RRR Movie Review : ఫస్టాఫ్ ఎన్టీఆర్ బ్యాంగ్ – సెకండాఫ్ రామ్ చరణ్ బ్లాస్ట్ ‘ఆర్ ఆర్ ఆర్’ రివ్యూ!

రేటింగ్ : 3.5/5

దర్శకత్వం ; ఎస్ఎస్ రాజమౌళి

తారాగణం ;  ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్,

కథ : కెవి విజయేంద్ర ప్రసాద్,

 స్క్రీన్ ప్లే : ఎస్ ఎస్ రాజమౌళి,

మాటలు : బుర్రా సాయి మాధవ్,

సంగీతం : ఎంఎం కీరవాణి

ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్

కూర్పు: ఏ శ్రీకర్ ప్రసాద్

బ్యానర్ :  డివివి ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాత : డివివి దానయ్య

విడుదల మార్చి 25, 2022

RRR Movie Review : ఎస్ ఎస్ రాజమౌళి గ్లోబల్ స్థాయిలో ఇంకో అడుగు ముందుకేసి నిర్మించిన ‘ఆర్ ఆర్ ఆర్’ (రౌద్రం రణం రుధిరం) అన్ని రికార్డులు బ్రేక్ చేసే టార్గెట్ పెట్టుకుని ఎట్టకేలకు ఈ రోజు విడుదలయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచే థియేటర్లు క్రిక్కిరిసి పోవడం ప్రారంభించాయి.

ఇద్దరు పవర్ఫుల్ యువ స్టార్లు ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల డబుల్ ధమాకా కాంబినేషన్ ఇద్దరి ఫ్యాన్ బేస్ లని ఉర్రూతలూగిస్తోంది.

మరి ఇంత వూరించిన ‘ఆర్ ఆర్ ఆర్’ ఇద్దరి ఫ్యాన్సుకీ, మిగతా ప్రేక్షకులకీ ఏ విధమైన సంతృప్తి నిచ్చింది? ఈ పానిండియా మూవీతో మరోసారి తెలుగు సినిమా స్థాయి నిలబెట్టుకుందా? తెలుసుకుందాం…

కథ

1920 లో అప్పటి నిజాం రాజ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మల్లి అనే ఒక గిరిజన బాలిక గాత్రం నచ్చి ఒక బ్రిటిష్ అధికారి ఆమెని అపహరిస్తాడు. అడ్డుకున్న ఆమె తల్లిని అతడి అనుచరులు హతమారుస్తారు.

దీంతో ఆ బాలికని విడిపించుకుని తీసుకురావడానికి గిరిజన యువ నాయకుడు భీమ్ (ఎన్టీఆర్) ఢిల్లీ బయల్దేరతాడు.

ఇటు భీమ్ ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఇన్స్ పెక్టర్ రామరాజు (రామ్ చరణ్) ని పురమాయిస్తుంది. భీమ్ – రామ్ ఇద్దరూ ఎవరికెవరూ తీసిపోరు. ఇద్దరి శక్తులు కలిస్తే బ్రిటిష్ పీఠం కదిలిపోతుంది.

అయితే స్నేహితులుగా మారిన వీరిద్దరూ శత్రువులుగా విడిపోతారు.

తిరిగి వీళ్ళు ఎలా కలిశారు, గిరిజన బాలిక విషయం ఏమైంది, విజయ రామరాజు (అజయ్ దేవగణ్) తో రామ్ కి వున్న సంబంధమేమిటి, సీత (ఆలియా భట్) ఎవరు, జెన్నీ (ఒలీవియా) ఎవరు… ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే మిగతా కథ చూడాల్సిందే.

ఎలా వుంది కథ

ఇది రొటీన్ గా మరో స్వాతంత్ర్య పోరాట కథ కాకపోవడం రిలీఫ్. స్వాతంత్ర్య పోరాట పూర్వపు నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళు అపహరించిన బాలిక కోసం ఇది కమర్షియల్ యాక్షన్ కథ.

