రివ్యూ – టెంప్లెట్ డిటెక్టివ్ పాట్లు!

షార్ట్ ఫిలిమ్స్ నటుడు నవీన్ పొలిశెట్టి సినిమా హీరోగా మారి డిటెక్టివ్ సినిమా చేశాడు. కొత్త దర్శకుడు స్వరూప్ దీన్ని తెరకెక్కించాడు. ఈ ఆరు నెలకాలంలో 118, కిల్లర్, గేమ్ ఓవర్, విశ్వామిత్ర, సెవెన్ అనే ఐదు సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చిన నేపధ్యంలో, ఆరోదిగా ఇప్పుడు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వచ్చి చేరింది. కొత్త హీరో, కొత్త దర్శకుడు, కష్టమైన మర్డర్ మిస్టరీ సబ్జెక్టు- దీన్నెలా తీసి వుంటారన్న ఆసక్తిని రేపారు. ఆసక్తికి తగ్గట్టు ఓపెనింగ్స్ కూడా ఫర్వాలేదు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాల నుంచి అన్ని తరగతుల ప్రేక్షకులు కూడా పక్కకి తిరిగి భిన్నమైన సినిమాల పట్ల కూడా కుతూహలం కనబరుస్తున్నారు. కాబట్టి సరైన సమయంలోనే కొత్త హీరో, కొత్త దర్శకుడు తమ క్రియేటివ్ కష్టంతో ప్రేక్షకుల ముందు కొచ్చారు. మరి ఈ మర్డర్ మిస్టరీతో కొత్తగా ఏం చెప్పారు? ఇందులో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే ఇంటరెస్టింగ్ పాయింటు ఏముంది? ఇవి ఒకసారి పరిశీలిద్దాం…

కథ
నెల్లూరులో సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) ఒక ప్రైవేట్ డిటెక్టివ్. తన ఫస్ట్ లవ్ ఫాతిమా పేరుతో ఎఫ్ బీ ఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అని కూరగాయల మార్కెట్ పక్కన డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూంటాడు. కొత్తగా చేరిన అసిస్టెంట్ స్నేహ (శృతీ శ‌ర్మ) కి ట్రైనింగ్ ఇస్తూంటాడు. అయితే సరైన కేసులు రాక ఇబ్బందులు పడుతూంటాడు. ఒకరోజు తెలిసిన రిపోర్టర్ రైల్వే ట్రాక్ పక్కన శవం పడుందని చెప్తే వెళ్లి చూసి, అనుమానితుడిగా పోలీసులకి దొరికిపోయి లాకప్ లో కూర్చుంటాడు. అదే లాకప్ లో మారుతీ రావు అనే అతణ్ణి తెచ్చి పడేస్తారు పోలీసులు. మారుతీరావు ఏడుస్తూ తన కూతురు దివ్య హత్య గురించి చెప్తాడు. ముగ్గురు హంతకుల ఫోన్ నంబర్లు ఇస్తాడు. ఇక బెయిలు మీద విడుదలైన ఆత్రేయ పెద్ద కేసు దొరికిందని ఉత్సాహంగా హంతకుల వేటలో పడతాడు. ఆ ముగ్గురు హంతకుల్లో ఇద్దరు కూడా శవాలై వుంటారు. వీళ్ళని ఎవరు చంపారు? అసలు రైల్వే ట్రాకు పక్కన ఇంకా వచ్చి పడుతున్న శవాల రహస్య మేమిటి? వీటి వెనకున్న రిలీజియస్ క్రైం ఏమిటి? ఫేక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ ఏమిటి?… ఇవీ డిటెక్టివ్ ఆత్రేయ ముందున్న ఛేదించాల్సిన మిస్టరీలు…

