కొత్త మెగా జోష్ – ‘సైరా’ -2 ట్రైలర్ రివ్యూ!

కొత్త మెగా జోష్ – ‘సైరా’ -2 ట్రైలర్ రివ్యూ!

అక్టోబర్ 2 వ తేదీ విడుదల కానున్న మెగా స్టార్ చిరంజీవి పీరియడ్ మూవీ ‘సైరా’ రెండవ ట్రైలర్ విడుదలైంది. పూర్తిగా కదన రంగంలో భీకర పోరాటాలతో నిండి 58 సెకన్ల ఈ ట్రైలర్. బ్రిటిష్ దొర రెచ్చగొట్టే మాటలకి చిరంజీవి తిరగబడే సీన్ తో ఒపెనవుతుంది. “ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్స్‌లని 300 పర్సంట్ పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ల బంగారంతో తిరిగిరావాలి!’’ అని బ్రిటిష్ దొర గర్జిస్తాడు. దీంతో ఉయ్యాల వాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి, “గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు!’’ అని ఘీంకరిస్తూ బ్రిటిష్ బలగాలమీద పది ఊచకోత ప్రారంభిస్తాడు. ఇలా ప్రారంభమయ్యే హై స్పీడ్ యాక్షన్ ట్రైలర్ చిరంజీవి ఉరికంబం ఎక్కుతూ, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ప్రాణానికీ లక్ష్యం ఒక్కటే, “స్వాతంత్ర్యం… స్వాతంత్ర్యం… స్వాతంత్ర్యం…!” అని నినదించడంతో ముగుస్తుంది.

చిరంజీవి ఉయ్యాలవాడ భావోద్వేగాల ప్రదర్శన అభిమానుల్ని కట్టిపడేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రైలర్ కి యూట్యూబ్ వ్యూస్ కూడా 17 లక్షలు తాకుతున్నాయి. ఈ రెండో ట్రైలర్ తో సినిమా పట్ల జోష్ మరింత పెంచేలా వుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ మెగా పీరియెడ్ మూవీ ట్రైలర్ -2 ఐదు భాషల్లోనూ విడుదలై వైరల్ అవుతోంది. హిందీకి సంబంధించి ప్రముఖ ‘దైనిక్ జాగరణ్’ పత్రిక ట్రైలర్ ని ప్రశంసిస్తూ రాసింది. ఇద్దరు మెగా స్టార్లు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లు ఒకేసారి తెర మీదికొచ్చి ప్రేక్షకుల్ని కన్నుల పండువ చేయనున్నారనీ రాసింది.

చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లతో బాటు కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా మొదలైన హేమా హేమీలు ‘సైరా’ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అమిత్ త్రివేది సంగీతం వహిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు, పరుచూరి బ్రదర్స్ కథ, సాయి మాధవ్ మాటలు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై రాం చరణ్ నిర్మాత.