‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ!

 

‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ 

 

క్లాస్ సినిమాల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాస్ సినిమాతో వచ్చాడు. గ్యాంగ్ స్టర్ అవతారంతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీన్ని రిసీవ్ చేసుకునేందుకు ప్రేక్షకులు సిద్ధంగా వున్నారా? ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ ని తన ఈ అపూర్వ యాంటీ హీరో పాత్రలో దట్టించి తుపాకీ గుండులా పేల్చాడా? బాక్సాఫీసు బద్దలయ్యిందా? బంపర్ కలెక్షన్స్ కి తాళాలు వూ డి పడ్డాయా? ఈ కీలక అంశాలు పరిశీలిద్దాం…

కథ
ఒక షార్ట్ ఫిలిం దర్శకుడు అభిలాష్ (అథర్వ) కి సినిమా అవకాశం లభించి గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ అలియాస్ గనీ (వరుణ్ తేజ్) జీవితాన్ని తెర కెక్కించాలనుకుంటాడు. అందుకు గనీ గురించిన సమాచారం సేకరించేందుకు వెళ్లి ఒక ప్రమాదకర పరిస్థితుల్లో గనీకి కి చిక్కుతాడు. అభిలాష్ తన మీద సినిమా తీస్తున్నాడని తెలుసుకుని, తన పాత్ర తనే నటిస్తానని షరతు పెడతాడు గనీ. విధిలేక గనీ కథని గనీ తోనే తీస్తాడు అభిలాష్. షూటింగ్ సమయంలో అభిలాష్ ప్రేమిస్తున్న బుజ్జమ్మ (మృణాళిని) ప్రేమలో గనీ పడడంతో సమస్యలు మొదలవుతాయి. ఈ ప్రేమ వ్యవహారం ఎలా పరిష్కారమైంది, తీసిన సినిమాతో గనీ తో అభిలాష్ కి ఏ సమస్యలొచ్చాయి, గనీ పూర్వ ప్రేమ కథేమిటి, కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ అయిన గని మంచి వాడుగా ఎలా మారాడు…అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
తమిళంలో ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 2014 లో సిద్ధార్థ్ హీరోగా, బాబీసింహా గ్యాంగ్ స్టర్ గా తమిళంలో తీసిన ‘జిగర్తాండ’ కి రీమేక్ ఇది. ‘జిగర్తాండ’ 2016 లో ‘చిక్కడు దొరకడు’ గా తెలుగులో డబ్బింగ్ అయి విడుదలైంది కూడా. అయితే షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన సుబ్బరాజ్ రియలిస్టిక్ గా, జాతీయంగా, అంతర్జాతీయంగా అధ్యయనం చేయదగ్గ సినిమా సైన్స్ గా తీసి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఒక కల్ట్ మూవీగా తమిళ సినిమా చరిత్రలో నిలిపాడు. తెలుగులో మాస్ సినిమాల నుంచి వచ్చిన హరీష్ శంకర్, దీన్ని తన మార్కు పక్కా తెలుగు మాస్ సినిమాగా తీశాడు కొన్ని మార్పు చేర్పులతో. ఇందువల్ల మేకింగ్ లో, ఫీల్ లో ఈ తేడా వుంటుంది. ఈ తేడాతో సోల్ సైతం మిస్సయింది.

