fbpx
Home Movie Reviews కుటుంబరావు కథ : 'జోడీ' న్యూ ఏజ్ మూవీ రివ్యూ!

కుటుంబరావు కథ : ‘జోడీ’ న్యూ ఏజ్ మూవీ రివ్యూ!

కుటుంబరావు కథ – ‘జోడీ’ న్యూ ఏజ్ మూవీ రివ్యూ!

 

గత ‘బుర్రకథ’ తో 10 వ అపజయాన్నెదుర్కొన్న హీరో ఆది సాయికుమార్ ఈ సారి కుటుంబ కథ నటించాడు. కొత్త దర్శకుడు విశ్వనాథ్ దీనికి ‘న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా’ అని పబ్లిసిటీ ఇచ్చాడు. ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ని ఆదితో నటింపజేసి గ్లామర్ తీసుకొచ్చాడు. కుటుంబ సినిమాల కొరత వున్న ఈ రోజుల్లో న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అంటూ ప్రేక్షకుల ముందుకి రావడం ఒక కొత్త భరోసాని కల్పిస్తుంది సినిమా పైన. ఇన్ని ఆకర్షణలు కన్పిస్తున్న ఈ కొత్త దర్శకుడి తొలిప్రయత్నం నిజంగా కొత్తదనంతో కూడుకుని వుందా, లేక ఇచ్చిన ‘న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా’ పబ్లిసిటీ మభ్య పెట్టేదేనా ఓసారి చూద్దాం…

కథ
కపిల్ (ఆది) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కపిల్ తండ్రి (నరేష్) అప్పులు చేసి క్రికెట్ బెట్టింగులు కట్టే వ్యసనపరుడు. కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్) ఒక ఫ్రెంచి క్లాసులు చెప్పే టీచర్. ఒకరోజు ఈమెని చూసి ప్రేమలో పడతాడు కపిల్. ఆమె కూడా ప్రేమిస్తుంది. ఆమెకి తల్లిదండ్రులు వుండరు. బాబాయి కుటుంబంతో వుంటుంది. బాబాయ్ కి ప్రేమ విషయం చెప్తుంది. కపిల్ ని కలవడానికి వెళ్ళిన బాబాయ్ – కపిల్, అతడి తండ్రి అప్పుల వాళ్ళతో బజార్లో పడి కొట్టుకోవడం చూసి, కపిల్ తండ్రిని కూడా గుర్తు పట్టి – ఈ సంబంధం వద్దనుకుని వెళ్ళిపోతాడు.

కాంచనమాల బాబాయికి గతంలో కపిల్ తండ్రితో ఏం జరిగింది? కాంచనమాల తండ్రి మరణానికి కపిల్ తండ్రి ఎలా కారకుడయ్యాడు? ఈ కారణాలతో తమ ప్రేమని నిరాకరిస్తున్న కాంచనమాల బాబాయిని కపిల్ ఎలా దారికి తెచ్చుకున్నాడు? వ్యసనపరుడైన తండ్రి కెలా బుద్ధి చెప్పాడు?… ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో చూడొచ్చు.

ఎలావుంది కథ
పాత సీసాలో కొత్త సారాయి పోసినా, పబ్లిసిటీ ప్రకారం ఏదోలే న్యూ ఏజ్ కుటుంబ కథేనని సరి పెట్టుకోవచ్చు తెలుగు సినిమాల ప్రమాణాల ప్రకారం. పాత సీసాలో పాత సారాయే పోసి ఎనర్జీ డ్రింక్ అంటేనే అభ్యంతర మొస్తుంది. ఒక కొత్త దర్శకుడు ఇంత పురాతన సినిమాతో కెరీర్ ని నిర్మించుకుంటాడని ఎవరూ వూహించరు. 1980 ల నాటి కుటుంబ కథకి, 2000 ల నాటి అదే లైటర్ వీన్ ప్రేమ కథల చట్రం. ఇంకేముంటుంది కొత్తదనం. 1979 లో దాసరి నారాయణ రావు తీసిన ‘కోరికలే గుర్రాలైతే’ అనే సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాని చూసి వుంటే దాన్ని ఇప్పుడెలా తీయాలో తెలిసేది. న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అంటే, హిందీలో 2016 లో ఇరవై కోట్లు పెడితే, 152 కోట్లు వసూలు చేసిన ‘కపూర్ అండ్ సన్స్’ అనే స్మాల్ మూవీ లాంటిది. ఇప్పటి కుటుంబ సంబంధాల మీద కథ చేయకుండా, ఏనాటిదో సినిమా చూపిస్తే న్యూ ఏజ్ అయిపోదు. న్యూఏజ్ కి అర్ధం తెలుసుకుని పబ్లిసిటీ చేసుకోవాలి.

ఎవరెలా చేశారు
పాత సినిమాల్లో కుటుంబ బాధ్యతలు మోసే గుమాస్తా పాత్రలంటిది హీరో ఆది నటించిన పాత్ర. పాత్రలు, సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో తను ఇంకా దెబ్బతింటూనే వున్నాడు. యువ ప్రేక్షకులకి దూరమై పోతున్నాడు. ఈ రెండు కుటుంబాల కథలో మధ్యలో నలిగే మంచబ్బాయి పాత్ర ఇటు యూత్ అప్పీల్ కీ, అటు నేటి ఫ్యామిలీస్ ఆశయాలకీ ఏ మాత్రం దోహదం చేసేదిగా లేదు. హీరోయిన్ తో ప్రేమ కూడా బలంగా, ఎమోషనల్ గా లేకపోవడం ఒకటి. ఓ రెండు పాటలు సెమీ క్లాసికల్స్ గా వుండడంతో ఆ పాటల్లో కాస్త మెరుస్తాడు.

‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అత్యంత స్ట్రయికింగ్ బ్యూటీగా వుంది. వెండి తెరంతా వెలిగిపోయేంత గ్లామరస్ గా వుంది. కానీ ఈ కుటుంబ కథలో తన పాత్ర అంత హోమ్లీగా లేదు. ‘హమ్ ఆప్కే హై కౌన్’ లో మాథురీదీక్షిత్ లాంటి గుర్తుండిపోయే హోమ్లీ పాత్రకి స్కోపున్నా, దర్శకుడి నిస్సహాయత ఈ రేంజికి వెళ్ళనీయ లేదు.

ఇక హాస్య పాత్రల్లో వెన్నెల కిషోర్, సత్య కన్పిస్తారు. ఆది కాంబినేషన్ లో ఫస్టాఫ్ లో వీళ్ళిద్దరి ఒక కామెడీ సీను నిజంగా కాస్త న్యూఏజ్ సినిమాకి దగ్గరగా వుంది. ఆ తర్వాత క్రియేటివ్ కామెడీ ఏమీ లేదు. వ్యసన పరుడైన తండ్రి పాత్రలో నరేష్, ‘గుంటూరు టాకీస్’ లో తన పాత్రని గుర్తుకు తెస్తాడు. హీరోయిన్ తాతగా గొల్లపూడి మారుతీ రావు కన్పిస్తారు.

ఫణి కళ్యాణ్ సంగీతంలో పాటలు న్యూ ఏజ్ కి తగ్గట్టు న్యూ ఏజ్ పాటలు ఓ రెండున్నాయి. సెమీ క్లాసిక్స్ కి సెమీ క్లాసిక్ పాటలు ఓ రెండున్నాయి. పాటల ఫ్రెష్ నెస్ కుటుంబ కథలో లోపించింది. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంలో వేకువజాము సీను. ఓ వర్షపు సీనూ ఎఫెక్టివ్ గా వున్నాయి.

చివరికేమిటి
ఈ కుటుంబ డ్రామా చాలా పాత విషయాలతో బలహీనంగా, పాతగా వుంది. ఈ కథకి పునాది క్రికెట్ బెట్టింగ్ అనే జూదం. ఈ జూద ఫలితం ఈ కథలో ఉధృతతమైన తూఫాను సృష్టించక పోవడంతో బలమైన డ్రామాకి అవకాశం లేకుండా పోయింది. ‘కోరికలే గుర్రాలైతే’ లో హీరోయిన్ జయలక్ష్మి పాత్ర, చంద్ర మోహన్ పాత్ర జీవితంలో సృష్టించే సునామీ మామూలుగా వుండదు. కానీ ఈ కొత్త దర్శకుడు లైటర్ వీన్ సినిమాల నేపథ్యంలోంచి రావడంతో, అన్నీ లైటు లైటుగా, పైపైన తడిమి వదిలేసే కథనంతో, పాత్ర చిత్రణ లతో పస లేకుండా వున్నాయి.

ఇంటర్వెల్లో బాబాయి పాత్ర వల్ల హీరోహీరోయిన్ల ప్రేమ సమస్యలో పడ్డాక, దీనికి పరిష్కారంగా హీరో చేసే పనులు శ్రీనువైట్ల స్కీములో వున్నాయి. ఆ బాబాయి పని చేసే ఆఫీసులో తనూ చేరి, ఆయన్ని ప్రసన్నం చేసుకునే పాత డ్రామాతో వున్నాయి. ఐతే ఇది కూడా పూర్తిగా వుండదు. ఈ పాయింటు వదిలేసి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా హీరో ఇల్లిల్లూ తిరిగి, ప్లాట్లు అమ్మించే కామెడీల వైపు వెళ్ళిపోతుంది కథ. సంఘటనలు, సన్నివేశాలూ బలహీనమైనవి. చివరికి హీరో ఒక పనిచేసే సరికి, బాబాయికి అద్భుతంగా కన్పించి పెళ్ళికి ఒప్పుకుంటాడు. అంతా లైటర్ వీన్ ఆషామాషీ వ్యవహారమే. హీరోకి యాక్షన్ సీన్లు వుండాలి కాబట్టి, ఓ విలన్ పెళ్ళికి అడ్డుపడుతూ క్లయిమాక్స్ లో వచ్చేస్తాడు…

ఇక ‘జోడీ’ అనే టైటిల్ కీ సినిమాకీ సంబంధమే లేదు. పైగా బలహీన టైటిల్. ఇలా మరో కొత్త దర్శకుడితో హీరో ఆదికి మరో పాత అనుభవమే ఎదురయ్యింది.

దర్శకత్వం : ఎ. విశ్వనాథ్
తారాగణం : ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సితార గొల్లపూడి మారుతిరావు తదితరులు
సంగీతం : ఫణికళ్యాణ్, ఛాయాగ్రహణం : ఎస్.వి. విశ్వేశ్వర్
బ్యానర్: భావనా క్రియేషన్స్
నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్
విడుదల : సెప్టెంబర్ 6, 2019
2 / 5

-సికిందర్ 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