పావు గంటలో కైలాసం – ‘సడక్ -2’ రివ్యూ


దర్శకత్వం : మహేష్ భట్
తారాగణం : సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్, ప్రియాంకా బోస్, జిస్షూ సేన్ గుప్తా, మార్కండ్ దేశ్ పాండే తదితరులు
రచన : మహేష్ భట్, సుమిత్రా సేన్ గుప్తా; సంగీతం: జీత్ గంగూలీ, అంకిత్ తివారీ తదితరులు, నేపథ్య సంగీతం : సందీప్ చౌతా, ఛాయాగ్రహణం : జే పటేల్
నిర్మాత : ముఖేష్ భట్
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
1.5/5


సీనియర్ దర్శకుడు మహేష్ భట్ 1999 లో ‘కర్టూస్’ తర్వాత తిరిగి ఇప్పుడు 21 ఏళ్ళు గడిచాక దర్శకత్వం వహించాలన్పించి, తీరా 1991 లో తనే దర్శకత్వం వహించిన ‘సడక్’ కి ఇప్పుడు 29 ఏళ్ల తర్వాత సీక్వెల్ కూడా తీయాలన్పించి, ‘సడక్- 2’ గా సర్వాంగ సుందరంగా సిద్ధం చేశాడు. ‘హృదయపు పాత రహదారి మీద ఏమీ లేదు…’ అనే టైటిల్ పాటతో సినిమా కథ ప్రారంభించాడు. ‘సడక్’ (అంటే రోడ్డు) పాత రహదారే. ఇప్పుడు టోల్ గేట్లతో కొత్త రోడ్లు వచ్చాయి. ‘సడక్ -2’ కి కొత్త రోడ్డు – ఎక్స్ ప్రెస్ వే వేసుకోకపోతే ఏముంటుంది? హృదయపు పాత రహదారి మీద ఏమీ లేదనే బాటసారి పాటే మిగుల్తుంది.

పాటతోనే తేల్చేశాక ఇంకా సినిమా చూడ్డాని కేముంటుంది? 1990 మోడల్ సినిమాకి 1.5 రేటింగ్ వుంటుంది. ముంబాయి నుంచీ కైలాస పర్వతానికి కారు ప్రయాణపు కథ పావు గంటకే కైలాసం కన్పించేలా చేస్తుంది. కైలాసం చూడాలనుకుంటే ఈ సినిమా చూసి పావుగంటలో టపా కట్టేయొచ్చు. మానస సరోవరానికి అదనపు జన్మ. సరోవరంలో పుణ్య స్నానం ఆ జన్మ నిర్ణయిస్తుంది.

సంజుబాబా (సంజయ్ దత్), ఆలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్ ఈ యాత్ర చేశారు. వీళ్ళకి కంపెనీ ఇస్తూ కొందరు వెంటపడ్డారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వెంటపడ్డారు తెలుసుకోవడానికి కథ చూద్దాం.

కథ
ఆర్య (ఆలియా భట్) కోట్లాది రూపాయల సంపదకి ఏకైక వారసురాలు. ఈమెకి తండ్రి యోగేష్ (జిస్షూ సేన్ గుప్తా), సవతి తల్లి నందిని (ప్రియాంకా బోస్) వుంటారు. నందిని నకిలీబాబా జ్ఞాన్ ప్రకాష్ (మార్కండ్ దేశ్ పాండే) తో కుట్రపన్ని గతంలో ఆర్య తల్లిని చంపేసింది. భర్తని బానిసగా చేసుకుంది. ఇక ఆర్య కి 21 నిండితే ఆస్తి ఆమె చేతికొస్తుంది. ఈలోగా ఆమెని చంపే కుట్రతో వుంటుంది నందిని నకిలీ బాబాతో కలిసి. ఆర్య నకిలీ బాబాల భాగోతాన్ని రట్టు చేసేందుకు సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభిస్తుంది. జ్ఞాన్ ప్రకాష్ బాబాని కూడా టార్గెట్ చేస్తుంది. ఆమె తల్లి కైలాస ఆలయం దర్శించుకోవాలన్న కోరిక తీరకుండానే చనిపోయింది. ఆ కోరిక తీర్చడానికి తను బయల్దేరుతుంది ఆర్య. తిరిగి వచ్చాక జ్ఞాన్ ప్రకాష్ బాబా పని పట్టాలనుకుంటుంది. చెప్పకుండా ఆమె కైలాస యాత్రకి వెళ్లిపోయేసరికి కంగారు పడ్డ నందిని గ్యాంగ్ ని ఎగదోస్తుంది.

ఆర్య తాత్కాలికంగా తప్పించుకుని రవి కిషోర్ వర్మ (సంజుబాబా) దగ్గరి కొస్తుంది. టాక్సీ డ్రైవర్ అయిన రవి చనిపోయిన భార్య గుర్తుకొస్తూ బతకలేక పోతూంతాడు. భార్య దగ్గరికి స్వర్గానికి వెళ్లిపోయెందుకు ప్రయత్నిస్తూంటాడు. అలా స్వర్గానికి వెళ్లబోతూంటే ఆర్య వచ్చి కైలాసానికి పదమంటుంది.

విశాల్ (ఆదిత్యా రాయ్ కపూర్) అనే సింగర్ బాయ్ ఫ్రెండ్ వుంటాడు ఆర్యకి. అతణ్ణి కూడా టాక్సీ ఎక్కించుకుంటుంది. ఇప్పుడు నందిని గ్యాంగ్, లంచగొండి పోలీస్ ఇన్స్పెక్టర్, సీరియల్ కిల్లర్ ప్రభృతులు వీళ్ళ వెంట పడతారన్న మాట!

