James Movie Review : ‘జేమ్స్’ గా మారిన ‘బాషా’ ‘జేమ్స్’ మూవీ రివ్యూ!

రేటింగ్ : 2/5

రచన – దర్శకత్వం : చేతన్ కుమార్

తారాగణం : పునీత్ రాజ్కుమార్ప్రియా ఆనంద్శివ రాజ్కుమార్రాఘవేంద్ర రాజ్కుమార్శ్రీకాంత్,

శరత్ కుమార్ముఖేష్ రిషిఆదిత్య మీనన్ తదితరులు

సంగీతం చరణ్ రాజ్,

ఛాయాగ్రహణం : స్వామి జె గౌడ

బ్యానర్ కిశోర్ ప్రొడక్షన్స్

నిర్మాత : కిశోర్ పత్తికొండ,

విడుదల : మార్చి 17, 2022

James Movie Review : ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘జేమ్స్’ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలైంది.

కన్నడ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీ అట్టహాసంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైనట్టు ప్రకటించారు.

తెల్లారి నప్పట్నించే ఓవర్సీస్ నుంచి ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరవుతూ సూపర్ సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు.

తెలుగు ప్రేక్షకులు నెమ్మదిగా టికెట్లు కొనుక్కుని తీరుబడిగా ప్రదర్శన శాలలోకి వెళ్తున్నారు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. కాసేపు పునీత్ ని చూస్తూ ఏసీ చల్లదనంలో సేద దీరవచ్చని సీట్లలో ఆసీనులవుతున్నారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం…

కథేమిటంటే… సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్ ఒక సెక్యూరిటీ సర్వీసెస్  నిర్వహిస్తూంటాడు.

ఇందులో భాగంగా విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) కుటుంబ సెక్యూరిటీ భాధ్యతలు తీసుకుంటాడు.

విజయ్ గైక్వాడ్ ఒక మాఫియా. ప్రత్యర్థి మాఫియాతో అతడికి ప్రమాదం పొంచి వుంటుంది. అప్పటికే తన తండ్రిని చంపించేశాడు.

ఇక చెల్లెలు నిషా (ప్రియా ఆనంద్) ని కూడా చంపించేస్తాడని భయం పట్టుకుంటుంది.

ఈ నేపథ్యంలో సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్న సంతోష్, ప్రత్యర్ధి వర్గాన్ని అంతమొందించేస్తాడు. దీంతో సంతృప్తి చెందిన గైక్వాడ్, చెల్లెలు నిషాని సంతోష్ కిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఇంతలో  సంతోష్ గురించిన భయంకర నిజం తెలుస్తుంది. ఈ సంతోష్ అసలెవరు? ఎందుకిలా  కావాలని గైక్వాడ్ కి దగ్గరయ్యాడు? జేమ్స్ పేరుతో అతడి గత చరిత్రేమిటీ? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి…

 ఈ సినిమా చూస్తూంటే కొన్ని తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. అవేమిటనేది సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవాలి. అలా కలెక్షన్స్ పెరుగుతాయి. దర్శకుడు చేతన్ కుమార్ లో ఒరిజినాలిటీ అనేది లేదు. తెలుగు సినిమాల్ని కలిపి కన్నడ సూపర్ స్టార్ తో తీస్తూ, ఆ కలిపిన కథల్ని ఎలా నడపాలో కూడా తెలుసులేక పోయాడు. పురాతన రజనీకాంత్ ‘బాషా’ టెంప్లెట్ ని వాడేశాడు. దీంతో నేటి సినిమాలాగా అన్పించడానికి ఈ కథ మొహమాట పడి ఇంటర్వెల్ కే తప్పుకుంది. అయితే సదరు తెలుగు సినిమాల్ని చూసినా చూడకపోయినా కన్నడ ప్రేక్షకులు తమ దివంగత స్టార్ సినిమా కాబట్టి ఆ భావోద్వేగాలతో హిట్ చేసేస్తారు.

తెలుగు ప్రేక్షకులతో ఈ పాజిటివ్ ఫలితాలుండవు. తెలుగులో చూసిన నాల్గైదు సినిమాలిందులో వున్నాయి కాబట్టి- ఇవి  ‘బాషా’ నీడన తలదాచుకున్నాయి కాబట్టి, ‘జేమ్స్’ గా మారిన ‘బాషా’ కోసం పోటీలు పడి వచ్చే అవకాశం లేదు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో జేమ్స్ అనే సైనికుడు, అతడి దేశభక్తి, ఆ దేశభక్తితో మాఫియాల్నీ, రౌడీల్నీ కాల్చి చంపే పోరాట శక్తీ చూడాలి. ఎందుకిదంతా అంటే రివెంజీ కథ కోసం. కనుక సైనికుడు, దేశభక్తి, రివెంజీ కలిపితే పాత తరహా మసాలా యాక్షన్ ఫార్ములా ‘జేమ్స్’ అయింది.

దీనికి పునీత్ రాజ్ కుమార్ పాత్ర, నటన ఏమాత్రం సహకరించవు. భావోద్వేగ సన్నివేశాలు అతి బలహీనపడి, చీటికీ మాటికీ యాక్షన్ దృశ్యాలు వచ్చేస్తూంటాయి. మంచి బాడీ వున్న పునీత్ ఫైటింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్ ఇవే హైలైట్ గా వుంటాయి. మిగిలిన విషయాలన్నీ అతుకుల బొంతలా వుంటాయి. పునీత్ కీ డూప్ ని వాడి అవసరమైన సీన్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇంత స్టార్ మూవీలో ఫ్యాన్స్ ని నవ్వించడానీకో, ఆనంద పర్చడానికో ఎంటర్ టైన్మెంట్ అనేది కూడా లేకుండా సినిమా తీశాడు దర్శకుడు.

ఇక హీరోయిన్ ప్రియా ఆనంద్ అద్భుత సౌందర్య రాశిలా మెరిసిపోతుంది. కానీ కథలో అదృశ్యమైపోతుంది. చివర్లో ఒక ట్విస్టు కోసం ప్రత్యక్ష మవుతుంది. ఇలా ఆమె ఒక పార్ట్ టైమ్ పాత్ర చేస్తుంది. తెలుగు హీరో శ్రీకాంత్ మాఫియాగా ఫర్వాలేదన్పించుకుంటాడు. పునీత్ సోదరులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ లు ఫ్యాన్స్ కి హుషారు తెప్పించడం కోసం దర్శనమిస్తారు. వీళ్ళుగాక ఇంకా అనేకమంది కన్నడ నటులతో ఈ సినిమా కిటకిటలాడుతూ వుంటుంది. ప్రొడక్షన్ విలువల కోసం భారీగా ఖర్చు చేశారు. కానీ చరణ్ రాజ్ సంగీతంలో పాటలు అంతంత మాత్రంగా వున్నాయి.

మాఫియాలకో నీతి వుంటుంది. అదేమిటంటే, తమ మధ్య గొడవల్లో కుటుంబాల్ని టార్గెట్ చేసుకో కూడదని. హిందీలో ఈ నీతితోనే  చూపిస్తారు. ఈ కన్నడలో మాఫియా నీతి లేకపోగా, పాత మాఫియా కథ చూపించారు.

—సికిందర్

James Official Teaser (Telugu) Puneeth Rajkumar | Chethan Kumar | Kishore Pathikonda | Charan Raj