తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మతి భ్రమించిందని, పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయనతో పాటు మొత్తం మంత్రివర్గాన్ని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మంథనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని వెంటనే ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలని రాష్ట్రపతిని కోరుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి తన ఎత్తుకు తగ్గట్టుగా మెదడు పెంచుకోవాలని పుట్ట మధు హితవు పలికారు. “మీ ఎత్తుకు తగినట్లు మెదడు లేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం తెల్లకల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చేసిన వ్యాఖ్యలను పుట్ట మధు తప్పుబట్టారు. 1999లోనే శ్రీపాదరావు చనిపోతే, 2004లో ప్రారంభమై 2016లో పూర్తయిన ప్రాజెక్టును ఆయన ఎలా కడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికే కాకుండా ఆయన పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలివి లేదని విమర్శించారు. పొడవుగా ఉన్న హరీశ్ రావును రేవంత్ రెడ్డి అవహేళన చేశారని, మరి పొట్టిగా ఉన్న ఆయనకేం తెలివి ఉందని మధు నిలదీశారు.
“కాళేశ్వరం కూలిపోలేదు, నీ ముఖమే కూలిపోయింది” అంటూ పుట్ట మధు ఘాటుగా వ్యాఖ్యానించారు. లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను ఉపయోగించి ప్రజలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.


