‘ఓటర్’ రివ్యూ – ఔట్ డేటెడ్ స్టోరీలు మానెయ్యాలి కదా!

ఓ హిట్ కోసం మంచు విష్ణు ఎదురు చూపులు ఎండమావులుగానే మిగులుతున్నాయి. వాళ్ళ నాన్న నటించిన కాలం నాటి పోకడలతో సినిమాల్లో నటిస్తే సక్సెస్ అవచ్చని అనుకుంటూ వుంటే అది తప్పని పదేపదే రుజువవుతోంది. నటించిన 20 సినిమాల్లో కేవలం 2007 లో ‘ఢీ’, 2012 లో ‘దేనికైనా రెఢీ’ రెండే హిట్టవడం చూస్తే, కెరీర్ ప్లానింగ్ ఎంత గాడి తప్పి నడుస్తోందో అర్ధమవుతుంది. ఇప్పటికీ ఏమాత్రం మార్పుకి తను అంగీకరించడం లేదనడానికి తాజా ఉదాహరణగా ‘ఓటర్’ వచ్చింది. ఇందులో రాజకీయాల్ని మారుస్తాననే పాత్ర వేశాడు. తన సినిమాల పోకడల్ని మార్చుకోవడాన్ని ఒప్పుకోకుండా రాజకీయాల్ని మార్చే పాత్ర వేస్తానంటే బాక్సాఫీసు కూడా ఒప్పుకోదు. ఇందులో ‘ఔట్ డేటెడ్ రాజకీయాల్ని మానెయ్యాలి’ అని డైలాగు ఒకటి పెట్టుకున్నారు. ఈ డైలాగుని ‘ఔట్ డేటెడ్ స్టోరీలు మానెయ్యాలి’ గా మార్చుకుంటే బావుటుందేమో ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిదేమో ఆలోచించాలి. ‘ఓటర్’ నిర్మాణం, విడుదల ఆలస్యాలయ్యాయి కాబట్టి ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిందని కాదు, ఐదేళ్ళ క్రితం తీసినా ఔట్ డేటెడే. ఇదెలా ఔట్ డేటెడ్ అయిందో చూద్దాం…

కథ
హైదరాబాద్ కి చెందిన గౌతమ్ (మంచు విష్ణు) యూఎస్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఉప ఎన్నిక జరుగుతూంటే ఓటు వేయడానికి స్వదేశం వస్తాడు. ఏర్ పోర్టు నుంచి వస్తూంటే, అంతకి ముందు ఫేస్ బుక్ లో పరిచయమైన భావన (సురభి) అనుకోకుండా ఎదురై ప్రేమలో పడతాడు. ప్రేమించాలంటే ఆమె ఒక షరతు పెడుతుంది. ఉపఎన్నికలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే (పోసాని) ప్రజలకి అనేక హామీలు గుప్పిస్తూంటాడు. ఆ హామీలన్నీ అతను అమలు చేసేలా చూస్తేనే తను ప్రేమిస్తానంటుంది భావన. దీంతో ఆ ఎమ్మెల్యేకే ఓటేసిన గౌతమ్, అతను గెలవగానే ఒక వీడియో ఆధారంగా బ్లాక్ మెయిల్ చేస్తూ హామీలు అమలు చేయిస్తూంటాడు. ఐతే పేదలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చేదగ్గర పేచీ పెడతాడు ఎమ్మెల్యే. ఆ స్థలం మంత్రి శంకర ప్రసాద్ (సంపత్ రాజ్) ఆధీనంలో వుంది గనుక ఇప్పించలేనంటాడు. నిజానికా వాణిజ్య స్థలాన్ని పేదలకి పంచిపెట్టాలని ఒక సంపన్నుడు ప్రభుత్వ పరం జేశాడు. అతణ్ణి చంపేసి శంకర ప్రసాద్ కబ్జా చేశాడు. దీంతో శంకర ప్రసాద్ కి సవాలు చేసి పోరాటం ప్రారంభిస్తాడు గౌతమ్. ఇందుకు రైట్ టు రీకాల్ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు…

ఎలావుంది కథ
2006 లో జగపతి బాబుతో రవి చావలి తీసిన ‘సామాన్యుడు’ కథలా వుంది. ఇందులో కూడా వీడియో ఆధారంగా మంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తూ మంచి పనులు చేయిస్తాడు హీరో. ఇప్పుడు ‘ఓటర్’ కూడా ఇదే చేస్తాడు, కాకపోతే హామీల అమలు విషయంలో.

ఇక ఈ కథకి పాయింటుగా చెప్పిన ‘షరతు’ కి స్టాండింగ్ లేదు. విద్యావంతులైన యువతీ యువకుల మధ్య ప్రేమలో ఇలాటి సిల్లీ, టీనేజీ స్థాయి ఫార్ములా షరతు పెట్టడం ఇమ్మెచ్యూర్డ్ క్యారక్టర్స్ గా తేల్చేస్తే, ఈ షరతుకి కూడా అర్ధం లేకపోవడం ఒకటి. హీరోయిన్ ప్రేమించాలంటే ఎమ్మెల్యే చేత హీరో హామీలు అమలుచేయించాలి. ఎమ్మెల్యే గెలవక పోతే? ఈ ప్రశ్న హీరో వేస్తే ఏం సమాధానం చెప్తుంది హీరోయిన్? ఇలా ప్రశ్నకి నిలబడని పాయింటు మీద కథ చేశారు.

ఇక హీరో గోల్ కి ‘రీకాల్ ఎలక్షన్’ (మళ్ళీ ఎన్నిక జరిపించడం) పాయింటు తీసుకుని ఈ సినిమా నిర్మించాలనుకున్నారు. పాయింటు కొత్తదే సినిమాకి. ఐతే ఇదింకా చట్టపరంగా తేలని సమస్య. ఇంకా పార్లమెంటులోనే దీని మీద ఏకాభిప్రాయం రాలేదు. 1974 లోనే లోక్ సభలో ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. తిరిగి 2016 లో ప్రవేశపెట్టారు. ప్రజలు తాము ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధి పనితీరు నచ్చక పోతే, అతణ్ణి తొలగిస్తూ మళ్ళీ ఎన్నిక కోరే ‘రైట్ టు రీకాల్’ బిల్లు గనుక చట్టమైతే ప్రజాస్వామికంగా, ఎన్నికల ప్రక్రియ పరంగా పరిస్థితులు చాలా అస్తవ్యస్త మవుతాయని ఎన్నికల సంఘమే అభ్యంతరం చెప్తోంది.

మనం ఆలోచించినా, ఒక వైపు క్రిమినల్ కేసుల్లోనే నిందితులుగా వున్న అభ్యర్ధులకే ఎడాపెడా ఓట్లేసి గెలిపించేస్తున్న ప్రజల చేతుల్లోనే ఈ చట్టం పెట్టడంలో అర్ధం లేదని అర్థమవుతుంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు చేసేదేమీ లేదు. కానీ సినిమాలో దీని మీద సుప్రీం కోర్టుకి వెళ్లి నట్టు చూపించారు. చట్టమే లేకపోతే సుప్రీం కోర్టేం చేస్తుంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పంచాయితీల స్థాయిలో దీన్ని అమలుచేసి చూశారుగానీ సత్ఫలితాల్నివ్వ లేదు. ఇక ఈ చట్టమే లేనప్పుడు ఈ కథలో హీరో ఈ అస్త్రాన్నే చేబూనడంలో అర్థం లేదు.

ఈ చట్టాన్ని కోరే హీరో, డబ్బు తీసుకుని ఓట్లు అమ్ముకుంటున్న జనాల అంతు ముందు తేల్చాలి. అసలీ కథ ఓటర్లకీ ఓటర్లకీ మధ్య పోరాటంగా వుండాలి. మంచి ఓటర్లు వర్సెస్ చెత్త ఓట్లర్లు వర్సెస్ ఓటే వెయ్యని ఓటర్లు. ఓటర్లతోనే ఇన్ని చెత్త సమస్యలుంటే లీడర్లని అనడమెందుకు. అసలిప్పుడు ఇలా గెలిచి అలా పార్టీలు ఫిరాయిస్తూ ఓటర్లనే వెక్కిరిస్తూంటే, వాళ్ళ చేత హామీలు అమలుపర్చే మాట ఎక్కడుంటుంది. ఇలా ఈ రాజకీయ సినిమా సరైన అవగాహనలేని విఫల యత్నంగా మిగిలింది.

ఎవరెలా చేశారు
మంచు విష్ణు లుక్ మార్పు తప్ప పాత్ర, నటన షరా మామూలే. రిచ్ గా ఫారిన్ నుంచి దిగడం, హీరోయిన్ సురభితో రోమాన్సు, డ్యూయెట్లు కానియ్యడం, మొక్కుబడిగా ఇవి చేశాక, ఎమ్మెల్యేతో రొటీన్ పాత మూస డైలాగులతో పోరాటానికి దిగడం. ఓటర్ పవరేంటో చూపించడం. ఏం చేసినా పాత్ర, సినిమా పోకడ ఔట్ డేటెడ్ గా వుండడంతో మరో వృధా ప్రయాస అయిపోయింది.
హీరోయిన్ సురభికి షరతు పెట్టాక కథతో పనిలేకుండా పోయింది. అడ్డం పడే పాటల్లో దిట్టంగా పాల్గొంది. బీచ్ సీన్లో అందాల ఆరబోత ఒకటి. రిక్షా వాడిగా ఎల్బీ శ్రీరాం డైలాగులు ఆలోచింపజేస్తాయి. ఎమ్మెల్యేగా పోసాని అదే గోల డైలాగులతో బోరేత్తించడం. మంత్రిగా సంపత్ రాజ్ సవాళ్ళకి పరిమితం కావడం. ఈ రచ్చలో కమెడియన్స్ ఎవరూ లేకపోవడం ఉపశమనం.
తమన్ కూర్చిన పాటలు సినిమాని మరింత భారంగా మార్చేస్తాయి. ఇతర సాంకేతిక విలువలకి బాగానే ఖర్చు పెట్టించాడు దర్శకుడు.

చివరికేమిటి
దర్శకుడు జీఎస్ కార్తీక్ రీకాల్ తో రాజకీయాల్లో మార్పు తెచ్చే సినిమా చేయాలనుకున్నాడు గానీ, ఇది ఫస్టాఫ్ లో పాయింటు వరకే. సెకండాఫ్ లో దీని జాడ వుండదు. దీంతో కథనే రీకాల్ చేయమని అనాల్సిన పరిస్థితి. రీకాల్ ని పక్కన బెట్టి, ఎమ్మెల్యేని బెదిరించి హామీలు అమలు పర్చే ‘సామాన్యుడు’ టైపు కథగా లాగించేశారు. ఇది కూడా నమ్మశక్యం గాని దృశ్యాలతో వుంటుంది. ఎమ్మెల్యే ఆస్తులు అమ్మించి హామీలు అమలుచేయించడం.

ఫస్టాఫ్ లో పాయింటుకి రావడమే (ప్రేమ షరతు, రీకాల్ గోల్) ఆలస్యంగా భారంగా, సహన పరీక్ష పెట్టే కథనంతో ఎలాగో వచ్చినా, తీరా సెకండాఫ్ లో మరీ దారి తప్పి పోయిన కథతో గందరగోళంగా తయారు చేశారు. పైగా జర్నలిస్ట్ అమర్ – విష్ణుల మధ్య సీన్లో క్లాసులు పీకడం అంతే లేకుండా పోయింది. ఈ సినిమా చూస్తూంటే అసలు ఎమోషనల్ ఓటర్ కి పవరొకటి వుందా అన్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి అసలు ప్రమాదకారి ఎమోషనల్ ఓటరేనేమో అన్పిస్తుంది…

రచన, దర్శకత్వం:  జీఎస్. కార్తీక్‌
తారాగణం : మంచు విష్ణు, సురభి, నాజర్‌, సంపత్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, ఎల్బీ శ్రీరామ్‌, తదితరులు
సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం : రాజేష్ యాదవ్‌
బ్యానర్‌: రామా రీల్స్‌
నిర్మాత: జాన్‌ సుధీర్‌ పూదోట
విడుదల : జూన్ 21, 2019
2 / 5

―సికిందర్