మెంటల్ కామెడీ గురూ – ‘వజ్ర కవచధర గోవింద’

కమెడియన్ ఇమేజి కాదనుకుని హీరోగా స్థిరపడాలని సప్తగిరి చేసిన తొలిప్రయత్నం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ తమిళ రీమేకుగా ఏవరేజీ ఆడింది. తర్వాత రెండో ప్రయత్నం ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ అంటూ హిందీ రిమేకుగా పూర్తిగా ఫ్లాపయ్యింది. తిరిగి ఇప్పుడు మూడో ప్రయత్నంలో టైటిల్లోంచి ఎందుకైనా మంచిదని తన పేరు తీసేసి, ‘వజ్ర కవచధర గోవింద’ గా నామకరణం చేసుకుని ప్రేక్షకుల ముందుకు మరోసారి హీరోగా వచ్చాడు. కమెడియన్ ని హీరోగా సినిమా సాంతం ప్రేక్షకులు భరించలేరని గతంలో బ్రహ్మానందం, బాబూ మోహన్ లు నిరూపించుకున్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధంలేకుండా హీరోగా అలీ ఊకదంపుడుగా 52 సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ కొత్త తరం కమెడియన్లు వచ్చేసరికి సునీల్ సహా హీరోలుగా సమస్యలో పడుతున్నారు. సప్తగిరి ఈ సమస్య దాటాలనుకుని ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ దర్శకుడు అరుణ్ పవార్ కి మరో అవకాశ మిచ్చి చూశాడు. చూస్తే ఏమైందో చూద్దాం…

కథ

రాయల సీమలో పరశురామ క్షేత్రం అనే ప్రాంతం బంగారప్ప అనే వాడి ఆధీనంలో వుంటుంది. ఎప్పుడో ఒక నవాబు బంగారప్ప నానమ్మని వుంచుకుని, ఏనుగు ఘీంకారం విన్పించిన మేరా భూమి రాసిచ్చేశాడు. అదే ఇప్పుడు పరశురామ క్షేత్రం. ఈ క్షేత్రంలో రత్నాలు దొరుకుతూంటాయి. ఎవరికి దొరికినా బంగారప్పకిచ్చేసి ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి.
ఇదిలా వుండగా, ఇంకో చోట గోవిందా (సప్తగిరి) అనే దొంగ వుంటాడు. ఒక రాత్రి ఓ ఆర్కియాలజిస్టు ఇంట్లో దొంగతనానికి వెళ్ళి, అనుకోకుండా అతను రీసెర్చి చేస్తున్న గుడి రహస్యం తెలుసుకోవడానికి కారకుడవుతాడు. దీంతో గోవిందానీ, తన ముగ్గురు అనుచరుల్నీ వెంటబెట్టుకుని పరశురామ క్షేత్రం పోతాడు ఆర్కియాలజిస్టు. అక్కడ గుళ్ళో అతి విలువైన వజ్రముంది. దాన్ని రహస్యంగా తీసుకువచ్చి ప్రభుత్వానికి అందజేయాలని ప్లాను. ఆ ఊళ్ళోకి వెళ్తే అనుమానం వస్తుంది గనుక, గోవిందాతో బాటు స్వాముల వేషాలేసుకుని వెళ్తారు.

స్వామీజీలా నటిస్తూ గోవిందా త్రిపుర (వైభవీ జోషి) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఒక రాత్రి గుళ్ళోకి ప్రవేశించి 150 కోట్ల విలువైన వజ్రం తెచ్చుకుంటారు. ఆ ఆనందంలో గోవిందా తాగి ఏవో పిచ్చి ఆకులు తిని, వజ్రం ఎక్కడ పెట్టాడో మర్చిపోతాడు. ఈ బండారం బంగారప్పకి తెలిసిపోతుంది. దీంతో గోవిందా ప్రమాదంలో పడతాడు. కోల్పోయిన జ్ఞాపక శక్తి తిరిగి వస్తే తప్ప వజ్రం ఎక్కడుందో తెలీదు. ఇక జ్ఞాపక శక్తి తెప్పించడానికి బంగారప్ప ఏమేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

కనీసం నేటి మార్కెట్ స్పృహ కూడా వున్నట్టు లేదు ఇలాటి కథతో. ఇప్పుడు బి, సి సెంటర్లలో కూడా ఎవ్వరూ చూడని మెంటల్ కథ. సప్తగిరికి గానీ, దర్శకుడికి గానీ ప్రేక్షకులకి ఏమివ్వాలో బొత్తిగా సమాచారం లేనట్టుంది. పురాతన కథా కథనాలతో, సెంటిమెంట్లతో, నటనలతో, వెకిలి హాస్యంతో, నేలబారు సినిమా తీసి పొమ్మన్నారు. నిజానికి ఇలాటి కథ నిధికోసం వేట జానర్ లోకొస్తుంది. హిందీలో వచ్చిన ‘ఢమాల్’ సిరీస్ సినిమాలు, లేదా తెలుగులో వచ్చిన ‘అందరూ దొంగలే’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ లాంటి హిట్లు తీసిన పంథాలో యాక్షన్ కామెడీగా తీయాల్సిన కథ. కథని జ్ఞాపకశక్తి కోల్పోవడం మీదికి మళ్ళించి అక్కడే ఆపేసి, ఈ నిధికోసం వేట జానర్ కథకి నిలువునా వేటు వేశారు. ఈ వేటుతో మొదటి రోజు ఆటలు కూడా తగ్గిపోయాయి. బొత్తిగా మార్కెట్ యాస్పెక్ట్ గానీ, క్రియేటివ్ యాస్పెక్ట్ గానీ లేకుండా ఇంతటి ఘోరమైన సినిమా ఎలా తీస్తారో అర్ధం గాదు.

ఎవరెలా చేశారు

చేయడానికి నేటి ట్రెండ్ కి ఉత్త దొంగోడి క్యారెక్టర్ సరిపోయినా, దీనికింకేదో కథ పెట్టి ఏడ్పించారు. సప్తగిరి దొంగోడి పాత్ర వూళ్ళో క్యాన్సర్ తో జనం చచ్చిపోవడం చూడలేక, వాళ్ళని బతికించుకోవడం కోసం, వజ్రం కోసం బయల్దేరినట్టు అనవసరపు కాలం చెల్లిన బిల్డప్. ఆ క్యాసర్ రోగులతో, మరణాలతో, వాళ్ళ శాపనార్థాలతో ఒకటే విషాదం. సప్తగిరి ఏమైనా కాస్త నవ్వించ గలిగాడంటే స్వామీజీగా మంత్రాలేస్తున్నప్పుడే. కన్నింగ్ గా నటిస్తూ నవ్వించడంలో తను బెస్ట్ అని నిరూపించుకునే కామెడీ. ఆ తర్వాత సినిమా అంతా జ్ఞాపక శక్తి తెప్పించడానికి చేసే ప్రయత్నాలతో ఎపిసోడ్స్ అన్నీ వరస్ట్.

హీరోయిన్ వైభవి చూడానికి బావున్నా చేయడానికి పాత్ర లేదు. రెండో హీరోయిన్ అర్చన వూళ్ళో క్యాన్సర్ రోగులకోసం హీరో తోడ్పాటుతో ఎమ్మెల్యేగా గెలిచి, హేండిచ్చే క్యారెక్టర్. రొటీన్ గా ఉత్తుత్తిగానే మారిపోయి తిరిగి హీరో పక్షాన చేరే పాత ఫార్ములా టైపు. ఈ జానర్ కథలో ఈ పాత్రలకి స్థానం లేదు. ఇవి కథకి స్పీడ్ బ్రేకర్లు. అసలు వూళ్ళో క్యాన్సరే కథకి పట్టిన పెద్ద క్యాన్సర్.

ఇతర పాత్రల్లో చెప్పుకోదగ్గ నటీనటుల్లేరు. ప్రొడక్షన్ విలువలు చవకబారుగా వున్నాయి. పాటలైనా క్యాచీగా లేవు. హీరో మీద విషాద గీతమొకటి!

చివరికేమిటి

సప్తగిరి దృష్టిలో నేటి హీరోయిజానికి అర్ధమిదే అయితే ఇకముందు చాలా కష్టం. మూడో సినిమాకి కూడా తనెలా వుండాలో ప్లానింగ్ తెలుసుకోక పోవడం చాలా విచారకరం. జ్ఞాపక శక్తి కోల్పోయిన పిచ్చివాడి కామెడీలే చేయాలనుకుంటే హీరోగా మారాల్సిన అవసరం లేదు. కమెడియన్ గానే కొనసాగితే సరిపోతుంది. జ్ఞాపక శక్తి తెప్పించడానికి కరెంటు షాకు పెట్టే కామెడీ, కేరళ అమ్మాయిలతో మసాజ్ చేయించుకునే కామెడీ, పిచ్చాసుపత్రి నుంచి పిచ్చి వాళ్ళని పిలిపించుకుని కామెడీ…ఇలా రకరకాల పిచ్చి పిచ్చి ఎపిసోడ్లతో సినిమా అంతా నింపేశారు. నిజానికి ఇంకేదైనా సినిమాలో కమెడియన్ గా నటించడానికి ఒప్పుకుని, కామెడీ ట్రాకుగా పెట్టుకోవాల్సిన ఎపిసోడ్లు ఇవి. ఇంతకి మించి వీటికి సినిమాకి కథగా విలువలేదు. ఇవి పెట్టి హీరోగా ఏకంగా ఒక సినిమాయే తీసేశారు!

కొత్తతరం కమెడియన్ గా హాస్యానికి కూడా తన దగ్గరున్న సరుకు ఇదే అయితే, సప్తగిరికి చాలా కష్టం.

 


రచన, దర్శకత్వం : అరుణ్ పవార్
తారాగణం : సప్తగిరి, వైభవీ జోషి, అర్చనా వేద, టెంపర్ వంశీ
సంగీతం : విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం : ప్రవీణ్ వనమాలి
నిర్మాతలు :  వై నరేంద్ర, జివిఎన్ రెడ్డి
విడుదల : జూన్ 14,  2019
1 / 5

―సికిందర్