AP & TS

కెసియార్ కు రాయలసీమ నుంచి మద్దతు

(యనమల నాగిరెడ్డి)

డిసెంబర్ 7న తెలంగాణా శాసనసభకు జరగనున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తమ సంఘం తీర్మానించిందని గ్రేటర్ రాయలసీమ సంఘం తెలంగాణా శాఖ ప్రకటించింది. ఈ మేరకు సంఘం నిర్మాతలు రిటైర్డ్ ఐజి హనుమంత రెడ్డి, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్షుమణరెడ్డి ప్రకటించారు.

కాలానుగుణంగానూ, తన రాజకీయ అవసరాలకోసం నిముషానికి ఓకే మాట మార్చగల  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన “మాయాకూటమి” మనుగడే ప్రస్నార్ధకమని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తామని ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని వారు ఆరోపించారు. 2014 ఎన్నికలలో రైతులకు లక్ష వరకు, ద్వాక్రా సంఘాలకు  రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ఆచరణలో విడతల వారీగా చెల్లించి వారిని అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేశారని అన్నారు. వై.ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన “రాయలసీమ ప్రాజెక్టులను” పూర్తి చేయకుండా ఆ ప్రాంత ప్రజలను వలస కూలీలుగా మార్చారని వారు ఆరోపించారు. ప్రాజెక్టులకు నీళ్లివ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని  హనుమంత రెడ్డి ఆరోపించారు. తన ఏలుబడిలోని ప్రాంతాలను సమదృష్టితో చూడలేని బాబు గారు నిలువనీడలేని తెలంగాణలో తమకెలా రక్షణ కల్పిస్తారని వారు ప్రశ్నించారు.

ఏ. పి లో లక్ష రుణమాఫీ సక్రమంగా అమలు చేయలేని బాబు గారి నాయకత్వంలోని మహాకూటమి తెలంగాణలో ఎలా అమలు చేయగలరని వారు ప్రశ్నించారు.  ఎన్నికలకోసం మాత్రమే బాబు గారి కూటమి ఇస్తున్న హామీలు నమ్మదగ్గవి కాదని వారు అభిప్రాయపడ్డారు.

“విభజించు-పాలించు” అన్న రాజనీతిని అన్ని వేళలా అమలు చేస్తున్న చంద్రబాబు తెలంగాణా లో కూడా అమలు చేసి ప్రశాంతంగా బ్రతుకుతున్న ప్రజలను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన స్వంత రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించలేని చంద్రబాబు వేరే రాష్ట్రంలోని (ఆయన మేరకు సీమాంధ్రులైన) తమకు ఎలా రక్షణ కల్పిస్తారని, ఎన్నికలలో ఓట్లు వేయించుకోడానికి బాబు చేస్తున్నప్రయత్నాలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు వివరించారు.

2014 రాష్ట్ర విభజనకు ముందు చెలరేగిన వివాదాలవల్ల తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని, ఆ తర్వాత గత నాలుగున్నర సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో తమకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వారు గుర్తుచేశారు. ఈ ఎన్నికల అనంతరం (ఒకవేళ ఓడిపోతే)అడ్రస్ కనిపించని బాబు గారి మాటలు విని జనం  మోసపోకూడదని తమ సంఘం ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తున్నదని హనుమంతరెడ్డి, లక్ష్మణ రెడ్డి వివరించారు.

Telugurajyam
Read
Special
Ads

Copyright © 2018 TeluguRajyam

To Top