ఇలాటిదే కథతో, ఇదే రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన ‘రాజన్న’ 2011 లో నాగార్జున హీరోగా వచ్చింది.

ఇందులో నిజాం రాజ్యంలో సంగీతం తెలిసిన మల్లమ్మ అనే గిరిజన బాలిక చుట్టూ కథ వుంటుంది.

‘ఆర్ ఆర్ ఆర్’ లో మంచి గాత్రమున్న మల్లి అనే గిరిజన బాలిక చుట్టూ కథ! ఈ పోలికలు కన్పిస్తాయి.

గిరిజన బాలిక కోసం జరిగే కథగా చూస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ అంత బలమైన మూవీ కాదు. బాలిక చుట్టూ ఎలాటి భావోద్వేగ బలం లేదు.

అందుకని ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలకి భావోద్వేగాలు కల్పించి కథ నడిపారు. దీంతో పాత్రల భావోద్వేగాల యాక్షన్ డ్రామాగా ఇది వుంటుంది.

నటనలు – సాంకేతికాలు

పాత్రల భావోద్వేగాల యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఈ గ్లోబల్ మూవీని నిలబెట్టారు.ఇద్దరి నటనల్లో ఏ ఒకర్ని డామినేట్ చేయాలన్న ప్రయత్నం కనిపించదు.

సుహృద్భావంతో పరస్పరం సహకరించుకుని నటించడం కన్పిస్తుంది.

ఇద్దరికీ సమాన స్థాయి సజీవ పాత్రలు రూపొందించాడు దర్శకుడు రాజమౌళి.

ఇద్దరి విడి విడి ఇంట్రో సీన్లు బిగ్ యాక్షన్ తో అదిరేట్టు వున్నాయి. ఈ ఇంట్రో సీన్స్ కే 40 కోట్లు వ్యయం చేశామంటున్నారు.

ఎన్టీఆర్ ఎమోషనల్ క్యారక్టర్ అయితే, చరణ్ యాక్షన్ క్యారక్టర్. ఎమోషన్స్ తో ఎన్టీఆర్ ఫస్టాఫ్ ని, యాక్షన్ తో చరణ్ సెకండాఫ్ ని రాజ్యమేలారు.

ఇద్దరూ కలిసి ఒక బాలుడ్ని రక్షించే సీను, మోటార్ బైక్, గుర్రాల మీద ఇద్దరి స్వారీ, ఫ్రెండ్ షిప్ లో ‘నాటు నాటు’ వైరల్ సాంగ్, ఎన్టీఆర్ మీద కొమురం భీమ్ సాంగ్, శత్రువులుగా మారిన తర్వాత ఇంటర్వెల్లో ఇద్దరి మధ్య ఫైట్…ఇలా చెప్పుకుంటే ఎన్నో, ఒకరు నిప్పు అయితే ఇంకొకరు నీరు.

ఈ రెండిటి సంఘర్షణతో కూడిన కథనం.

ఈ పాత్రలు స్నేహం, శతృత్వం, ఉమ్మడి లక్ష్యం చుట్టూ వుంటాయి. రోమాన్స్ వుండదు, హీరోయిన్లు లేరు. వీటితో బాటు తగిన కథా బలం లేకపోయినా, ఎన్టీఆర్ – చరణ్ లు పూర్తిగా తమ టాలెంట్స్ తోనే విజయయాత్ర సాగించేశారు. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక అద్భుత మల్టీ స్టారర్ ఇది.

ఇక సీత పాత్రలో అలియా భట్ కి పెద్దగా చేయడానికేమీ లేదు. పైగా తనది సంక్షిప్త పాత్ర. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో అజయ్ దేవగణ్ పాత్ర వల్ల సినిమాకి చేకూరిన బలం కూడా తక్కువే.

సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘బాహుబలి’ ని చూసిన తర్వాత రాజమౌళి వూహా శక్తి ఏమిటో తెలిసిందే. ఇప్పుడు ‘బాహుబలి’ ని మించిన విజువల్ వండర్స్ ని సాధించడంతో  తను ఇంకో మెట్టు పైకి చేరుకున్నాడు.

లొకేషన్స్, సెటింగ్స్, ఔట్ దొర, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్…ఇలా ఒకటేమిటి- సర్వం వైభవోపేత కళా ప్రదర్శనే.యాక్షన్ సీన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

గత సినిమాల్లో రాజమౌళి యాక్షన్ సీన్స్ ఏదో వొక హాలీవుడ్ మూవీ రిఫరెన్స్ తీసుకుని వుండేవి.ఈసారి ఒరిజినాలిటీని ప్రదర్శించాడు. హాలీవుడ్డే రిఫరెన్స్ గా తీసుకునేలా.

యాక్షన్ సీన్స్, ఆడియో గ్రాఫీ, కొరియోగ్రఫీ, బీజీఎం .. ప్రతీ శాఖా అంతర్జాతీయ స్థాయి విలువలతో పోటీ పడ్డాయి.ఎం ఎం కీరవాణి నేపథ్య సంగీతం, పాటలు చెప్పుకోనక్కర్లేకుండా హిట్స్.

సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ అయితే ‘మగధీర’, ‘బాహుబలి’ రెండు భాగాలకి మించి సూపర్ ఆర్ట్ వర్క్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మూడు గంటల 7 నిమిషాల నిడివిని లాక్ చేసింది.

చివరికేమిటి

అపహరణకి గురైన గిరిజన బాలికని తిరిగి తెచ్చుకోవడమనే బలహీన స్టోరీలైన్ మీద ఈ మల్టీ బిలియన్ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారు. ప్రారంభంలో ఈ అపహరణని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, దీన్ని మరుగున పడేస్తూ ఫస్టాఫ్ గంటా 45 నిమిషాలూ కథలోకి వెళ్ళకుండా ఎన్టీఆర్, చరణ్ ల ఇంట్రోలు, క్యారక్టర్లు, బ్రోమాన్సులు, సాంగులు మొదలైన వాటితో గడిపేసి, ఇంటర్వెల్ లో బాలిక కథ కొచ్చి, స్టార్స్ ఇద్దరి మధ్య శతృత్వం పాయింటు కూడా కల్పించారు.

ఫస్టాఫ్ లో కథని మరిపిస్తూ క్యారక్టర్ల మెగా షోగా టైము తెలియకుండా ఎంటర్ టైన్ చేసినా, సెకండాఫ్ ప్రారంభించేసరికి గిరిజన బాలిక అపహరణ అనే బలహీన కథే సవాలుగా నిలిచింది.

ఇంటర్వెల్ లో ఈ బాలిక పాయింటు, శతృత్వాల పాయింటూ ఎస్టాబ్లిష్ చేశాక, సెకండాఫ్ ప్రారంభంలో అజయ్ దేవగణ్ తో ఫ్లాష్ బ్యాక్ వల్ల కూడా సెకండాఫ్ ప్రారంభమే బాగా కుంగింది. మళ్ళీ చివరి అరగంటకే, యాక్షన్ సీన్స్ అందుకుంటే తప్ప, సెకండాఫ్ వూపందుకోలేదు.

బలహీన కథ, ఫ్లాష్ బ్యాక్ ఈ రెండూ స్టార్స్ ఇద్దరికీ పెద్ద సవాలు విసిరాయి – యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని నిలబెట్టమని. ఇందులో సక్సెస్ అయ్యారు.

ఇద్దరి పాత్రలు, నటనలు గుర్తుండి పోయేలా. విఫలమవుతున్న తమిళ పానిండియాల కి తెలుగు పానిండియా అందనంత దూరంలో వుందని తేల్చారు.

-సికిందర్