అదే గోపీచంద్! – ‘చాణక్య’ మూవీ రివ్యూ

 

 

 

 

మాస్ యాక్షన్ స్టార్ గోపీచంద్ 2015 నుంచి 4 పరాజయాలతో పరేషానయ్యాక మరో యాక్షన్ మూవీ – ఈసారి కాస్త తేడాగా స్పై థ్రిల్లర్ ప్రయత్నించాడు. తమిళంలో 2013 లో విశాల్ తో ‘సమర్’ అనే విజయం తప్ప, 4 పరాజయాల బాధతో వున్న దర్శకుడు తిరు, తెలుగు నాశ్రయించి గోపీచంద్ తో ఈ ‘చాణక్య’ అనే అదృష్ట పరీక్షకి దిగాడు. ఈ మధ్య స్పై సినిమాలు పెరిగాయి. ఈ వారమే హిందీ ‘వార్’ అనే స్పై కూడా తెలుగులో విడుదలయ్యింది. ‘వార్’ చూసిన కళ్ళతో ‘చాణక్య’ చూడగలరా, మరో వైపు ఇదే వారం విడుదలైన ‘సైరా’ ని తట్టుకోగలదా, అంత విషయం ఇందులో వుందా ఒకసారి పరిశీలిద్దాం…

కథ
ఢిల్లీలో అర్జున్ అలియాస్ రామకృష్ణ (గోపీచంద్) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఢిల్లీలో జాబ్ చేస్తూంటాడు. ఇటీవలే అతను సిరియా వెళ్లి పాకిస్తాన్లో వుంటున్న టెర్రర్ లీడర్ ఇబ్రహీం ఖురేషీ (రాజేష్ కట్టర్) అనుచరుడు అబ్దుల్ సలీంని పట్టి తెచ్చిబాస్ కి అప్పజెప్పాడు. ఆ బాస్ కులకర్ణి (నాజర్) అనే ‘రా’ చీఫ్. అంటే అర్జున్ ‘రా’ కోసం పనిచేస్తున్న గూఢచారి అన్నమాట. రామకృష్ణ పేరుతో అండర్ కవర్ ఏజెంటుగా బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ బ్యాంకులో మొండి బకాయిల వసూలు డ్యూటీ పడి ఐశ్వర్య (మెహ్రీన్) దగ్గర అప్పు వసూలుకి వెళ్లి ఇరుక్కుంటాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య తగువుల రోమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. అటు అబ్దుల్ సలీం సమాచారం ఇవ్వడం లేదని చంపేస్తాడు అర్జున్. దీంతో పాకిస్తాన్లో వున్న ఇబ్రహీం ఖురేషీ తమ్ముడు సొహైల్ (ఉపేన్ పటేల్) పగబడతాడు. ఇటు అర్జున్ తో ఐశ్వర్య ప్రేమలో పడ్డాక, ఇబ్రహీం మనుషులు అర్జున్ తో కలిసి పనిచేస్తున్న నల్గురు ‘రా’ ఏజెంట్లని కిడ్నాప్ చేసి కరాచీ తీసికెళ్ళి పోయి సవాలు విసురుతాడు. ఇప్పుడు బాస్ వారించినా వినకుండా అర్జున్ కరాచీ వెళ్లి తోటి ఏజెంట్లని ఎలా విడిపించుకున్నాడు, విడిపించుకుని ఇబ్రహీంనీ, సోహైల్ నీ ఎలా చంపాడూ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
ఈ స్పై జానర్ కథ సంసారపక్షంగా, చాదస్తంగా వుంది. పైగా టెంప్లెట్ లో వుంది. టెంప్లెట్లు చూసి చూసి విసిరి కొడుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ మధ్య వీటి బెడద తప్పింది. ఇంతలో తమిళ దర్శకుడు ప్రేక్షకుల్ని మళ్ళీ పరీక్షిస్తూ టెంప్లెట్ నే దింపాడు. సిరియాలో ఒక యాక్షన్, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం, హీరోయిన్ కామెడీ, లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, మళ్ళీ లవ్ ట్రాక్, హీరోయిన్ తో ఒక డ్రింకింగ్ సాంగ్, లవ్ కన్ఫర్మ్, విలన్ ఎటాక్, హీరో ఫ్రెండ్స్ కిడ్నాప్, ఇంటర్వెల్.

స్పై కథతో సంబంధంలేని, ఇంటర్వెల్ తర్వాత కన్పించని హీరోయిన్ తో గంటపాటు ఈ లవ్ ట్రాక్ ఎన్నోసార్లు చూసి చూసి వున్న టెంప్లెట్ కి తగ్గట్టే వుంది. సెకండాఫ్ లో ఫార్ములా ప్రకారం పాకిస్తాన్ లో సెకండ్ హీరోయిన్ తో మొదలు. దీన్ని ‘రా’ ఏజెంట్ల స్పై కథ అని ఎలా అంటారో తెలీదు. రొటీన్ మూస ఫార్ములా మాస్ యాక్షన్ చట్రంలోనే, అదే ఫీల్ తో స్పై కథలు కూడా వుంటాయని దర్శకుడి నమ్మకం కాబోలు.

ఇక ఈ స్పై కథని పర్సనల్ రివెంజి కథగా కూడా మార్చేశారు. అసలు కథ మొదలైంది ఇబ్రహీం ఖురేషీ బాంబు దాడులు ప్లాన్ చేస్తున్నాడని. అలాటి వాడు తన అనుచరుల్నిచంపితే, తన బాంబు దాడుల పథకం అమలు చేసెయ్యకుండా హీరో ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి, పగదీర్చుకుంటా కరాచీ రమ్మంటూ సవాలు చేయడమేమిటో అర్ధంగాదు. ఇది మరో విషయం లేని మూస రివెంజి యాక్షన్ తప్ప స్పై అనుకునే సమస్యే లేదు.

