ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. ఇప్పటికే వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.4,000 సామాజిక పెన్షన్ అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన చంద్రబాబు, తాజాగా తల్లిదండ్రులు లేని చిన్నారులకు కూడా పెన్షన్ అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ నిర్ణయం సామాజిక సేవలో ఒక ముందడుగుగా పరిగణించబడుతోంది.
రాష్ట్రంలో పెన్షన్ విధానంపై జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అనర్హులుగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులను గుర్తించడమే కాకుండా, మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఏరివేత తర్వాత కూడా ఇలాంటివి జరుగితే కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో, ఈ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
తల్లిదండ్రులు లేని చిన్నారులకు పెన్షన్ అందించడం దేశంలోనే తొలిసారి ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. బాల్యదశలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థికంగా అండగా నిలిచే విధానంగా దీనిని రూపొందించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది అనాథ చిన్నారులకు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పెన్షన్ల విస్తృతికి తోడు, ప్రభుత్వం మరింత పారదర్శకతను తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఈ విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.