జబర్దస్త్ కామెడీ?- ‘బందోబస్త్’ మూవీ రివ్యూ!

జబర్దస్త్ కామెడీ? – ‘బందోబస్త్’ మూవీ రివ్యూ!

 

తమిళ స్టార్ సూర్య సినిమా అంటే భారీ యాక్షన్ మసాలా. గజినీ, శివ పుత్రుడు, సెవెంత్ సెన్స్, సింగం, వీడొక్కడే, 24, వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలన్నీ ఒక అధ్యాయం. గత రెండు చినబాబు, ఎన్ జి కే లతో పక్కా పాత చింతకాయ మూస లోకి రూటు మార్చి ఇంకో అధ్యాయం ప్రారంభించాడు. ఈ రెండూ ఘోరమైన ఫ్లాప్స్ కావడంతో తెలుగు మార్కెట్ నమ్మకాన్ని కోల్పోయాడు. దీని ప్రభావం ఇప్పుడు తాజా ‘బందోబస్తు’ మీద పడింది. సూర్య సినిమాలంటే ఇక తిరోగమనంతో పాత చింతకాయ సినిమాలనే అభిప్రాయం బలపడింది. కానీ దీని దర్శకుడు కెవి ఆనంద్ కావడంతో కొంత ఆశకూడా కలిగింది. ‘రంగం’ తో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన ఆనంద్ పాత చింతకాయకి దూరంగా వుండే దర్శకుడు. జాతీయ అవార్డు పొందిన ఛాయాగ్రహకుడు. ‘రంగం’ తో బాటు కవన్, అనేగం వంటి హిట్స్ తీశాడు. ఇప్పుడు ‘బందోబస్తు’ అనే భారీ యాక్షన్ తీశాడు. ఇలా పాత చింతకాయ వైపు వెళ్తున్న సూర్య, పాత చింతకాయకి దూరంగా వుంటున్న ఆనంద్ కలిశారు. భిన్న ధృవాలుగా వీళ్ళిద్దరూ కలిస్తే ఏం జరిగింది? మార్కెట్ నిలబడిందా? ఈ విషయం పరిశీలిద్దాం…

కథ 
5 4 | Telugu Rajyam
ఒక ప్రయాణిస్తున్న రైలుని వీరోచితంగా బాంబులతో పేల్చేస్తాడు (రవి కిషోర్ సూర్య). ఈ ఘోరానికి పాల్పడ్డాక, కొన్ని నెలలు వెనక్కి వెళ్తుంది కథ. ఇప్పుడు రవికిషోర్ ఒక ఆర్గానిక్ రైతు వేషంలో వున్న మిలిటరీ ఇంటలిజెన్స్. వ్యవసాయం చేస్తూ రహస్య ఇంటలిజెన్స్ కార్యకలాపాలు సాగిస్తూంటాడు. పాకిస్తాన్ కూడా వెళ్లి ఒక ఆపరేషన్ చేసి వస్తాడు. ఇలావుండగా, చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) దేశ ప్రధాని. భార్య, అభిషేక్ (ఆర్య) అనే కొడుకూ వుంటారు. అంజలి (సాయేషా సైగల్) అనే ప్రెస్ సెక్రెటరీ వుంటుంది. ఒక కార్యక్రమంలో ప్రధాని వర్మ మీద టెర్రరిస్టులు దాడి చేస్తారు. వర్మ తప్పించుకుంటాడు. వర్మ లండన్ ప్రయాణం ఏర్పాటవుతుంది. ఇప్పుడు సెక్యూరిటీగా రవి కిషోర్ ని తీసుకుపోతారు. లండన్ లోనూ టెర్రరిస్టులు దాడి చేస్తారు. రవి కిషోర్ ప్రధానిని కాపాడతాడు. దీంతో అతణ్ణి ఎస్ పి జి కమెండోగా నియమించి ప్రధాని రక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. కాశ్మీర్ టూర్ వెళ్తాడు ప్రధాని వర్మ. అక్కడ అతణ్ణి అంతమొందించడంలో టెర్రరిస్టులు విజయం సాధిస్తారు.విఫలమైన రవికిషోర్ సస్పెండ్ అవుతాడు.