ఎలావుంది కథ
ఇది డిటెక్టివ్ జానర్ లో టెంప్లెట్ కథ. తెలుగు సినిమాల్లో డిటెక్టివ్ పాత్రల్ని ఒకే టెంప్లెట్ లో జోకర్లుగా చూపించడంతో అసలు డిటెక్టివ్ వృత్తి పట్ల ప్రేక్షకులకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. ప్రతీ డిటెక్టివ్ పాత్రా కేసుల్లేక ఈగలు తోలుకునే, కామెడీలు చేసుకునే, పోలీసులు ఛీత్కరించుకునే టెంప్లెట్ లోనే చిల్లరగా వుంటోంది. డిటెక్టివ్ వృత్తికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తోందన్న అవగాహనతో ఈ కథలుండవు. దేశంలో ఎన్నో పేరుపొందిన లైసెన్సుడు డిటెక్టివ్ ఏజెన్సీలున్నాయి హైదరాబాద్ సహా. కామెడీ చేసే డిటెక్టివ్ పాత్రలున్నాయి. అయితే అవి ప్రొఫెషనల్ గానే వుంటాయి, చిల్లర కమెడియన్లుగా కాదు. హాలీవుడ్ లో పీటర్ సెల్లర్స్ నటించిన ప్రొఫెషనల్ కామిక్ డిటెక్టివ్ పాత్రతో ప్రసిద్ధ ‘పింక్ పాంథర్’ సిరీస్ మిస్టరీలున్నాయి. 2017 లో తమిళంలో విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ (తెలుగు డబ్బింగ్ ‘డిటెక్టివ్’) ప్రొఫెషనల్ డిటెక్టివ్ పాత్రే.

కాబట్టి ప్రస్తుత డిటెక్టివ్ పాత్ర అప్డేట్ కాకుండా కాలం చెల్లిన పాత మూసలోనే ఇంకా వుండిపోయింది. పైగా ఇంకా అదే లాంగ్ కోటేసుకుని, క్యాపు పెట్టుకుని! ఈ డిటెక్టివ్ ఎవరూ ఆఫర్ చేయకుండానే కేసులు మీదేసుకుని సినిమా అంతా పరుగులు దీస్తూ పరిశోధిస్తాడు. ఓ క్లయంటూ, ఓ ఫీజు అంటూ లేని కేసులు. ఇందుకే తెలుగులో డిటెక్టివ్ పాత్రలంటే విలువలేకుండా పోతోంది. ‘డిటెక్టివ్’ లో ఒక వ్యక్తి వచ్చి సమస్య చెప్పుకుని కేసు అప్పగిస్తాడు విశాల్ కి. ‘మనోరమ సిక్స్ ఫీట్ అండర్’ అనే హిందీలో ఒక రిచ్ ఆవిడ డిటెక్టివ్ రైటర్ దగ్గరి కొచ్చి కేసు అప్పగిస్తుంది.

పాత వాసనలతో ఈ కథకి మార్కెట్ యాస్పెక్ట్ ఇలా వుంటే, క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి – సినిమాగా క్రైం జానర్ కి నప్పని ఎండ్ సస్పెన్స్ కథనం మధ్యలో తెచ్చి కలిపేశారు. కాన్సెప్ట్ వచ్చేసి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ స్కామ్ గురించి. ఇది రియల్ స్కామ్ అని చివర్లో ఆధారాలు చూపించారు. ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ స్కామ్ కి రిలీజియస్ క్రైములు చేయడం ద్వారా పాల్పడుతున్నట్టు చూపెట్టారు. రెండూ సామాజికపరమైన సమస్యలే. రెండోది మూఢనమ్మకాలతో. ఇలా ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ కి ఓ సామాజిక ప్రయోజనం కల్పించారు. కానీ కథనం విషయంలోనే – క్రియేటివ్ యాస్పెక్ట్ దగ్గరే – ఫస్టాఫ్ లో అనావృష్టి, సెకండాఫ్ లో అతివృష్టి అన్నట్టుగా ఆపసోపాలు పడ్డారు.

