Home Cinema ప్ర‌యోగాల సింగీతం దారిలో ఎంద‌రున్నారు?

ప్ర‌యోగాల సింగీతం దారిలో ఎంద‌రున్నారు?

`ఔటాఫ్ ది బాక్స్` ఇప్ప‌టికైనా ఎక్కిందా?

ఎస్.ఎస్.రాజ‌మౌళి – బాహుబ‌లి.. శంక‌ర్- 2.0 .. సుజీత్ – సాహో.. వీట‌న్నిటికీ హాలీవుడ్ స్ఫూర్తి ఉంది. తెలుగులో ఇటీవ‌ల తెర‌కెక్కుతున్న చాలా చిత్రాల‌కు హాలీవుడ్ స్ఫూర్తి త‌ప్ప‌నిస‌రిగా ఉంటోంది. ప్ర‌స్తుతం వ‌స్తున్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కులంతా అమెరికా స‌హా విదేశాల్లో ఫిలిం ఇనిస్టిట్యూట్ల‌లో.. లేదా పూణే ఫిలింఇనిస్టిట్యూట్ లోనో చ‌దువుకుని టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అందుకే మ‌న‌వాళ్ల సినిమాల్లో హాలీవుడ్ లేదా కొరియ‌న్- ఫ్రెంచి సినిమాల స్ఫూర్తి క‌నిపిస్తోంది. ఒక ర‌కంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప ద‌ర్శ‌కుల్లోని సృజ‌నాత్మ‌క‌త నుంచి స్ఫూర్తి మ‌న తెలుగు ద‌ర్శ‌కుల సినిమాల్లో క‌నిపిస్తోంద‌ని చెప్పొచ్చు.

అయితే వీళ్లంద‌రి కంటే ముందే అంతే గొప్ప ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు ఒక‌రు కేవ‌లం హాలీవుడ్ స్ఫూర్తితో తెలుగు నేటివిటీ మిస్ కాకుండా సినిమాలు తీసి మెప్పించారు. తెలుగు సినీద‌ర్శ‌కుల్లోనే లెజెండ‌రీ అన‌ద‌గ్గ ఆయ‌న పేరు సింగీతం శ్రీనివాసరావు. టాలీవుడ్ 88ఏళ్ల హిస్ట‌రీలో ఆయ‌న లాంటి వేరొక ద‌ర్శ‌కుడు మ‌రొక‌డు పుట్ట‌లేదు అంటే అతిశ‌యోక్తి లేదు. ఎంద‌రో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల దిగ్గ‌జాల న‌డుమ ఆయ‌న శైలి పూర్తి వైవిధ్యంగా ఉండేది. తెలుగు- తమిళం- కన్నడ భాషల్లో ఎన్నో సందేశాత్మకమైన‌.. ప్రయోగాత్మకమైన.. కథా వైవిధ్యం ఉన్న సినిమాల్ని తీసిన ప్ర‌తిభావంతుడు ఆయ‌న‌. అప్ప‌ట్లోనే హాలీవుడ్ రేంజు సినిమాలు తీసిన ఈ మ‌హ‌నీయుడిని ప్ర‌తిసారీ న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు స్మ‌రించుకుంటూనే ఉంటారు.

మయూరి – పుష్పక విమానం- ఆదిత్య 369- మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యం ఉన్న‌ సినిమాలకు దర్శకత్వం వ‌హించారు సింగీతం. ముఖ్యంగా కమల్ హాసన్‌తో సొమ్మొకడిది సోకొకడిది – మైఖేల్ మదన కామరాజు కథ- అమెరికా అమ్మాయి- అమావాస్య చంద్రుడు- అపూర్వ సహోదరులు వంటి గొప్ప ప్ర‌యోగాలు చేశారు. ఆయన గొప్ప‌ దర్శకుడే కాదు గొప్ప కథకుడు కూడా. అది ఆయ‌న సినిమాల్లో క‌నిపిస్తుంది. అస‌లు డైలాగ్ అన్న‌దే అవ‌స‌రం లేద‌ని `పుష్ప‌క విమానం` లాంటి మూకీ చిత్రం తీసిన గొప్ప ద‌ర్శ‌కుడిగా ఆయ‌న పేరు చ‌రిత్ర పుట‌ల‌కెక్కింది. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఆదిత్య 369.. భైర‌వ‌ద్వీపం లాంటి క్లాసిక్స్ ని తెర‌కెక్కించిన గ్రేట్ డైరెక్ట‌ర్ ఆయ‌న‌. హాలీవుడ్ స్టాండార్డ్స్ కి ఏమాత్రం త‌గ్గ‌ని క‌థ‌ల్ని ఎంచుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో తెర‌కెక్కించిన యుగ‌పురుషుడు. అందుకే నేటి త‌రం ద‌ర్శ‌కులు ఆయ‌న్ని ప్ర‌తి క్ష‌ణం త‌లుచుకుంటూ గురుదేవుడిగానూ కీర్తిస్తున్నారు. ఇటీవ‌లే ఓ టీవీ చానెల్ కార్య‌క్ర‌మంలో సింగీతం సినిమాల్లోని ఆపాత మ‌ధురాల్ని త‌లుచుకుంటూ అనీల్ రావిపూడి ఆయ‌న స‌మ‌క్షంలో ఎన్నో విజ్ఞాన‌దాయ‌క‌మైన విష‌యాల్ని ముచ్చ‌టించారు. అస‌లు ఆరోజుల్లో ద‌ర్శ‌కులంతా నాలుగు పాట‌లు- ఐదు ఫైట్లు అంటూ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ దారిలో ఇన్ బాక్స్ లో వెళుతుంటే మీరేమిటి అలా కొత్త దారిలో వెళ్లారు? అని అనీల్ రావిపూడి సందేహం వ్య‌క్తం చేస్తే.. సింగీతం చెప్పిన ఒకే ఒక్క తెలివైన స‌మాధానం-`ఇన్ బాక్స్ లో ఉండ‌డం చేత‌కాక‌` అంటూ సింపుల్ గా న‌వ్వేశారు. ఆయ‌న చెప్పిన ఆ ఒక్క మాటా నేటిత‌రానికి గొప్ప స్ఫూర్తి అని చెప్పాలి.

ఇన్ బాక్స్ లో ఉండ‌డం చేత‌కాని వాళ్ల టైమ్ న‌డుస్తోందిప్పుడు. ప్ర‌తిదీ కొత్త‌గా వైవిధ్యంగా చూపిస్తేనే నేటి జ‌న‌రేష‌న్ ఆడియెన్ కి ఎక్కుతోంది. ఇంత‌కుముందు చూసేసిన‌ట్టే ఉందే! అంటే ఆ సినిమా ఎంత గొప్ప‌గా ఉన్నా ఆడ‌డం లేదు. ఇటీవ‌ల విజ‌యం సాధిస్తున్న సినిమాల స‌ర‌ళి ప‌రిశీలిస్తే ఔటాఫ్ ది బాక్స్ వెళ్లాలి.. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఏమాత్రం మిస్ కాకూడ‌దు! అన్న‌ది అర్థ‌మ‌వుతోంది. సింగీతం సైతం ఎంత ఔటాఫ్ ది బాక్స్ వెళ్లినా.. తిరిగి తెలుగు బుర్ర‌ల‌కు ఎక్కే సీన్లు- ట్యూన్ల‌ను పాలో అయ్యాన‌ని చెప్పారు. ఇప్పుడైనా న‌వ‌త‌రానికి ఈ ఫార్ములా ఏమిటో అర్థ‌మైంద‌ని భావిద్దాం.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