‘గేమ్ ఈజ్ ఓవర్’ – ట్రైలర్ రివ్యూ!

 

తాప్సీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఈజ్ ఓవర్’ ట్రైలర్ విడుదలైంది. ‘పింక్’ అనే హిందీ క్రైం సూపర్ హిట్ తో మొదలైన తాప్సీ బాలీవుడ్ ప్రయాణం కోలీవుడ్ చేరింది. ‘పింక్’ తర్వాత ‘మన్మర్జియా’, ‘బద్లా’ అనే మరో రెండు హిట్లతో దమ్మున్న పాత్రలు చేస్తూ ఇప్పుడు తమిళ –తెలుగు- హిందీ వెర్షన్లలో ‘గేమ్ ఈజ్ ఓవర్’ తో దేశవ్యాప్తంగా మరో సారి ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు వచ్చేస్తోంది. ‘గేమ్ ఈజ్ ఓవర్’ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్. ఇతను గతంలో నయనతార తో ‘మాయా’ (తెలుగులో ‘మయూరీ’) అనే హిట్ హార్రర్ తీశా‘డు.
‘గేమ్ ఈజ్ ఓవర్’ ట్రైలర్ సాంతం ఒకే భయం అనే ఎమోషన్ తో వుంది. తననెవరో చంపడానికి దాక్కున్నాడని భయపడుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూంటుంది. కొద్ది సేపు బయట వుంటుంది, కొద్ది సేపు ఇంట్లోనే వీల్ చైర్ లో వుంటుంది. పాత్రలు కూడా ఎక్కువ లేవు. పని మనిషి పాత్ర, సైకియాట్రిస్టు పాత్ర కన్పిస్తారు. సైకియాట్రిస్టుగా అనీష్ కురువిల్లా కన్పిస్తాడు. ఆమె మానసిక స్థితిని అతను వివరిస్తాడు. యానివర్సరీ రియాక్షన్ అని. అంటే గతంలో ఏదైనా మనసికంగా ప్రభావం చూపిన సంఘటన జరిగివుంటే, అది ప్రతీ సంవత్సరం అదే రోజు, అదే సమయంలో గుర్తుకు వచ్చి, ఇలా రియాక్ట్ అవుతారని. మరైతే తాప్సీ కి ఇంత భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన గతంలో ఏం జరిగి వుంటుంది? ఇది సస్పెన్స్ గా పెట్టారు. ట్రైలర్ లో ఆమె ప్రస్తుత మానసిక స్థితితో ఊహాజనిత భయాలు చూపించారు. గతంలో ఏం జరిగిందీ, ఆ తర్వాత ఆమె మానసిక సమస్య కి పరిష్కారమేమిటనేది ఆసక్తిని పెంచుతున్న కథగా దాచిపెట్టారు.

ట్రైలర్ లో కన్పించని కథేమిటనే ఉత్కంఠ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఓపెనింగ్స్ కి బలం కావాలి. రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ థ్రిల్లర్ కి రాన్ ఎథన్ యోహన్ సంగీతం, వసంత్ ఛాయాగ్రహణం. జూన్ 14 న విడుదల.

-సికిందర్