సైలెంట్ ‌అయ్యే ప్రసక్తే లేదు … అతి త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ : డొనాల్డ్ ట్రంప్

తన ట్విట్టర్ అకౌంట్ పై శాశ్వత నిషేధం విధించిన ట్విటర్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా దిగ్గజ తీరుపై మండిపడిన ఆయన, ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించానన్నారు. ట్విటర్‌లో భావప్రకటన స్వేచ్ఛ లేదని, రాడికల్‌, వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించే ప్లాట్‌ఫాం అంటూ విరుచుకుపడ్డారు. అక్కడ కేవలం విషం చిమ్ముతూ మాట్లాడే వారికే ప్రాధాన్యం ఉంటుందని అక్కసు వెళ్లగక్కారు.

Explained: How Trump could be impeached again, but faster

అయితే ఇలాంటి పరిణామాలు తమను ఆపలేవని, ట్విటర్‌ చర్యతో తాను, తన మద్దతుదారులు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలకు చేరువగా ఉండేందుకు ఇతర సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నామన్న ట్రంప్‌, సమీప భవిష్యత్తులో తమ సొంత ప్లాట్‌ఫాంను తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అతిపెద్ద ప్రకటన వెలువడుతుందని, సైలెంట్ ‌గా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా దిగ్గజమైన ట్విటర్‌ పదే పదే వాక్‌స్వాతంత్య్రం , భావ ప్రకటన స్వేచ్చపై నిషేధం విధిస్తోంది. డెమొక్రాట్లు, రాడికల్స్‌ తో ట్విటర్‌ ఉద్యోగులు సమన్వయం చేసుకుంటూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. నా గొంతు నొక్కేందుకు అకౌంట్‌ ను తొలగిస్తారా దేశభక్తులైన 75,000,000 మంది నాకు ఓటు వేశారని మీకు తెలుసా, ట్విటర్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీ. సెక్షన్‌ 230 ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాట్లు లేకపోతే మీ ఉనికే ఉండదు అని ట్రంప్‌ ఘాటు విమర్శలు చేశారు.