నటనలు – సాంకేతికాలు

సంజుబాబా ఆదేశిస్తే కుంభకర్ణ అనే గుడ్ల గూబ శత్రువుల మీద దాడి చేస్తుంది. అలాటి గుడ్లగూబని వదిలేసి ఆత్మహత్య చేసుకుంటానంటే ఎలా. ముప్ఫై ఏళ్ల క్రితం 1991 ‘సడక్’ లో చనిపోయిన భార్య (పూజా భట్) విజువల్సే వేసుకుంటూ ఇంకా ఏడుస్తూ ఆత్మ హత్య చేసుకోబోతూంటే విఫలం కావడంలో ఆమె హస్తముందేమో ఎందుకు అర్ధం జేసుకోడు. తాజాగా ఫ్యానుకి ఉరేసుకుంటే ఫ్యాను ఊడిపడుతుంది. గ్యారేజీలో ఇంకేదో చేసి భార్య దగ్గరికి వెళ్లిపోదామనుకుంటే ఆర్య వచ్చి కైలాసానికి టాక్సీ బుక్ చేసుకుంటుంది. ఇలాటి విషాద పాత్రలో మొదటి 45 నిమిషాలు సినిమా చూడాలన్న ఆసక్తిని చంపేస్తాడు. పాత మోడల్ సీన్లు, పాత మోడల్ డైలాగులు. యాత్రకి బయల్దేరాక వెంటపడుతున్న శత్రువులతో కామెడీ యాక్షన్ లో కూడా రాణించలేక పోయాడు. నలిగిన పాత కథ కావడంతో నావెల్టీ ఫ్యాక్టర్ పెద్ద ప్రశ్న అయి కూర్చుంది ఏం చేయాలన్నా.

ఆలియా భట్ ది సిల్లీ పాత్ర. తండ్రి సినిమా కాబట్టి ఒప్పుకుని వుండొచ్చు. ఇంకో దర్శకుడు ఇలాటి కథతో ఆమె దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయడు. ఆస్తికోసమో, పెళ్లి కోసమో హెరోయిన్ ని వెంటాడే విలన్ల సినిమాలు వంద వచ్చి వుంటాయి. అలాటి ఒక కాలం చెల్లిన హీరోయిన్ పాత్ర. ఇక ఆదిత్యా రాయ్ కపూర్ ఆలియా భట్ వెంట రోమాన్స్ కీ, సాంగ్స్ కీ, పాత మోడల్ విలన్స్ తో ఫైట్స్ కీ సర్దుబాటు చేసుకుని తృప్తి పడ్డాడు. మహేష్ భట్ మళ్ళీ ఇదొక ‘ఆషిఖీ’ అన్నట్టు 10 పాటలు పెట్టాడు. ‘ఆషిఖీ’ ని గుర్తు చేసినందుకు ఈ సినిమా వదిలేసి ‘ఆషిఖీ’ లో 12 పాటలూ వినాలన్పించేలా చేశాడు.

టేకింగ్ గానీ, టెక్నికల్ విభాగాలు గానీ ట్రెండ్ లో లేవు. ఇంత సీనియర్ దర్శకుడు ఏకోశానా మార్కెట్ యాస్పెక్ట్ కానరాని ఇలాటి సినిమాకి ఎందుకు దర్శకత్వం వహించాలనుకున్నాడో తెలియదు. తను వయసులో వున్నప్పుడు తీసిన సినిమాల్లాంటిదే ఎల్లకాలం తీయవచ్చనుకుంటాడా ఏ మేకరైనా? ఇప్పటి యువత వయసుకి మారాలా వద్దా?

కథా కథనాలు

ఈ పాటికి కథెలా వుందో అర్ధమైపోయే వుంటుంది. ఇక కథనం అనే పదార్ధం, అంటే స్క్రీన్ ప్లే అనే ఫైలు సీక్రెట్ సర్వీస్ డాసియర్ లా వుంది. గూఢచారులే దీన్ని చదివి అర్ధం చెప్పగలరు. వాళ్లయినా ఇంటర్ పోల్ కో, సీఐఏకో పంపాల్సి రావచ్చు. కనుక దీని జోలికి మనం పోతే ఎన్ని పేజీలు రాసినా ఏమీ తేలదు, వదిలేద్దాం. 1.5 రేటింగ్ కి ‘సడక్’ కి చాలా మరమ్మత్తులవసరం. విశేషమేమిటంటే, 1990 నుంచి ‘దిల్’, ‘బేటా’, ‘రాజా’ లాంటివి దర్శకుడు ఇంద్ర కుమార్ ఇదే సంజుబాబా తో 2007 లో ‘ఢమాల్’, 2011 లో ‘డబుల్ ఢమాల్’, తిరిగి ఇటీవలే 2019 లో అజయ్ దేవగణ్ తో ‘టోటల్ ఢమాల్’ అనే యాక్షన్ కామెడీ రోడ్ మూవీలు ట్రెండీగా తీస్తూ హిట్ చేసుకుంటూ పోయాడు. ఎప్పటికప్పుడు నవతరం పోకడలకి అతను మారాడు. ఇలాటిదే అయిన రోడ్ మూవీతో భట్ మారలేదు.

―సికిందర్