వాసం కథ చెప్తే సమస్యలన్నీ తీరేవి. హీరోయిన్ పాత్ర కూడా అర్ధవంతంగా వుండేది.

విడుదల  అక్టోబర్ 8,2021