దీన్ని రవికిషోర్ ఎలా తీసుకున్నాడు? వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నాడా? ప్రధాని హంతకుల్ని పట్టుకోవడానికి సమాయత్తమయ్యాడా? తర్వాతి ప్రధాని ఎవరు? ఈ ప్రధాని ఏం చేశాడు? బడా పారిశ్రామిక వేత్త చేస్తున్న కుట్రలేమిటి? రవికిషోర్ రైలుని పేల్చేసే దుశ్చర్య కెందుకు పాల్పడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
1 6 | Telugu Rajyam
ఇది ఎసాసినేషన్ జానర్ కథ. ఈ జానర్ లో దేశాధ్యక్షుల హత్యల కథాంశాలతో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ కోవలో పైన చెప్పుకున్నది ‘బందోబస్త్’ అసలు కథ. ప్రధాని చుట్టూ ఎస్ పిజి కమెండోతో సాగే జయాపజయాలతో – స్పష్టంగా అర్ధమయ్యే కథ. ఈ కథలోకి – జానర్లోకి, న్యూస్ డెస్క్ తెర్చి, (దర్శకుడు మాజీ జర్నలిస్టు అయినందుకు) సంబంధంలేని అనేక పిట్ట కథల్ని సబ్ ప్లాట్స్ గా దూర్చి గందరగోళం చేసి, ఒక పాత చింతకాయ బూడిద జలజలా రాల్చి, తృప్తి తీర్చుకున్నారు. పాత చింతకాయ ప్రేమికుడుగా మారిన సూర్య ఉక్కు పరిష్వంగంలోకి, పాత చింతకాయ వ్యతిరేకి యైన ఆనంద్ టైట్ గా బందీ అయిపోయి, జోగీ జోగీ అయిపోయారు. ప్రేక్షకుల్ని ఎంత బందోబస్తు చేసినా పారిపోయే పరిస్థితి కల్పించారు.

జర్నలిస్టుగా రోజుకో సమస్య పేపర్లో రాయాల్సి పోయి, సినిమాలో పెట్టేశాడు. ప్రధాని మరణం ఎటో పోయింది. టెర్రరిస్టు దాడులు, ఆర్గానిక్ వ్యవసాయం లాభాలు, సరిహద్దులో సైనిక దళాల ఊచకోత, రసాయన ఎరువులతో గొడ్రాలవుతున్ననేలతల్లిపై సందేశాలు, హీరో పాక్ ఆపరేషన్, మిడుతల దండుతో పంటల నాశనం, ప్రధాని సందేశం, రైతుల ఆత్మ హత్యలు, పాక్ రాయబారికి మందలింపులు, ఒక రసాయన స్థావరం పేల్చి వేత, తూర్పు గోదావరి జిల్లాలో రైతు భూముల్లో థోరియం నిక్షేపాలు, భూముల అక్రమణ, తూర్పు రైతుల ఉద్యమం, నాయకుల సందేశాలు, కాశ్మీర్ సమస్య, బాలల దేశభక్తి గీతం, కొత్త ప్రదాని తన ప్రేమ కథలు చెప్పడం, పాత ప్రధానని హీరోతో డబుల్ మీనింగులు మాట్లాడడం, హీరోతో హీరోయిన్ డబుల్ మీనింగులు, హీరోయిన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ, బర్త్ డే పార్టీకి కొత్త ప్రధాని మారు వేషంలో రావడం….ఇలా విజ్ఞాన సర్వస్వ చంద్రికలా వుంటుంది. తమిళ సినిమాలకి రైతు సమస్యలు హిట్ ఫార్ములా అన్నట్టుంది. కథతో సంబంధం లేకుండా రైతు సెంటి మెంట్లు పెట్టి కథని కాశీకి పంపడం.

ఎవరెలా చేశారు
2 6 | Telugu Rajyamసూర్యకి చేయడానికి కావాల్సినన్ని భారీ యాక్షన్ సీన్స్ వున్నాయి. చేతనైన కథలేదు. ఎప్పుడు కమెండోగా వుంటాడో, ఎప్పుడు రోమాన్స్ చేస్తాడో, ఎప్పుడు రైతుగా వుంటాడో, ఎప్పుడు టెర్రరిస్టులతో పోరాడతాడో, ఎప్పుడు పాటలు పాడతాడో, ఎప్పుడు కామెడీ చేస్తాడో, ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలీదు.

మనుధర్మం మాట్లాడే ప్రధానిగా మోహన్ లాల్ పాత్రని హూందాగా నటించినా, అధికార విధులు నిర్వహిస్తున్నట్టు, ఒక దేశప్రధాని అన్పించేలా ఎక్కడా కనపడడు. ఈ విషయంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ లో ప్రధాని పాత్రలో మన్మోహన్ సింగ్ గా నటించిన అనుపం ఖేర్ బెస్ట్ అన్పిస్తాడు.

ప్రధానిగా మోహన్ లాల్ కి లండన్ లో ఒక సీనుంటుంది ఎన్నారైలతో – స్వదేశం, పరదేశం గురించి. స్వదేశం తల్లిలాంటిదని, పరదేశం భార్య లాంటిదని, భార్యకి తల్లితో లవ్ హేట్ రిలేషన్ షిప్ వుంటుందనీ, కానీ మనకి తల్లి పట్లే ప్రేమా గౌరవం వుంటాయనీ రొటీన్ సందేశం ఇస్తాడు. కానీ మొన్న ఆసియన్ నోబెల్ లాంటి మెగసెసై అవార్డు పొందిన ఎన్డీ టీవీ హిందీ యాంకర్ రవీష్ కుమార్, ఎన్నారైలు ఎలా ఆలోచించాలో ప్రసంగించిన అద్భుత వీడియోలున్నాయి యూట్యూబ్ లో.

ప్రధాని సెక్రెటరీగా హీరోయిన్ సాయేషా సైగల్ స్ట్రయికింగ్ బ్యూటీయే అయినా, గ్రే మ్యాటర్ లేని సగటు ఫార్ములా హీరోయిన్ పాత్రలా వుంది. తాగిన మత్తులో తనకేం జరిగిందో, వర్జినిటీ వుందో పోయిందో తెలుసుకోవడానికి, హీరో వెంటపడి సీన్లకి సీన్లు- రాత్రి అదికూడా జరిగిందా? అదికూడా చేశావా? అని అడగడం! చూసుకుంటే తెలియనట్టు! ఈమె ప్రధాని సెక్రెటరీ. ప్రధాని, కొత్త ప్రధాని, కమెండో, ప్రెస్ సెక్రెటరీ అందరూ బూతు మాస్టర్లే. త్వరగా పెళ్లి చేసుకోకుంటే ‘చికిచికి’ జరిపేస్తానంటాడు కమెండోతో ప్రధాని. ఇంట్లో ఆడవాళ్ళు లేరు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావని కమెండోని అడిగితే, ‘స్వహస్తాలతో’ అంటాడు కమెండో!
కొత్త ప్రధానిగా ఆర్య నటించాడు. ఒక ఆదర్శ యువ ప్రధాని ఎలా వుండాలో తెలపని ఈ పాత్ర కూడా వృధాయే. ఇక దుష్ట కార్పొరేట్ శక్తిగా బొమన్ ఇరానీది రైతు భూముల విలనీ. ఇలా పాత్రలూ పాత్రధాలూ ఆషామాషీగా వున్నారు 80 కోట్ల బడ్జెట్ సినిమాకి.

హేరిస్ జయరాజ్ సంగీతం ఒక సహన పరీక్ష. కెమెరా వర్క్, ఇతర మేకింగ్ విషయాలు దర్శకుడి గత సినిమాల స్థాయిలో లేవు. దృశ్యాల్ని ముతకగా డీఐ చేసి, రంగులే తప్ప దృశ్యాలు కనపడకుండా చేశారు.

చివరికేమిటి
179856 Bandobast | Telugu Rajyamఒక మాజీ జర్నలిస్టుగా కేవీ ఆనంద్ ప్రధానిని ఇలా ఎలా చూపిస్తాడో అర్ధంగాదు. టెర్రరిస్టులు దేశ ప్రధానిని చంపేసినట్టు చూపిస్తే ఇక దేశం విలువేముంది. చంపకుండా అడ్డుకోవడం చూపిస్తే విలువ తెలుస్తుంది. టెర్రరిస్టులు కూడా రెండు సార్లు ఎందుకు విఫల యత్నాలు చేశారో, మూడో సారి ఎందుకు చంపారో ఎక్కడా చెప్పలేదు. ఒక హత్యాయత్నం జరిగితేనే మామూలుగా వుండదు పరిస్థితి. ఇది సగటు ప్రేక్షకుడి వూహకందే విషయం. ఏంతో పవర్ఫుల్ కమెండో గా చూపిన హీరో వుండగా లండన్ ఎటాక్ జరక్కూడదు. ఒకవేళ జరిగినా అక్కడ్నించీ హీరో వెంటా డాలి, వేటాడాలి, అదే పనిమీద వుండాలి. ఇంకో ప్రయత్నం చేయకుండా డిస్టర్బ్ చేస్తూం డాలి, పట్టుకుని చంపాలి. కానీ కథనే డిస్టర్బ్ చేస్తూ సబ్ ప్లాట్స్ తో వేరే కామెడీలు, రోమాన్సులు, రైతు గొడవలూ పెట్టుకుంటే మెయిన్ పాయింటు ఏమైపోతుంది.

ఇంటర్వెల్లో బాంబు దాడితో ప్రధానిని చంపడం ఈ కథని చంపేసినట్టు. పొరుగు దేశానికి జై కొట్టినట్టు. ఆ దాడిలో ప్రధానిని కాపాడుతూ హీరో గాయపడితే అది విజయం దేశానికీ, కథకీ, హీరోకీ. ఇక్కడ్నించీ హీరో మండుతున్న అగ్నిగోళమైతే శత్రువులకి చావుబజాలు. ఇక ప్రధాని అణుమీట నొక్కెంత సంభావ్యత, ‘వార్’ లాంటి పాకిస్తాన్ సినిమాల్లోనే ఇండియన్ ఏజెంటు తో టెర్రరిస్టుల్ని అంతమొందించడం చూపిస్తూంటే, బందోబస్త్ లో ఈ జబర్దస్త్ కామెడీలేమిటో అర్ధం గాదు. సూర్య ఇలాగే పాత చింతకాయలు నటిస్తే తెలుగు మార్కెట్ కష్టమే.

రచన – కేవీ ఆనంద్
తారాగణం : సూర్య, మోహన్ లాల్, ఆర్య, సాయేషా సైగల్, బొమన్ ఇరానీ, నాగినీడు, చిరాగ్ జానీ తదితరులు
సంగీతం : హేరిస్ జయరాజ్, ఛాయాగ్రహణం : ఎం ఎస్ ప్రభు
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : అల్లి రాజా సుభాస్కరన్
విడుదల : సెప్టెంబర్ 202019

2 / 5

―సికిందర్

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles