మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి.?

Chiranjeevi

పాత ప్రశ్నే ఇది. మళ్ళీ మళ్ళీ కొత్తగా తెరపైకొస్తుందంతే. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నారు. రాజకీయాల గురించి అస్సలు ఆలోచన చేయడంలేదు. ‘రాజకీయాలు నాకు సరిపడవు..’ అని చిరంజీవి పదే పదే చెబుతున్నారు. ‘ఇప్పుడున్న రాజకీయాల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో..’ అంటారాయన.

ఔను, రాజకీయమంటే ఇప్పుడదో వ్యాపారం. లాభ నష్టాల సంగతి తర్వాత.. వున్న పేరు చెడగొట్టుకోవాలంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి మూటగట్టుకున్న చెడ్డపేరు అంతా ఇంతా కాదు. టీడీపీ అనుకూల మీడియా దెబ్బకి చిరంజీవి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది రాజకీయాల్లో. జనసేనకి వైసీపీ అనుకూల మీడియా నుంచి అలాగే టీడీపీ అనుకూల మీడియా నుంచీ సెగ తగులుతోంది.

రాజకీయం అంటేనే ఇంత. మరి, మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఈ బురదలోకి ఇంకోసారి దిగుతారు.? అంటే, ఆయన దిగాలనుకున్నా, అనుకోకపోయినా.. ఆ పరిస్థితిని అయితే బీజేపీ కల్పించేలాగానే వుంది. 2024 ఎన్నికల్లో చిరంజీవిని ముందు పెట్టి రాజకీయం చేయాలని బీజేపీ పథకరచన చేసిందట.

ఎటూ జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు వుంది. ఈ క్రమంలోనే చిరంజీవి ఇమేజ్ కూడా తమకు అనుకూలంగా మారితే ప్రయోజనం వుంటుందని బీజేపీ భావిస్తోందట. అయితే, చిరంజీవి నిర్ణయం ఎలా వుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

వాస్తవానికి జనసేన పార్టీ తరఫునే చిరంజీవి రాజకీయం చేయొచ్చు. కానీ, ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని మళ్ళీ పిలుస్తోంది. కాంగ్రెస్ వైపు వెళ్ళరు చిరంజీవి. వైసీపీ నుంచీ ఆహ్వానం వున్నా అటు వైపు చూసే అవకాశం లేదు. కానీ, బీజేపీ విషయంలోనే చిరంజీవి ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్నది ఓ బలమైన ప్రచారం.