అవంతి శ్రీనివాస్ రాజీనామా: వైసీపీకి మరో ఎదురు దెబ్బ

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడం ఆ పార్టీకి కష్టకాలంలో మరో పెద్ద షాక్‌గా మారింది. పార్టీకి చెందిన కార్యకలాపాలు, నాయకత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవంతి తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మీడియాతో మాట్లాడిన అవంతి, కొత్త ప్రభుత్వం పని చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఐదు నెలలకే నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు. జగన్ తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇస్తూ, పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం ఆందోళన కలిగించిందని తెలిపారు.

అవంతి పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యకర్తలకు గౌరవం లేని పరిస్థితి నెలకొని, నాయకత్వం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. జగన్ తన హయాంలో ఎన్నో పథకాలను అమలు చేసినా, ఎన్నికల్లో ఓటమి చవిచూడడం పార్టీ లోపాలనే చూపుతుందని అన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు మార్పు అవసరమని స్పష్టంగా తెలిపారు.

రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొన్న అవంతి, కుటుంబానికి మరింత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో రాజకీయాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన, ప్రజలకు సేవ చేయడంలో గర్వపడుతున్నానని అన్నారు. ఈ పరిణామం వైసీపీలో విభేదాలను మరింత పెంచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.