ఇక ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ టైటిల్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆరుద్ర’ గా వుంటే బావుండేదేమో. ఆత్రేయగారికి డిటెక్టివ్ లతో ఏ సంబంధమూ లేదు. ఆరుద్ర గారు ఆరు డిటెక్టివ్ నవలలు రాశారు. సూపర్ హిట్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ కౌబాయ్ అడ్వెంచర్ మూవీకి స్క్రిప్ట్ కూడా రాసి పడేశారు. డిటెక్టివ్ పాత్రలో నవీన్ పొలిశెట్టి షెర్లాక్ హోమ్స్ అభిమానిగా చెప్పుకుంటాడు. కానీ డిటెక్టివ్ నవలలు రాసిన ఆరుద్ర ఫోటోలు పెట్టుకుని, ఆయన అభిమానిగా చెప్పుకుని పూజిస్తూ వుంటే, ఆ నవలల్లో నేర పరిశోధనల గురించి చెప్తూ వుంటే, నేటివిటీకి కొత్తదనం వచ్చేది. ఎలాగూ తెలుగుదనం కోసం, నెల్లూరు నేటివిటీ కోసం చాలానే పాటుపడ్డారు.

ఎవరెలా చేశారు
ఒక కొత్త నటుడు తెరమీద కొత్త నటుడి పరిధులు దాటి, ఒన్ మాన్ షోగా అలరించడం నవీన్ కే చెల్లింది. అతను ఎదుగుతున్న రాజేంద్ర ప్రసాద్. అల్లరి నరేష్ ఖాళీ చేసిన స్థానాన్ని సులభంగా భర్తీ చేయగలడు. ఐతే డిటెక్టివ్ పాత్రకి కేవలం ఈ కామెడీ అంతా అవసరం లేదు, యాక్షన్ కామెడీ అవసరం. ‘దో జాసూస్’ (ఇద్దరు డిటెక్టివ్ లు) లో అలనాటి రాజ్ కపూర్, రాజేంద్రకుమార్ లు చేసేలాంటి యాక్షనబుల్ కామెడీ. లేదా జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించిన రోజర్ మూర్ పాత్రలాంటి నవ్వించే ఫన్నీ అడ్వెంచర్స్. నవీన్ కి ఈ పాత్రతో కామెడీ ఒక్కటే కాదు, విషాదాన్నిపలికించే అవకాశం కూడా దక్కింది. ఎక్స్ ప్రెషన్స్ లో అతను టాలెంటెడ్. మదర్ చనిపోయినప్పటి దృశ్యాలకి మంచి బిగువు తీసుకొచ్చాడు. ఐతే ఫైట్స్ లేకపోవడం ఒక లోపం కావచ్చు. క్లయిమాక్స్ లోకూడా ఫైట్స్ లేవు. అలాగే రోమాన్స్ లో తానేమిటో చూపించుకునే అవకాశం లేకుండా పోయింది. పక్కన అసిస్టెంట్ గా వుండే హీరోయిన్ అసిస్టెంట్ గా వుండి పోతుందంతే.

హీరోయిన్ గా శృతీ శ‌ర్మ చేసేదేమీ వుండదు. ఒక్క క్లూ కూడా చెప్పి డిటెక్టివ్ కి తోడ్పడదు. డిటెక్టివ్ వేసేజోకులకి రియాక్షన్స్ ఇవ్వడమే ఆమె పని. ఇతర పాత్రలు రియలిస్టిక్ గా వున్నాయి, పోలీసులుగా, విలన్లుగా వేసిన నటులూ రియలిస్టిక్ గా నటించారు. కర్నాటక డిటెక్టివ్ పాత్ర ఒక వెరైటీ.