ఎవరెలా చేశారు
సాఫ్ట్ రోల్స్ వేస్తున్న వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కొత్తగానే కనపడతాడు కాబట్టి ఈ వెరైటీ వరకూ సినిమాకి ఆకర్షణయింది. ఈ పాత్ర కథానాయకుడి పాత్ర కాకపోవడంతో కథలో కథానాయకుడి ప్రయాణం కన్పించదు. ఈ పాత్ర ‘మహానటి’ లో సావిత్రి పాత్ర లాంటిది. ఇందులో ఆమె కథానాయిక కాదు. ఆమె జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే జర్నలిస్టులుగా విజయ్ దేవరకొండ, సమంతాలు ఇందులో కథానాయకుడు- కథానాయికలు. కథ వీళ్ళమీదే సాగుతుంది సమస్యా – స్ట్రగుల్ – పరిష్కారమనే చట్రంలో. ఇదేవిధంగా వరుణ్ తేజ్ పాత్ర కథ తెలుసుకుని సినిమా తీయడానికి వచ్చిన దర్శకుడు అభిలాష్ పాత్ర కథ ఈ సినిమాది. ఇందువల్ల సమస్యా – స్ట్రగుల్ – పరిష్కారమనే చట్రం ఈ పాత్రకే కన్పిస్తుంది. ఇందువల్ల ఇది ఇతడి కథే, వరుణ్ పాత్రది కాదు. వరుణ్ పాత్రది సావిత్రి లాగా ఒక బయోపిక్ – గాథ మాత్రమే. ‘మహానటి’ లో సావిత్రి గాథని జర్నలిస్టుల కథతో కవరింగ్ ఇచ్చి ఎలా కాపాడారో, అలా ఇక్కడ వరుణ్ పాత్ర బయోపిక్ – గాథకి సినిమా తీయాలనే దర్శకుడి కథతో కవరింగ్ ఇచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. పూర్తిగా కాపాడలేదు.

ఎందుకంటే ‘జిగార్తండా’ లో వరుణ్ గ్యాంగ్ స్టర్ పాత్రని హీరో సిద్ధార్థ వేయలేదు. విలన్ వేషాలు వేసే బాబీ సింహా పోషించాడు. పాపులర్ హీరోగా అందరికీ తెలిసిన సిద్ధార్థ్ హీరో పాత్రే పోషిస్తూ, విలన్ జీవిత చరిత్ర సినిమాగా తీస్తాడు. ఈ సెటప్ తెలుగులో రివర్స్ అయి, మెగా ప్రిన్స్ స్టార్ గా ప్రేక్షకుల అభిమాన ధనాన్ని ఇతోధికంగా దోచుకుంటున్న వరుణ్ తేజ్, సిద్ధార్థ్ హీరో పాత్రలోకి కాక, బాబీ సింహా విలన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంతో- తన పాత్రలో స్టార్ మెటీరియల్ కన్పించదు. కేవలం ప్రతినాయక పాత్రలో సమర్ధ నటన కన్పిస్తుంది. తెలుగులో ‘జిగర్తండా’ లాంటి ప్రయోగాలు చెయ్యరు, ‘జిగార్తండా’ లాంటి వాటిని మార్చే ‘ఠండా’ ప్రయోగాలు చేయడంలో సమధికోత్సాహాన్ని ప్రదర్శిస్తూంటారు.

వరుణ్ పాత్ర పేరు, ఇప్పుడు సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’ -ఇటీవల వచ్చిన ‘గుణ 369’ లో విలన్ పేరు ‘గద్దలగుంట రాధా’ లాగా వుండడం చీకాకు కల్గించే విషయం. వరుణ్ కి డెకాయిటీ గెటప్ ఇచ్చినప్పుడు, డిక్షన్ తో – ఇంకా పచ్చి యాసతో – యాక్షన్తో – ఇంకా పచ్చి బాడీ లాంగ్వేజీతో – దీన్నొక ‘షోలే’ లో గబ్బర్ సింగ్ లాగా కల్ట్ క్యారక్టర్ లా తీర్చిదిద్ది, సంచలనం సృష్టించే అవకాశమున్నా పట్టించుకోలేదు. పాత్ర మూవ్ మెంట్స్ కి తీసిన షాట్స్ కూడా ఎఫెక్టివ్ గా లేవు. పాత్రకి ఓ థీమ్ మ్యూజిక్ అంటూ ఆలోచించలేదు. అయితే తెలుగు మాస్ ప్రమాణాల వరకూ చూసుకుంటే మాత్రం ప్రేక్షకులకి బాగానే వుంటుంది.

పూజా హెగ్డే ఫ్లాష్ బ్యాక్ పాత్ర. 1980 ల నటి ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథ. ఈ రెండు మూడు నెలల కాలంలోనే ఈ గ్యాంగ్ స్టర్స్ తో ప్రేమలో పడే హీరోయిన్ ప్రేమ ట్రాకులు ‘డియర్ కామ్రేడ్’ లో, ‘రణరంగం’ లో చూసేయడం వల్ల మళ్ళీ చూడాల్సి రావడం ఒక పరీక్షే. ఇంతకీ తమిళంలో లేని ఈ ఫ్లాష్ బ్యాక్ ని కల్పించి పెట్టారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా నష్టం లేదు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన 80 లనాటి నేపథ్యంలో ప్రేమ సన్నివేశాలు, దూర దర్శన్ టీవీలో పాటలు సహా, ఈ నాటి యూత్ అప్పీల్ కి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఓపికపట్టి కూర్చున్న ప్రేక్షకులు వరుణ్ – పూజా హెగ్డే లతో ‘ఎల్లువచ్చే గోదారమ్మ’ పాట రావడంతో హుషారెక్కి ప్రకంపనలు సృష్టించారు.

రెండో హీరోయిన్ మృణాలిని కథలో పని వున్న పాత్ర పోషించింది. అథర్వని ప్రేమించి, వరుణ్ తో ఇరుక్కునే ప్రేమిక పాత్రలో బాగానే నటించింది. కన్నడ నటుడు అథర్వ టాలెంట్ వున్న హీరోనే. ఇందులో సినిమా దర్శకుడి హాస్య పాత్ర టైమింగ్ ని చక్కగా పాలించాడు. ఇతడికి తోడుండే హాస్య పాత్రలో సత్య కన్పిస్తాడు.

టెక్నికల్ గా స్టార్ మూవీ ప్రమాణాలతో వుంది. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుందని కొందరు ప్రేక్షకులు ప్రత్యేకంగా కామెంట్లు చేసుకున్నారు. అయానంకా బోస్ వెలుగు నీడల ఛాయాగ్రహణం మూవీ మూడ్ కి తగ్గట్టే వుంది. అదుపు తప్పిన నిడివితో వరసగా వస్తున్న సినిమాల్లో ఇది కూడా చేరింది. మళ్ళీ ఈ సినిమాకి కూడా రెండు గంటల 50 నిమిషాలు కూర్చోవాలంటే చాలా ఓపికుండాలి.

చివరికేమిటి
హరీష్ శంకర్ – టరాంటినో, గై రిచీ (సుబ్బరాజ్ అభిమాన దర్శకులు) మార్కు మేకింగ్ జోలికి వెళ్లకుండా, తెలుగు ప్రేక్షకుల టేస్టుకి తగిన పక్కా మాస్ లుక్ తో దీన్ని తీశాడు. ఫస్టాఫ్ ని వరుణ్ కోసం వచ్చే అథర్వ కామెడీ సీన్లతో ఇంటర్వెల్ వరకూ కొనసాగి, అక్కడ అథర్వని వరుణ్ పట్టుకోవడంతో కథ ప్రారంభించాడు. అయితే సెకండాఫ్ లో వరుణ్ పాత్ర నేర చరిత్ర చ్చూపించడం వరకు బాగానే వున్నా, ప్రేమ ఫ్లాష్ బ్యాకు మొదలెట్టిన కాడ్నించీ క్లయిమాక్స్ వరకూ సినిమాని నిలబెట్ట లేకపోయాడు. ఈ భాగం డొల్లగా మారింది. ఒరిజినల్లో వున్న సోల్ కత్తిరించేశాడు. క్లయిమాక్స్ నుంచే ఊపందుకుని ముగించాడు. ఇది తప్పితే దాదాపు సెకండాఫ్ అంతా డింకీ కొట్టింది. వరుణ్ నుంచి ఎస్పెక్ట్ చేయడానికి కథ అతని మీద లేదు. పైన చెప్పుకున్నట్టు ‘జిగార్తండా’ లోని హీరో పాత్రగాక, విలన్ పాత్ర పోషించడంతో స్టార్ డమ్ పరంగా ఈ వెలితి ఏర్పడింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటనలో ఇంకా విస్తరించడానికి మాత్రం ఈ రీమేక్ తోడ్పడింది, సినిమాని నిలబెట్టేందుకు మొహమాట పడింది.

దర్శకత్వం : హరీష్ శంకర్
తారాగణం : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ, మృణాలిని, బ్రహ్మాజీ, డింపుల్ హయాతీ
సంగీతం : మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం : ఆయానంకా బోస్
బ్యానర్ : 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచాంద్ ఆచంట
విడుదల : సెప్టెంబర్ 20, 2019

2.5 / 5

―సికిందర్