Opinions

రాయలసీమ నేతలు టిఆర్ ఎస్ కు ఎలా మద్దతు ఇస్తారు?

(టి.లక్ష్మీనారాయణ)

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితికి గ్రేటర్ రాయలసీమ నేతల మద్దతు అంటూ  ఒక వార్త చదివాను. దానిపై స్పందించాలని పించింది.

1. కరవు పీడిత రాయలసీమ ప్రాంత హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కొందరు పెద్దలు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్ధతు ప్రకటించిన వార్త అది. దాన్ని చూడగానే కాస్త ఆశ్చర్యం కలిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభలకు జరిగే ఎన్నికల్లో ఎవరు ఎవరికైనా స్వేఛ్చగా మద్ధతు పలకవచ్చు. కానీ, ఆ వార్త చూసి నేను ఆశ్చర్య పోవడానికి ఒక పూర్వరంగం ఉన్నది.

2. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అక్రమ నిర్మాణమని, దాని ద్వారా తెలుగు గంగ, గాలేరు – నగరి, ఎస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్ ప్రాజెక్టులకు కృష్ణా నదీ జలాలను దొంగతనంగా తరలించుకు పోతున్నారని పదే పదే దూషిస్తూ, కరవు పీడిత రాయలసీమ ప్రాంతవాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్న పార్టీకి మద్దతు పలకడమేంటాని! ఆశ్చర్య పోయాను. అంతకంటే ఆత్మహత్యా సదృశ్యం మరొకటి ఉంటుందా! వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధికి అంకితభావంతో పోరాడుతున్న వారెవరైనా ఇలాంటి ప్రకటన చేయగలరా! అన్న సందేహం వచ్చింది.

కెసియార్ కు రాయలసీమ నుంచి మద్దతు

3. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం సత్వరం పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒడిస్సా, చత్తీష్ ఘర్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో పరిష్కారమైన సమస్యను తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ వివాదాస్పదం చేయడంలోని పరమార్థమేంటో! ఆలోచించాలి. విభజన చట్టంలో పొందు పరచిన మేరకు పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. దాన్ని వివాదాస్పదం చేయడమంటే పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కల్పించాలన్న దురుద్ధేశం తప్ప మరొకటి కాదు.

4. రాష్ట్రం విడిపోయి నాలుగున్నరేళ్ళ కాలం గడచి పోతున్నది. నీటి సమస్య జఠిలమైనది, సంక్లిష్టమైనది, సున్నితమైనది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య ఉన్నది. ఈ సమస్య కొత్తది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అపరిష్కృతంగా కొనసాగింది.

5. అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యలకు సంబంధించిన అనుభవాలు తెలుగు ప్రజలకు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకల నుండి దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలను ఎదుర్కొన్నది. ఒకే పార్టీ ఎగువ, దిగువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా నీటి వివాదాలు అపరిష్కృతంగానే మిగిలి పోయి, వివాదాలు కొనసాగాయి.

6. కృష్ణా నదీ జలాలపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా పరిణమించింది. రాష్ట్ర విభజన తరువాత మరింత సంక్లిష్టంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఉన్న మాట వాస్తవం. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ విజ్ఞతతో పరిష్కరించు కోవడానికి రాజకీయ సంకల్పంతో కృషి చేయాలి.

7. ట్రిబ్యునల్ తీర్పులు, రాష్ట్ర విభజన చట్టం – దాని ప్రకారం ఏర్పాటు చేసిన కృష్ణా – గోదావరి నదీ యాజమాన్య బోర్డులు – అఫెక్స్ కౌన్సిల్, న్యాయస్థానాల తీర్పుల ప్రామాణికంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించు కోవడం మినహా మరో మార్గం లేదు.

8. రాజకీయ విజ్ఞత ప్రదర్శించడానికి బదులు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాన్ని రగిల్చే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం.

9. రెండు తెలుగు రాష్ట్రాలు శాంతియుతంగా సహజీవనం చేస్తూ, ఆరోగ్యకరమైన పోటీతో అభివృద్ధిలో వడివడిగా ముందుకు సాగి పోవాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఆ వాతావరణాన్ని కలుషితం చేయకుండా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వ్యవహరించాలి.

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కోణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను చూసి ఏ పార్టీకి ఓటు వేయడానికి గానీ, మద్ధతు ఇవ్వడానికి గానీ మనస్కరించనప్పుడు చట్టం కల్పించిన ప్రత్యామ్నాయం “నోటా” ఉండనే ఉన్నది. దాన్ని వినియోగించుకోమని కోరి ఉంటే అదో రకం. కరవు పీడిత ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా స్వియమానసిక దోరణితో తప్పటడుగులు వేస్తే ప్రజల విస్తృత ప్రయోజనాలకు తీవ్ర హాని జరుగుతుంది.

(టి.లక్ష్మీనారాయణ, ప్రముఖ తెలుగు రాజకీయ వ్యాఖ్యాత)

Telugurajyam
Read
Special
Ads

Copyright © 2018 TeluguRajyam

To Top