ఒక సినిమాకి ఒకరే డైరెక్టర్ అన్నది కామన్‌గా అందరికి తెలిసిందే. కానీ విక్టరీ వెంకటేష్ చిత్రానికి మాత్రం ఇద్దరు దర్శకులు పనిచేయబోతున్నారన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న హిట్ టాపిక్. తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రం `అసురన్`. ధనుష్ హీరోగా కలైపులి ఎస్. ధాను నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్ హీరోగా కలైపులి ఎస్. థాను సమర్పణలో డి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
ఊర మాస్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇటీవలే అనంతపురంలోని పొలాల్లో చిత్ర బృందం హడావిడిగా ప్రారంభించేసింది. ఫ్లాప్‌లతో సతమతమవుతున్న శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతా బాగానే వుంది. అయితే అతన్ని ఏమాత్రం సురేష్‌బాబు నమ్మడం లేదంట. మెలో డ్రామా, టాకీకి సంబంధించిన విషయాల్ని మాత్రం అతనికి వదిలేసి సినిమాకు కీలకమైన భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాల్ని మాత్రం మరో దర్శకుడికి అప్పగించినట్టు తెలిసింది.
ఇటీవల `వెంకీమామ`తో సురేష్ ప్రొడక్షన్స్‌కి హిట్ చిత్రాన్ని అందించిన బాబీకి `నారప్ప` కీలక సీన్‌ల బాధ్యతని సురేష్‌బాబు అప్పగించారట. ఇంత జరుగుతున్నా శ్రీకాంత్ అడ్డాల మాత్రం సైలెంట్‌గా తనకు అప్పగించిన పనిని సిన్సియర్‌గా పూర్తి చేయాలనుకుంటున్నాడట. అంతేలే ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అది లేనప్పుడు అన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే అని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.