ఎవరెలా చేశారు
గోపీ చంద్ స్పై పాత్ర పోసిస్తున్నట్టు వుండదు. తనకి తెలిసిన మరో యాక్షన్ పాత్ర గానే యాక్షన్ సీన్లు చేశాడు. ‘రా’ ఏజంట్లు డ్యూటీలేక పోతే ఇంకో చోట అండర్ కవర్ ఏజెంట్లుగా ఉద్యోగాలు చేస్తారని ఎవరు చెప్పారో తెలీదు. అండర్ కవర్ ఏజెంట్ గా వున్నాడంటే, అక్కడేదో డ్యూటీలో భాగంగా సీక్రెట్ ఆపరేషన్ చేస్తూంటేనే వుండాలి. అలాటిది గోపీచంద్ ఇలాటిదేమీ లేకుండా అండర్ కవర్ ఏజెంటుగా బ్యాంకుద్యోగం చేయడం సిల్లీగా వుంది. ఈ క్రమంలో మొండి బకాయిల వసూలు అనే పరమ రొటీన్ కామెడీతో హీరోయిన్ ని టీజ్ చేయడం. ఆమె పెంపుడు కుక్కతో అసభ్య కామెడీలు చేయడం, ఆ ప్రేమాయణం అంతా కూడా ఫస్టాఫ్ కి ఎందుకూ పనికి రాకుండా పోయింది. సెకండాఫ్ లో ఫ్రెండ్స్ ని విడిపించుకునే తెలిసిపోయే యాక్షనే. ఈసారి కూడా గోపీచంద్ పాత్రని నిలబెట్టుకోలేక పోయాడు.

ఇక మెహ్రీన్ ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ స్పేస్ ని భర్తీ చేయడానికి గ్లామర్ బొమ్మలా కన్పించి వెళ్ళిపోతుంది – తన మగ కుక్కకి ఆడ కుక్క కావాలన్నవిఫలమైన కామెడీతో. సెకండాఫ్ లో జరీన్ ఖాన్ రెండో హీరోయిన్ గా పాకిస్తాన్లో హీరోకి తోడ్పాడే జుబేదా అనే డాన్సర్ గా టెంప్లెట్ పాత్రగానే వుంటుంది. బ్యాంకు కామెడీలో సునీల్, పెంపుడు కుక్కల కామెడీతో అలీ పెద్దగా నవ్వించలేక పోతారు. ఇబ్రహీం ఖురేషీ అంటే ఇక్కడ దావూద్ ఇబ్రహీం అన్నమాట. ఈ పాత్రలో రాజేష్ కట్టర్, తమ్ముడి పాత్రలో ఉపేన్ పటేల్ విలన్లుగా పనికిరాలేదు. నాజర్ సరే, తనకి తగ్గ పాత్రే కాదు.

ఇక కెమెరా కాస్త ఫర్వాలేదనుకున్నా, పాటలు, నేపథ్య సంగీతం తేలిపోయాయి. పాటల బాణీలు విచిత్రంగా, అపస్వరాలుగా వున్నాయి, అర్ధంగావడం అలావుంచితే. ఇక పాకిస్తాన్ కరాచీ లొకేషన్లు ఒక మైనస్ కాగా, ఢిల్లీ – కరాచీల మధ్య పాత్రలు అమీర్ పేట – ఆబిడ్స్ తిరుగుతున్నంత ఈజీగా తిరుగుతూంటాయి . హీరోని కరాచీ రమ్మన్న విలన్, బోర్డర్ లోనే కాపుకాసి వేసెయ్యక, ఇంటిదాకా ఎందుకు రప్పించుకుని వేయించుకుంటాడో తెలీదు.

చివరికేమిటి
తమిళ దర్శకుడితో కూడా గోపీచంద్ అదే వరస. ఇక ఈ అరిగిపోయిన మూస సినిమాలాపి కొత్త చానెల్లోకి వస్తేనే మాస్ అయినా చూసేది. మాస్ ఎప్పట్నుంచో తోసిపుచ్చుతున్న టెంప్లెట్ కథల్ని కూడా పసిగట్టి దూరంగా వుంటేనే మేలు. తమిళ దర్శకులు ఈ మధ్య విషయం లేక చతికిల బడుతున్నారు. తిరు క్షవరమవుతోంది. ఇక తమిళ క్రియేటివిటీ మీద నమ్మకం పెట్టుకో నవసరం లేదు. వాళ్ళు సూర్య లాంటి బిగ్ స్టార్స్ నే ఫ్లాప్ చేస్తున్నారు. తెలుగు స్టార్స్ ని ఉద్ధరించేదేమీ వుండదు. సైరా, వార్ ల మధ్య చాణక్య విడుదల చేయడం పొరపాటేమీ కాదు. ఇంకా ఖాళీ చూసుకుని విడుదలచేసినా ఫలితాల్లో మార్పేమీ వుండదు. ఇక చాణక్య టైటిల్ ఎందుకు పెట్టారోగానీ, ఏ విషయంలోనూ ఇందులో చాణుక్యుడి చాణక్య నీతి ఏమీ కనిపించదు.

దర్శకత్వం: తిరు
తారాగణం : గోపిచంద్, మెహ్రీన్ పిర్జాదా, జరీన్ ఖాన్, నాజర్, రాజేష్ కట్టర్, ఉపేన్ పటేల్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, రచన: అబ్బూరి రవి, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
విడుదల : అక్టోబర్ 5, 2019
2 / 5

―సికిందర్