లొకేషన్స్ తో, పాత్రల తీరు తెన్నులతో రస్టిక్ లుక్ తీసుకు వచ్చారు. బెంగాలీ రచయిత శరదిందు బందోపాధ్య డిటెక్టివ్ నవల ఆధారంగా బెంగాలీ దర్శకుడు హిందీలో తీసిన ‘డిటెక్టివ్ బ్యంకేష్ బాబు’ పురాతన లొకేషన్స్ తో పీరియడ్ లుక్ తో వున్నట్టు, ఆ కలర్ థీమ్ తీసుకు రావడానికి ప్రయత్నించారు గానీ బడ్జెట్ పరిమితులు సహకరించనట్టుంది. సౌండ్ ఎఫెక్ట్స్, బిజిఎం, ఎడిటింగ్ బావున్నాయి.

చివరికేమిటి
ఫస్టాఫ్ ముప్పావు గంట డిటెక్టివ్ క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే టైము తీసుకున్నారు. ఇంతసేపూ అతనేం తింటాడు, ఎలా తాగుతాడు, అతడి సమయస్ఫూర్తి, సునిశిత దృష్టీ ఏమిటి, చిల్లర కేసులు ఎలా పరిష్కరిస్తాడు – ఇవన్నీ డిటెక్టివ్ పాత్ర చులకనయ్యేలా అల్లరిగా చేసుకుపోతాడు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడం, ఒకటికి రెండు సార్లు లాకప్ లో పడ్డం చేస్తాడు. లాకప్ లో మారుతీ రావ్ కూతురి హత్య గురించి చెప్పాకనే కథ ప్రారంభమవుతుంది. ఇంతసేపూ కథలేని చేష్టలతో అతివృష్టి. మామూలుగా సినిమాల్లో ఈ ముప్పావు గంటలో రెండు పాటలు వస్తాయి గనుక విషయం లేనితనం కవరై పోతుంది. ఇందులో పాటలే లేకపోవడంతో పూర్తి 45 నిమిషాలు ఉపోద్ఘాతంతో బోరు కొట్టే పరిస్థితి.

ఇక కథ మొదలయ్యాక అనేక మలుపులతో అతి వృష్టి. కథనమంతా చాలా క్లూలూ, లింకులూ, అనుమామానాలూ సృష్టిస్తూ పోయారు. ముగింపు ఓ పావుగంట ముందు డిటెక్టివ్ కి శవాల అసలు రహస్యం అర్థమయ్యాక- మొదట్నించీ వున్న ఆ క్లూలూ, లింకులూ, అనుమానాలూ వగైరాలని కలిపి కార్యకారణ సంబంధం చెప్పుకొస్తూ మిస్టరీకి భాష్యం చెప్తాడు. ఇదే భాష్యం ఇంకో సందర్భంగా కూడా చెప్తాడు. ఆ ఎన్నో చిన్న చిన్న క్లూలు, లింకులు, అనుమానాలూ మన కేవీ గుర్తుండవు, గుర్తు పెట్టుకోవడం కష్టం కూడా. కాబట్టి వాటి ఆధారంగా మిస్టరీకి అతను చెప్పే భాష్యం ఏదీ మెదడు కెక్కదు. ఇదే ఎండ్ సస్పెన్స్ కథనంతో వచ్చే సమస్య. కథలో మిస్టరీ నంతా చివరి వరకూ దాచి పెట్టి చెప్పే ఎండ్ సస్పెన్స్ విధానం ఎప్పుడూ బెడిసి కొడుతుంది. మిస్టరీ వీడాక ఆ స్కామ్ బాధితుడు తనుకూడా నని డిటెక్టివ్ కి తెలియడం ఒక్కటే, ఎమోషనల్ కంటెంట్ తో ముగింపుని కాపాడింది.

రచన – దర్శకత్వం: ఆర్.ఎస్.జె స్వరూప్
తారాగణం : న‌వీన్ పోలిశెట్టి, శృతీ శ‌ర్మ, కృష్నేశ్వర్ రావు తదితరులు
స్క్రీన్ ప్లే: స్వరూప్ – నవీన్ పొలిశెట్టి, సంగీతం: మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : సన్నీ కురపాటి
బ్యానర్ : స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత: నక్కా రాహుల్ యాదవ్
విడుదల : జూన్ 21, 2019
2.5 / 5

―సికిందర్