`ప‌లాస 1978` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: ర‌క్షిత్‌, న‌క్ష‌త్ర‌, ర‌ఘు కుంచె, తిరువీర్‌, ల‌క్ష్మ‌ణ్‌, శృతి, జ‌గ‌దీష్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం: క‌రుణ్ కుమార్‌
నిర్మాత‌: ధ‌్యాన్ అట్లూరి
సంగీతం: ర‌ఘు కుంచె
సినిమాటోగ్ర‌ఫీ : అరుల్ విన్సెంట్‌
ఎడిట‌ర్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ: సుధా మీడియా
రిలీజ్ డేట్ : 06-03-2020
రేటింగ్ : 2.5

రెట్రో థ్రిల్ల‌ర్స్‌, పిరిమాడిక్ స్టోరీస్‌.. రియ‌లిస్టిక్ క‌థ‌ల‌పై ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల్లోనూ, మేక‌ర్స్‌లోనూ ఆస‌క్తి పెరిగిపోతోంది. ఇటీవ‌ల వ‌చ్చిన `రంగ‌స్థ‌లం`, కేరాఫ్ కంచ‌ర పాలెం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంస‌ల్ని పొందాయి. దీంతో ఈ త‌ర‌హా చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఈ సినిమాల స్ఫూర్తితో వ‌చ్చిన చిత్రం `ప‌లాస 1978`. దీనికి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కూడా తోడ‌వ్వ‌డం, ఇండ‌స్ట్రీలో వున్న వారంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా రిలీజ్‌కు ఒక్క‌రోజు ముందే ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్‌కు మెగా ప్రొడ్యూస‌ర్ అడ్వాన్స్ ఇవ్వ‌డంతో ఆ అంచ‌నాలు మ‌రీ పెరిగాయి. మ‌రి `ప‌లాస 1978` అంద‌రి అంచ‌నాల‌కు అనుగునంగానే వుందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

1978లో ప‌లాస‌లో జ‌రిగిన క‌థ ఆధారంగా దానికి ఫిక్ష‌న్‌ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప‌లాస‌లో
పెద్ద షావుకారు (జెన్నీ), చిన్న షావుకారు (ర‌ఘు కుంచె)దే పెద్ద‌రికం. త‌మ కులం అంటే గ‌ర్వంగా ఫీల‌వుతుంటారు. ఊళ్లో వున్న మిగ‌తా కులాల వారిని త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకుని అదికారం చేయాయిస్తుంటారు. త‌నుకూ ఇలాగే అధికారం చెలాయించాల‌ని, అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని, ఆ క్ర‌మంలో త‌న అన్న‌ని ప‌క్క‌కు త‌ప్పించాల‌ని చిన్న షావికారు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆ ప్ర‌య‌త్నాల‌ని పెద్ద షావుకారుకు అండ‌గా వున్న బైరాగి కార‌ణంగా చిన్న షావుకారు ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌వు. ఒక సంద‌ర్భంలో పెద్ద షావుకారుతో విభేధించిన జాన‌ప‌ద క‌ళాకారులు మోహ‌న్‌రావు (ర‌క్షిత్‌), రంగారావు (తిరువీర్‌) క‌లిసి బైరాగిని పంపేస్తారు. దీంతో చిన్న షావుకారుకు మంచి అద‌ను ల‌భిస్తుంది. దాంతో అన్న‌ని అధికార పీఠం నుంచి త‌ప్పించి త‌నే ప‌లాస‌లో పెత్త‌నాన్ని చెలాయించ‌డం మొద‌లుపెడ‌తాడు. ఈ క్ర‌మంలో ప‌లాస‌లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి? చిన్న షావుకారు ఆగ‌డాల‌కు మోహ‌న్‌రావు, రంగారావు ఎలా అడ్డుత‌గిలారు? ఆ క్ర‌మంలో ఏం జ‌రిగింది? అన్న‌ది తెర‌పైన చూఆల్పిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:

సినిమాలో చాలా వ‌ర‌కు రంగ‌స్థ‌ల క‌ళాకారులే న‌టించారు. అంద‌రు త‌మ త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. కీల‌క పాత్ర‌లో హీరోగా న‌టించిన ర‌క్షిత్‌కిది రెండ‌వ సినిమా. తొలి సినిమా పెద్ద‌గా పేరు తీసుకురాలేక‌పోయినా ఆ సినిమా అత‌న్ని ఆర్టిస్ట్‌గా నిల‌బెట్టేలా వుంది. ఇక కేరాఫ్ కంచ‌ర పాలెంలో రౌడీగా న‌టించిన తిరువీర్ పాత్ర కూడా బాగానే పండింది. ఈ సినిమా త‌రువాత అత‌నికి మ‌రింత డిమాండ్ పెరుగుతుంది. మంచి పాత్ర‌ల్లో రాణించేఅవ‌కాశం ల‌భిస్తుంది. హీరోయిన్ న‌క్ష‌త్ర పాత్ర చిన్న‌దే అయినా గుర్తుంటుంది. ఇక సినిమాలో అత్యంత ముఖ్య‌మైన పాత్ర విల‌న్ చిన్న షావుకారు. ఆర్టిస్ట్‌గా, గాయ‌కుడిగా, సంగీత దర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్న ర‌ఘు కుంచె తొలిసారి ఈ చిత్రంలో విల‌న్‌గా చిన్న షావుకారు పాత్ర‌లో నాలుగు ద‌శ‌ల్లో కొత్త‌గా క‌నిపించాడు. తెర‌పై క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఇక‌పై మ్యూజిక్ ప‌క్క‌న పెట్టి విల‌న్ వేషాలు వేసుకోవాల్సిందే. అంత‌గా ఆయ‌న‌కు ఆఫ‌ర్లు రావ‌డం గ్యారెంటీ. సెబాస్టియ‌న్ పాత్ర‌లో న‌టించిన న‌టుడు, ల‌క్ష్మ‌ణ్ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు:

ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్ ర‌ఘు కుంచె అందించిన సంగీతం. తెర‌పై విల‌న్‌గానే కాకుండా సంగీత ద‌ర్శ‌కుడిగానూ త‌న‌దైన పాత్ర‌ని అద్భుతంగా పోషించాడు. జాన‌ప‌ద క‌ళాకారుల‌తో పాడించిన పాట‌ల‌న్నీ బాగున్నాయి. అరుల్ విజ‌య్ అందించిన విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల్ని 1978 కాలాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపిస్తాయి. ఈ విష‌యంలో అరుల్ విన్సెంట్ నూటికి నూరుశాతం స‌క్సెస్ అయ్యారు. `బాహుబ‌లి` లాంటి సంచ‌ల‌న చిత్రాన్ని ఎడిట్ చేసిన కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు. అయితే ఆయ‌న చాలా వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌నిపిస్తుంది. చాలా చోట్ల ల్యాగ్ వుంది. మ‌రి కొన్ని చోట్ల క‌థాగ‌మ‌నం మంద‌కొడిగా సాగ‌డం విరుగుపుట్టిస్తుంది. ఆయ‌న మ‌రింత కేర్ తీసుకుని వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ సినిమాకు చాలా మైస్‌గా మారింది. రేసీ స్క్రీన్‌ప్లేతో సాగాల్సింది.. న‌త్త‌న‌డ‌క‌న సాగ‌డం నీర‌సాన్ని తెప్పిస్తుంది. ఇక రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో సాగిన రామ్ సుంక‌ర ఫైట్స్ బాగున్నాయి. ధ‌్యాన్ అట్లూరి నిర్మాణ విలువ‌లు సూప‌ర్‌.

విశ్లేష‌ణ‌:

ట్రైట‌ర్‌, టీజ‌ర్‌ల‌తోనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఆ త‌రువాత కూడా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. 1978 కాలాన్ని బాగానే ప్ర‌జెంట్ చేసిన ద‌ర్శ‌కుడు క‌థ‌గ‌మ‌నంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది. రొటీన్ రివేంజ్ డ్రామానే అయినా దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన తీరుకు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌ని అభినందించాల్సిందే. అయితే మ‌రింత‌గా క‌థ‌ని రాసుకుని అంతే బెట‌ర్‌గా న‌డిపించి వుంటే ఫ‌లితం మ‌రింత బాగుండేది. సెకండ్ హాఫ్ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుండాల్సింది. ఏది ఏమైనా ఓవ‌రాల్‌గా ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ మాత్రం ద‌ర్శ‌కుడిగా వంద శాతం స‌క్సెస్ కాలేక‌సోయినా త‌న టేకింగ్‌తో మాత్రం ఇంప్రెస్ చేయ‌గ‌లిగాడు. మంచి క‌థ కుదిరితే మ‌రింత బెట‌ర్‌గా తీయ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కాన్ని మాత్రం తెచ్చుకున్నాడు. రియ‌లిస్టిక్ చిత్రాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని మాత్రం `ప‌లాస 1978` ఎట్టిప‌రిస్థితుల్లోనూ నిరుత్సాహ‌ప‌ర‌చ‌దు.