ఏపీలో టీడీపీకి మరో అస్త్రం దొరికిందహో.!

Political Fight Between YCP and TDP

Political Fight Between YCP and TDP

అధికార పక్షంపై విరుచుకుపడ్డానికి విపక్షాలకు ఏదో ఒక అస్త్రం కావాలి. ఏ రాజకీయ పార్టీ విపక్షంలో వున్నా చేసేది అదే. కానీ, కరోనా పాండమిక్ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినాసరే, ఒకింత సంయమనం పాటించాలి. కానీ, రాజకీయాల్లో అలాంటివేమీ వుండవు. పొలిటికల్ గెయిన్ కోసమే ఏ రాజకీయ పార్టీ అయినా పాకులాడుతుంది. అధికారంలో వున్నోళ్ళు, ప్రతిపక్షంలో వున్నోళ్ళు.. అందరిదీ ఒకటేదారి. దారుణమేంటంటే, అధికార – విపక్షాల మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధంలో ప్రజలే సమిధలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం, సరిహద్దుల్లో అంబులెన్సుల్ని ఆపేస్తోంది.

బోల్డన్ని ఆంక్షలు పెడుతోంది. ఈ విషయమై ఆంధ్రపదేశ్ ప్రభుత్వం స్పందించి, డ్యామేజీ కంట్రోల్ చర్యలు చేపట్టాల్సి వుంది. కానీ, ప్రభుత్వం ఇంతవరకు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడంలేదు. మరోపక్క, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. అప్పుడే రాజకీయ విమర్శలు షురూ చేసేసింది. ఇది పూర్తిగా జగన్ సర్కారు వైఫల్యమేనంటోంది. టీడీపీ నేతలు ఒకరొకరుగా మీడియా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చర్చించి, సమస్యకు పరిష్కారం కనుగొనడంలేదంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో విమర్శించడం తేలికే.. కానీ, సమస్యకు పరిష్కారం వెతకడం కష్టం. వున్నంతలో, ఏపీ నుంచి తెలంగాణకి అంబులెన్సులు వెళ్ళకుండా కరోనా బాధితులకు, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడికక్కడ వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది. అదొక్కటే దారి. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో పోల్చితే, వైద్యం పరంగా తెలంగాణలో మెరుగైన సౌకర్యాలున్నాయి. అందుకే కరోనా బాధితులు, తెలంగాణకు వెళుతున్నారు. అయినాగానీ, ప్రాణాలు చాలా ముఖ్యం. ప్రభుత్వం చొరవ చూపకపోతే, మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదముంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది అంబులెన్సుల్ని సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం నిలిపేయడం వల్ల.