అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం. పవన్ కు రాజకీయంగా ధైర్యం లేదు, నిలకడ లేదు, నిబద్ధత లేదు, అవగాహనా లేదు… అంతకంటే ముందు కసి, పట్టుదల అస్సలే లేదు. ఇది, పవన్ పాలిటిక్స్ ని పదేళ్ల నుంచి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట! అయితే… పవన్ కి అభిమానుల రూపంలో అన్నీ ఉన్నా… శని రూపంలో పైన చెప్పుకున క్వాలిటీస్ దెబ్బతీస్తున్నాయని అంటున్నారు.
దీనికి కారణం.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక అభిమాని చేసిన పని. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం, క్రిష్ణాపురం గ్రామంలో జనసేన అభిమాని.. తన పెళ్ళి కార్డు మీద జనసేన ఎన్నికల ప్రణాళిక వేసి ప్రచారం చేస్తున్నారు. తన పెళ్లి కార్డుకు వెనక వైపు జనసేన మ్యానిఫేస్టోతో పాటు పవన్ ఫోటో, గాజు గ్లాస్ గుర్తు ముద్రించి కార్డులు పంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయాలని, పవన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఈ అభిమాని కోరుకుంటున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు… మరిముఖ్యంగా జనసేన కేడర్ లో ఈ కార్డు వైరల్ అవుతుంది. ఇందుకోసమే పైన చెప్పుకున్న “అన్నీ ఉన్నా…” అనే సామెత! అవును.. పవన్ ను ఈ స్థాయిలో అభిమానించే అభిమానులు ఉన్నారు. పవన్ ముఖ్యమంత్రి కావాలని, వారు కలలు కంటున్న మేనిఫెస్టోని అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నారు. పవన్ కోసం ఎంత కష్టమైనా పడటానికైనా వారంతా సిద్ధంగా ఉన్నారు!
సరిగ్గా ప్లాన్ చేసుకుని, నిజాయితీగా పనిచేస్తే, కరెక్టుగా కష్టపడితే… అందలం ఎక్కించడానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ… పవన్ కి ఇవేమీ పట్టడం లేదు. ఆ దిశగా ఆలోచన చేయలేకపోతున్నారు. బాబు పంచన రాజకీయాలు చేయడం అలవాటైపోయో.. లేక, బాబుకు బానిసైపోయో తెలియదు కానీ… తనను ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటూ, ప్రోత్సహిస్తున్న అభిమానుల ఆశలపై మాత్రం డ్రైనేజ్ నీళ్లు చల్లేస్తున్నారు.