లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

Try these habits in the morning if you want to be successful in life!

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే ప్రతి ఒక్కరు ముందుగా సరైన అలవాట్లను ఎంచుకోవటం అవసరం. మనం చేసుకున్న అలవాట్లే మన జీవితాన్ని నిర్మిస్తాయి. అంతేకాకుండా మానసిక బలానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ క్రింద పేర్కొనబడిన కొన్ని అలవాట్లను మన జీవితంలో భాగంగా మార్చుకుంటే ఎలాంటి అద్భుతాలు చేస్తాయో మీకే తెలుస్తుంది.

ఉదయం లేచిన వెంటనే మొదటిగా పడుకున్న బెడ్ ని చూడండి. చెదిరిన పక్క కనిపిస్తుంది. వెంటనే దాన్ని సరిచేసి చక్కగా సర్దుకొండి. ఇలా చేశాక ఏదో సాధించామనే భావన మనలో కలుగుతుంది. చేసింది చిన్న పనే అయినప్పటికీ ఉదయాన్నే ఒక పనిని విజయవంతంగా పూర్తి చేశామనే భావన ఆ తరువాత చేయబోయే పనుల మీద శ్రద్ధను నిలుపుతుంది.

ఉదయం లేచిన వెంటనే తాగగలిగినన్ని వాటర్ ని తాగేయండి. లేచిన వెంటనే బ్రష్ చేశాక అయినా లేదంటే లేట్ గా బ్రష్ చేసేవాళ్ళు ముందుగా అయినా వాటర్ తీసుకోవచ్చు. ఉదయాన్నే వాటర్ త్రాగటం ముఖ్యమైన అంశం. ఇలా చేయటం వల్ల బ్లడ్ ప్రెజర్ మంచిగా ఉంటుంది. అలానే మలబద్దక సమస్య ఉంటే తొలిగిపోతుంది. ఉదయం మాత్రమే కాదు రోజంతా తగినన్ని వాటర్ తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని గుర్తుంచుకోండి.

సూర్య రశ్మి అనేది శరీరానికే కాదు మైండ్ కి కూడా మంచిది. సన్ లైట్ ని చూడని వాళ్ళు మానసిక వత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం వీలును బట్టి కొంత సమయం సన్ లైట్ ని ఆస్వాదించండి. బాడీకి కావాల్సిన డి విటమిన్ లభ్యమయ్యి ఆరోగ్యానికి దోహదపడుతుంది.

యోగా, ధ్యానం… మనిషి మీద అన్ని విధాలుగా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మనలోని లిమిట్స్ ని పెంచుకునేందుకు, మన గురించి మనం విశ్లేషించుకునేందుకు ఉత్తమ మార్గంగా ధ్యానం పనిచేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు, భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు కూడా ధ్యానం బాగా ఉపయోగపడుతుంది.

సాధారణంగా ప్రతి మనిషికి జీవిత లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల గురించి సానుకూల స్వీయ చర్చను ప్రతిరోజూ ఉదయం చేస్తే మంచిది. దీనివల్ల లక్ష్యాల మీద ఆసక్తి పెరగటమేకాకుండా, జీవిత ఉద్దేశం మరిచిపోకుండా ముందుకు సాగటానికి ఉపయోగపడుతుంది.

ఉదయం దినచర్యలో శరీర వ్యాయామం చేర్చటం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో శరీరం కదలకుండా కూర్చుని కేవలం చేతివేళ్ళను కదుపుతూ సంపాదిస్తున్నారు. దీనితో శరీరానికి కావాల్సిన వ్యాయామం లేక ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అదే ఉదయం వేళల్లో వ్యాయామం చేస్తే ఆ రోజు చేయబోయే పనులకి శరీరం సిద్దమవటమేగాక, మెదడు కూడా ఉత్తేజంగా పని చేస్తుంది.

వేకువజామున చన్నీళ్లతో స్నానం చేస్తే చాలా ఉపయోగాలున్నాయి. చన్నీళ్ళ స్నానంతో శరీరానికి చిన్నపాటి విద్యుత్ ప్రేరణ జరుగుతుంది. దానివల్ల ఎన్నో ఆరోగ్యపరంగా లాభాలున్నాయి. ఆక్సిజన్ తీసుకోవటం పెరిగి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మెదడులో సంతోషకర హార్మోన్లు (ఎండార్ఫిన్స్) ని చన్నీళ్ల స్నానం విడుదలయ్యేలా చేస్తుంది. జ్వరం, జలుబు ఉంటే చన్నీళ్ళ స్నానం చెయ్యొద్దు.

బ్రేక్ ఫాస్ట్… రోజులో మొదటిగా తీసుకునే ఆహారం ఏంతో ముఖ్యమైనది. అల్పాహారం వల్ల జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెరుగుతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అతిగా తీసుకుంటే మెదడు మీద వత్తిడి పెరుగుతుంది, నిద్రపోవాలనిపిస్తుంది. తిన్న దానిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

ప్రతిరోజూ ఉదయాన్నే ఆ రోజు చెయ్యాల్సిన పనుల గురించి ఒకసారి చర్చించుకోవాలి. ఉదయం సమయంలో విల్ పవర్ ఎక్కువగా ఉంటది కనుక అన్నింటిలో కఠినమైన పనిని మొదటిగా పూర్తి చేస్తే ఆ జోరులో మిగిలిన పనులను సునాయాసంగా చేసేయ్యొచ్చు.

ఉదయం లేచిన తర్వాత భారీ బీట్స్ ఉన్న సంగీతాన్ని కాకుండా ఆహ్లాదకరంగా ఉండే సంగీతాన్ని వినటం చాలా మంచిది. మీకిష్టమైన సినిమా పాటలలో సింపుల్, సాఫ్ట్ గా ఉండే వాటిని ఎంచుకొని వింటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల మనలోని ఉత్పాదక శక్తి పెరిగి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం.