Amaravati: ఏపీ రాజధాని అమరావతి చుట్టూ గత కొన్నేళ్లుగా నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. గతంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు రాజధాని అభివృద్ధి పనులను నిలిపేశాయి. దీంతో అమరావతిపై స్పష్టత లేకుండా ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు వెనక్కు తగ్గారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గెజిట్ ద్వారా అధికారికంగా ప్రకటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభజన తర్వాత టీడీపీ (TDP) హయాంలో అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించి, అనేక ప్రాజెక్టులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Byelection: డిసెంబరులో మరోసారి ఎన్నికల వేడి
కానీ వైసీపీ (YSRCP) ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదనతో ఆ పనులు ఆగిపోయాయి. ఈ తీరుతో ఐటీ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాలేదు. మళ్లీ ఇప్పుడు కూటమి సర్కార్ అమరావతిని (Amaravati) పునరుద్ధరించే కసరత్తులో భాగంగా, కేంద్రం ద్వారా గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అమరావతి (Amaravati) అభివృద్ధిని పునఃప్రారంభించేందుకు గెజిట్ నోటిఫికేషన్ అవసరమని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇందుకోసం డిసెంబర్ చివరి నాటికే కేంద్రం గెజిట్ వచ్చేలా అధికారిక సన్నాహాలు జరుగుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో భేటీలో ఈ విషయంపై సానుకూల స్పందన తీసుకురావడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అందరూ కలిసి ఒకే లక్ష్యంతో ముందుకెళితే రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం చేయవచ్చని కూటమి నేతలు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల నిధులు, వివిధ ఏజెన్సీల నుంచి మరిన్ని నిధులు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సిద్ధమవుతున్న నేపథ్యంలో, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి (Amaravati) రాజధాని పనులు ప్రారంభమైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ రాగానే రాజధాని పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించి, భవిష్యత్ లో ఎలాంటి మార్పులకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకసారి రాజధాని ప్రాజెక్టులు పూర్తి అవుతే, అమరావతి (Amaravati) రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ నాటికి గెజిట్ వస్తే, అమరావతిని అభివృద్ధి పథంలో నిలపడం ఇక తథ్యమని కూటమి సర్కార్ స్పష్టం చేస్తోంది.